హోమ్‌వర్క్‌ చెయ్యండి .. మాస్టారు!

Master do homework and calculate the tax burden - Sakshi

‘‘మేము ఉద్యోగం చేస్తున్నాం, సంపాదిస్తున్నాం, సక్రమంగా పన్నులు కట్టి రిటర్నులు వేస్తున్నాం, మాకు ఇంకా హోమ్‌వర్క్‌ ఏమిటండీ’’ అని తీసిపారేయకండి. నిజంగా నూటికి నూరు పాళ్లు స్వయంగా హోమ్‌వర్క్‌ చేసి మీ పన్నుభారాన్ని మీరే లెక్కించుకోండి. ఎవరితోనూ పోల్చుకోవద్దు. పోటీ పడొద్దు. మీ యజమాని లెక్కించిన పన్నుభారాన్ని కూడా నమ్మవద్దు.

2021 మార్చి 31తో పూర్తయ్యే సంవత్సరం ప్రతి అసెస్సీ రెండు విధానాలుగా, రకాలుగా పన్నుభారాన్ని లెక్కించుకోవచ్చు. పాత పద్ధతి ప్రకారం అ న్ని మినహాయింపులు పరిగణిస్తూ పాత శ్లాబుల ప్ర కారం, పాత రేట్ల ప్రకారం పన్నుభారం లెక్కించ డం ఒక విధానం. ఇక రెండోది, కొత్తది సెక్షన్‌ 115  BAC ప్రకారం ఎటువంటి మినహాయింపులు, తగ్గింపులు తీసుకోకుండా కొత్త శ్లాబుల ప్రకారం కొత్త రేట్ల ప్ర కారం పన్నుభారం లెక్కించాలి. 115  BAC ప్రకారం ..     

కొత్త పద్ధతిలో 60 సంవత్సరాలు లోపు ఉన్నా, 60–80 ఏళ్ల సీనియర్‌ అయినా, 80 దాటిన సూపర్‌ సీనియర్‌ అయినా ఇవే రేట్లు. ఈ నేపథ్యంలో ఒక కేసు చూద్దాం. 80 సంవత్సరాలు దాటి పెన్షన్‌ పొందుతున్న శర్మగారు యజమానికి ఏమీ చెప్పకపోవడం వల్ల పాత పద్ధతిలో పన్ను కోశారు. వారి పెన్షను రూ. 11,20,000 కాగా స్టాండర్డ్‌ డిడక్షన్‌ రూ. 50,000 తీసివేసి, పాత రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,25,840గా ఉంటుంది. కానీ కొత్త రేట్ల ప్రకారం పన్ను భారం రూ. 1,02,960గా ఉంటుంది. శర్మగారికి వారి యజమాని రూ. 22,880 ఎక్కువగా కోశారు. ఫారం 16,ఫారం 26 అ లో ఉన్న సమాచారం కూ డా చెక్‌ చేసుకోండి. శర్మగారు కొత్త పద్ధతి ప్రకారం వేసుకుంటే రూ. 22,880 రిఫండు వస్తుంది.

ఒక ప్రభుత్వ సంస్థ ఉద్యోగి ఫారం 26 అ లో రూ. 55 కోట్ల జీఎస్‌టీ టర్నోవరు పడింది. నిజానికి ఆ ఉద్యోగికి ఎటువంటి వ్యాపారం లేదు. కానీ ఆయన పాన్‌ నంబరును ఒక సంస్థ వారు తస్కరించి, వాడుకోవడం వల్ల ఇలా జరిగింది. మరో ఉద్యోగి రావుగారు రిటైర్‌ అయ్యారు. వయస్సు 70 ఏళ్లు. పెన్షన్‌ రూ. 3,00,000, ఇంటి మీద ఆదాయం (నికరంగా) రూ. 3,20,000, 80సి సేవింగ్స్‌ రూ. 1,50,000, 80డి కింద రూ. 30,000, వృత్తి పన్ను రూ. 2,400 కాగా వీరికి టీడీఎస్‌ రూ. 12,000 అనుకుందాం. పాత పద్ధతి ప్రకారం నికర ఆదాయం రూ. 5,00,000 లోపల ఉంది కావున పన్నుభారం లేదు. టీడీఎస్‌ మొత్తం రిఫండు వస్తుంది. కొత్త విధానాన్ని ఎంపిక చేసుకుంటే మొత్తం పన్నుభారం రూ. 25,480, టీడీఎస్‌ పోను అదనంగా కట్టాలి. అంటే వీరికి పాత పద్ధతే బెస్ట్‌.

మీ కేసు, మీ కేసే! శర్మగారితో, రావుగారితో పక్కింటి పరంధామయ్యగారితో, వెనకింటి వెంకట్రావుగారితో పోలిక లేదు. నికర ఆదాయం రూ. 5,00,000 లోపల పాత పద్ధతి ప్రకారం పైసా కూడా పన్ను అవసరం లేదు. కొత్త పద్ధతి అనుసరిస్తే నికర ఆదాయం రూ. 2,50,000 వరకూ పన్ను లేదు. పాత పద్ధతిలో అన్ని మినహాయింపులు పొందవచ్చు. కొత్త పద్ధతిలో సర్వసంగపరిత్యాగిలాగా ఏ మినహాయింపు, తగ్గింపు, ప్రయోజనం పొందడానికి ఉండదు. అందుకే కాస్త ఓపికగా హోమ్‌వర్క్‌ చేసి పన్నుభారాన్ని లెక్కించండి. ఎంపిక చేసుకున్నప్పుడు ఏ తప్పులూ చేయకుండా అంకెలు వేసుకోండి. ఎంపిక చేసుకోండి. ఈ లోపలే స్టేట్‌మెంట్లు రెండు పద్ధతుల్లోనూ చేసుకుని రెడీగా ఉంచుకుని, కావాల్సినది ఎంచుకోండి. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top