స్టాక్‌ మార్కెట్‌లో తెలుగు కంపెనీ సత్తా.. ఇన్వెస్టర్ల ఇంట లాభాల పంట

Megha Group Subsidiary Olectra Greentech Turned To Be New Multibagger In Stock Market - Sakshi

Multibagger Olectra Greentech: స్టాక్‌ మార్కెట్‌ అంటేనే ఉత్తరాది పెత్తనం. అందులోనూ గుజరాతీల హవానే ఎక్కువ. ప్రధాన స్టాక్‌మార్కెట్‌ ముంబైలో ఉండటంతో మహరాష్ట్ర, గుజరాత్‌, రాజస్థాన్‌కి చెందిన వారి మాటే అక్కడ ఎక్కువగా చెల్లుబాటు అవుతోంది. కానీ వారందరిని తలదన్నెలా లాభాల పంట పండిస్తూ అందరీ దృష్టిని ఆకర్షిస్తోంది తెలుగు వ్యక్తులు స్థాపించిన ఒలెక్ట్రా కంపెనీ. కేవలం ఏడాది వ్యవధిలోనే రూపాయికి పది రూపాయల లాభం చూపించి మల్టీ బ్యాగర్‌గా గుర్తింపు పొందింది.

ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీ సంస్థ ఓలెక్ట్రా గ్రీన్‌టెక్‌ కంపెనీ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో సంచలనం సృష్టిస్తున్నాయి. నేషనల్‌ స్టాక్ ఎక్సేంజీలో స్మాల్‌క్యాప్‌ కెటగిరిలో ఉన్న ఈ కంపెనీ షేర్లు ఏడాది కాలంగా ఇన్వెస్టర్లకు కాసుల వర్షం కురిపిస్తున్నాయి. గతేడాది 2020 నవంబరు 9న ఈ కంపెనీ ఒక్క షేరు విలువ రూ.59.55 దగ్గర ట్రేడ్‌ అయ్యింది. సరిగ్గా ఏడాది తిరిగే సరికి 2021 నవంబరు 9 మధ్యాహ్నం 2:30 గంటల సమయానికి ఈ కంపెనీ ఒక్క షేరు విలువ ఏకంగా రూ.649.90 దగ్గర ట్రేడ్‌ అవుతోంది. అంటే ఏడాది కాలంలో ఏకంగా 991 శాతం షేరు విలువ పెరిగింది. నికరంగా ఒక్కో షేరు ధర రూ.590 పెరిగింది.

కోటికి పది కోట్ల రూపాయలు
ఏడాది కిందట లక్ష రూపాయలు ఈ కంపెనీ షేర్లలో పెట్టుబడి పెట్టిన వారికి కేవలం ఏడాది వ్యవధిలోనే సుమారు పది లక్షల రూపాయల వరకు లాభం వచ్చినట్టయ్యింది. కోటి రూపాయలు పెట్టుబడి పెట్టిన వారికి పది కోట్ల రూపాయలను అందించింది. ఈ సీజన్‌లో మల్టీబ్యాగర్‌ షేర్లలో ఒకటిగా ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ నిలిచింది. కొత్తగా షేర్‌ మార్కెట్‌లోకి వచ్చిన వారికి స్టాక్‌ మార్కెట్‌లో లాభాల రుచిని చూపించింది.

ప్రభుత్వ ప్రోత్సహకాలు
వాతావరణ కాలుష్యం తగ్గించాలనే నినాదం ఎప్పటి నుంచో వినిపిస్తున్నా ఆచరణలో పెట్టింది తక్కువ. కానీ కరోనా సంక్షోభం తర్వాత పరిస్థితిలో మార్పు వచ్చింది. వాయు కాలుష్యం తగ్గించే లక్ష్యంతో ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ వాడకానికి ప్రభుత్వం దన్నుగా నిలుస్తోంది. ఫేమ్‌ 1, ఫేమ్‌ 2 పేరుతో ఈవీలకు ప్రోత్సహకాలు అందిస్తోంది. దీంతో ఈవీలకు ఒక్కసారిగా సానుకూల వాతావరణం ఏర్పడింది. ఎలక్ట్రిక్‌ బస్సుల తయారీలో ఒలెక్ట్రా ఉండటం ఈ కంపెనీ షేర్లకు వరంలా మారింది.

పెట్రోలు ధరలు
ప్రభుత్వ విధానాలు సానుకూలంగా ఉండటానికి తోడు చమురు ధరలు సైతం ఒలెక్ట్రా వృద్ధికి పరోక్షంగా సాయం అందించాయి. గత ఏడాది కాలంగా పెట్రోలు, డీజిలు ధరలు అడ్డు అదుపు లేకుండా పెరుగుతుంటంతో సామాన్యులు సైతం పెట్రోలు, డీజిల్‌కి ప్రత్యామ్నాయం ఏంటని ఆలోచించే పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలో ఈవీ రంగంలో రోజుకో స్టార్టప్‌ వెలుగులోకి వస్తుంది. ఈవీ రంగంలో స్టార్టప్‌లకే పరిస్థితే ఎంతో ఆశజనకంగా ఉండగా.. 1992 నుంచి మార్కెట్‌లో ఉన్న ఒలెక్ట్రాకు అది మరింతగా లాభించింది. అందువల్లే ఇన్వెస్టర్లు ఒలెక్ట్రాపై నమ్మకం చూపించారు. ఏడాది కాలంగా షేరు వ్యాల్యూ పెరుగుతున్నా పెట్టుబడి పెట్టేందుకు ముందుకు వస్తూనే ఉన్నారు.

హైదరాబాద్‌ కేంద్రంగా
హైడ్రోమెకానిక్స్‌ విభాగంలో ప్రపంచ వ్యాప్తంగా అనే భారీ ప్రాజెక్టులు చేపడుతోంది  మేఘా ఇంజనీరింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌. తెలుగు వారు స్థాపించిన మేఘా సంస్థ సబ్సిడరీలో ఒకటి ఒలెక్ట్రా గ్రీన్‌టెక్‌ కంపెనీ. హైదరాబాద్‌ కేంద్రంగా 1992లో ఈ సంస్థను స్థాపించారు. పాలిమర్‌ ఇన్సులేలర్లు, ఎలక్ట్రిక్‌ బస్సులను ఈ కంపెనీ తయారు చేస్తోంది. మార్కెట్‌లో చాలా కాలంగా ఉన్నప్పటికీ.. ఇటీవల ఈవీల వాడకం పెరగడంతో ఒక్కసారిగా ఒలెక్ట్రా లైమ్‌లైట్‌లోకి వచ్చింది. స్టాక్‌ మార్కెట్‌లో ఇప్పటి వరకు దక్షిణాదికి చెందిన ఐటీ, ఫార్మా కంపెనీలే హవా కొనసాగించగా ఇప్పుడు మాన్యుఫ్యాక్చరింగ్‌ విభాగం నుంచి ఒలెక్ట్రా సంచలనం సృష్టిస్తోంది.

చదవండి: ఏపీఎస్‌ఆర్‌టీసీ నుంచి ఒలెక్ట్రాకు 100 బస్సుల ఆర్డర్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top