ఎలక్ట్రిక్‌ వెహికల్స్‌ తయారీ కోసం జోరు పెంచిన మహీంద్రా!

Mahindra & Mahindra Talks With State Governments To Set Up Manufacturing Unit For Electric Suvs - Sakshi

న్యూఢిల్లీ: విద్యుత్‌ వాహనాల (ఈవీ) తయారీ ప్రారంభించే దిశగా ఆటోమొబైల్‌ దిగ్గజం మహీంద్రా అండ్‌ మహీంద్రా (ఎంఅండ్‌ఎం) ప్రయత్నాలు ముమ్మరం చేస్తోంది. ఇందుకోసం పలు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది. కంపెనీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ జెజూరికర్‌ ఈ విషయాలు తెలిపారు. 

ఈవీలను ప్రస్తుత ప్లాంట్లలోనే తయారు చేస్తారా లేక ప్రత్యేకంగా కొత్త ప్లాంటు ఏర్పాటు చేస్తారా అనే ప్రశ్నకు స్పందిస్తూ ‘మేం అన్ని అవకాశాలనూ పరిశీలిస్తున్నాం’ అని పేర్కొన్నారు. ఎలక్ట్రిక్‌ వాహనాల ఉత్పత్తి కోసం వివిధ రాష్ట్రాలు ఎంత మేర సబ్సిడీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాయో పరిశీలించుకుని, తర్వాత తగు నిర్ణయం తీసుకుంటామని ఆయన చెప్పారు. అయితే, ప్లాంటు ఏర్పాటుకు సబ్సిడీ మాత్రమే ప్రాతిపదిక కాబోదని, వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు తదితర అంశాలు కూడా పరిగణనలోకి తీసుకుంటామని జెజూరికర్‌ తెలిపారు.

‘అసలు ఆటోమోటివ్‌ వ్యవస్థ అనేదే లేని ప్రాంతానికి వెళ్లాము. అది ఆటోమోటివ్‌ హబ్‌ అయి ఉండాలి. వాహనాల తయారీకి అనువైన పరిస్థితులు ఉండి, ఈవీ పెట్టుబడులను ఆకర్షించడంపై దృష్టి పెడుతున్న రాష్ట్రాలు చాలానే ఉన్నాయి. మేము మూడు–నాలుగు అవకాశాలను మదింపు చేసి, తగు నిర్ణయం తీసుకుంటాము’ అని ఆయన పేర్కొన్నారు. మరోవైపు, ఎలక్ట్రిక్‌ స్పోర్ట్స్‌ యుటిలిటీ వాహనాల (ఎస్‌యూవీ) ఎగుమతులపై స్పందిస్తూ.. ఇంకా ఏయే మార్కెట్లకు ఎగుమతి చేయాలన్నది నిర్ణయం తీసుకోలేదని రాజేశ్‌ చెప్పారు.  

ఎంఅండ్‌ఎం ఇటీవలే ఎక్స్‌యూవీ, బీఈ బ్రాండ్‌ కింద అయిదు ఎలక్ట్రిక్‌ వాహనాల మోడల్స్‌ను ప్రదర్శించింది. 2024–2026 మధ్యలో నాలుగు వాహనాలను ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించింది. కంపెనీకి ప్రస్తుతం మహారాష్ట్ర, తమిళనాడు సహా పలు రాష్ట్రాల్లో సంప్రదాయ ఇంధనాలతో పనిచేసే వాహనాల తయారీ ప్లాంట్లు ఉన్నాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top