నేటి నుంచి ఈ క్రెడిట్‌/డెబిట్‌ కార్డుల జారీ బంద్‌..!

Mastercard To Stop Issuing New Debit Credit Cards From Today - Sakshi

ముంబై: అమెరికాకు చెందిన మాస్టర్‌కార్డ్‌ నేటి నుంచి కొత్త డెబిట్‌/క్రెడిట్‌ కార్డులను  జారీ చేయదు. కొద్ది రోజుల క్రితం రిజర్వ్‌ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) మాస్టర్‌ కార్డులపై నిషేధం విధించిన విషయం తెలిసిందే. డేటా నిల్వ నిబంధనలను పాటించడంలో విఫలమైనందుకు మాస్టర్‌కార్డ్‌ సేవలను ఆర్‌బీఐ నిలిపివేసింది. ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్లు కొత్త దేశీయ కస్టమర్లలోకి ప్రవేశించలేరని ఆర్‌బీఐ పేర్కొంది. మాస్టర్‌కార్డ్‌ పై నిషేధం విధించడంతో చాలా ప్రైవేటు బ్యాంకులకు అంతరాయం కలిగే అవకాశం ఉంది. పలు ప్రైవేటు బ్యాంకులు తమ ఖాతాదారుల మాస్టర్‌ కార్డ్‌ సేవలను వీసా కార్డు వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో జతకట్టాల్సిన అవకాశం ఏర్పడింది. 

దేశంలోని స్థానిక డేటా నిల్వ నియమాలకు సంబంధించి ఆర్‌బీఐ నుంచి చర్యలు ఎదుర్కొన్న మూడో ప్రధాన చెల్లింపు వ్యవస్థ ఆపరేటర్‌గా మాస్టర్‌కార్డ్‌ నిలిచింది. గతంలో డేటా స్టోరేజ్‌ విషయంలో అమెరికన్ ఎక్స్‌ప్రెస్ బ్యాంకింగ్ కార్ప్, డైనర్స్ క్లబ్ ఇంటర్నేషనల్ సంస్థ కార్డులను ఆర్‌బీఐ నిషేధించింది. కొద్ది రోజుల క్రితం ఆర్‌బీఐ భారత్‌లో బ్యాంకు ఖాతాదారులకు కొత్త మాస్టర్‌కార్డు డెబిట్‌/ క్రెడిట్‌ కార్డులను జారీ చేయకుండా వివరణాత్మక ఉత్తర్వులను విడుదల చేసింది.

ఆర్‌బీఐ తీసుకున్న చర్యతో ప్రస్తుతం దేశంలోని మాస్టర్ కార్డ్ హోల్డర్ల సేవలను ప్రభావితం చేయదని ఆర్‌బీఐ స్పష్టం చేసింది. ఖాతాదారులు ఆర్‌బీఐ నిర్ణయంతో ప్రభావితం కానప్పటికీ బ్యాంక్‌ సేవలు దెబ్బ తినే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. అంతేకాకుండా పలు బ్యాంకులు వీసా వంటి ప్రత్యామ్నాయ సంస్థలతో  కొత్త వాణిజ్య ఒప్పందాలపై సంతకం చేయవలసి ఉన్నందున ఈ చర్య బ్యాంకింగ్ రంగాన్ని గణనీయంగా ప్రభావితం చేస్తుందని బ్యాంకింగ్ అధికారులు సూచించారు. ఈ ప్రక్రియలో భాగంగా బ్యాక్ ఎండ్ టెక్నాలజీ ఇంటిగ్రేషన్‌కు దాదాపు ఐదు నెలలు సమయం పట్టే అవకాశం ఉందని బ్యాంకింగ్‌ అధికారులు పేర్కొన్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top