లగ్జరీ ఇళ్లకు అనూహ్య డిమాండ్‌ Luxury Homes Sales In Jan-Jun Across Top 7 Cities Surpass | Sakshi
Sakshi News home page

లగ్జరీ ఇళ్లకు అనూహ్య డిమాండ్‌

Published Tue, Aug 23 2022 5:28 AM

Luxury Homes Sales In Jan-Jun Across Top 7 Cities Surpass - Sakshi

న్యూఢిల్లీ: ఖరీదైన ఫ్లాట్లు/ఇళ్ల విక్రయాలు (రూ.1.5 కోట్లకు పైన విలువైనవి) దూసుకుపోతున్నాయి. దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఈ ఏడాది జనవరి–జూన్‌ కాలంలో 25,680 యూనిట్లు అమ్ముడుపోయాయి. గడిచిన మూడేళ్ల కాలంలో మొదటి ఆరు నెలల విక్రయాలతో పోలిస్తే అధికంగా నమోదైనట్టు ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ తెలిపింది. 2021 సంవత్సరం మొత్తం విక్రయాలు 21,700తో పోల్చి చూసినా 20 శాతం అధికంగా నమోదయ్యాయి.

ఈ ఏడాది తొలి ఆరు నెలల్లోని మొత్తం విక్రయాల్లో సగం ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌ (ఎంఎంఆర్‌)లోనే నమోదయ్యాయి. ఖరీదైన ఇళ్ల విక్రయాలు ఈ ఏడాది అద్భుతంగా సాగినట్టు అనరాక్‌ పేర్కొంది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, కోల్‌కతా, ఎంఎంఆర్, ఢిల్లీ ఎన్‌సీఆర్, పుణె పట్టణాలకు సంబంధించిన గణాంకాలతో అనరాక్‌ సోమవారం ఓ నివేదిక విడుదల చేసింది. 2020లో 8,470 యూనిట్లు, 2019లో 17,740 యూనిట్లు అమ్ముడుపోవడం గమనించాలి. ‘‘లగ్జరీ ఇళ్ల విక్రయాలు పుంజుకోవడానికి కొన్ని కారణాలున్నాయి.

ఈ ఏడాది చాలా వరకు లగ్జరీ ప్రాజెక్టుల నిర్మాణం పూర్తయింది. కస్టమర్లు వెంటనే గృహ ప్రవేశానికి అనుకూలంగా ఉన్న ఇళ్లకు ప్రాధాన్యం ఇస్తున్నారు’’అని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌పురి తెలిపారు. అధిక ధనవంతులు (హెచ్‌ఎన్‌ఐలు) కరోనా మహమ్మారి సమయంలో స్టాక్‌ మార్కెట్‌ నుంచి లాభాలు సంపాదించారని, దాన్ని వారు ఇప్పుడు రియల్‌ ఎస్టేట్‌పై పెడుతున్నారని చెప్పారు. ‘‘ఉమ్మడి కుటుంబాలు మరింత విశాలమైన ఇళ్లు అవసమని కరోనా సమయంలో అర్థం చేసుకున్నాయి. ఇది కూడా డిమాండ్‌ను పెంచడానికి ఓ కారణం’’అని అనుజ్‌పురి వెల్లడించారు.

వైశాల్యం, వసతులకు ప్రాధాన్యం
‘‘కరోనా తర్వాత కొనుగోలుదారులు ఖరీదైన వసతుల కోసం చూస్తున్నారు. మరింత పెద్ద ఇళ్లను మంచి ట్రాక్‌ రికార్డు కలిగిన డెవలపర్ల నుంచి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు’’అని కల్పతరు డైరెక్టర్‌ ముకేశ్‌ సింగ్‌ తెలిపారు.

పట్టణాల వారీగా..
ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ మధ్య ఖరీదైన ఇళ్ల విక్రయాలను పరిశీలిస్తే.. హైదరాబాద్‌ మార్కెట్లో 2,420 యూనిట్లుగా ఉన్నాయి. 2021లో 1,880 యూనిట్లు, 2020లో 620 యూనిట్లు, 2019లో 500 యూనిట్లు చొప్పున అమ్ముడుపోవడం గమనార్హం. ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 4,160 యూనిట్లు, ఎంఎంఆర్‌లో 13,670 యూనిట్లు, బెంగళూరులో 2,430 యూనిట్లు, పుణెలో 1,460 యూనిట్లు, చెన్నైలో 900 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 630 యూనిట్ల చొప్పున ఈ ఏడాది మొదటి ఆరు నెలల్లో విక్రయాలు నమోదయ్యాయి.   

ఎన్‌ఆర్‌ఐల ఆసక్తి
ప్రవాస భారతీయుల (ఎన్‌ఆర్‌ఐ) నుంచి కూడా ఇళ్లకు డిమాండ్‌ ఉన్నట్టు అనరాక్‌ తెలిపింది. రూపాయి విలువ క్షీణించడాన్ని వారు అనుకూలంగా చూస్తున్నట్టు పేర్కొంది. 2022 మొదటి ఆరు నెలల్లో దేశవ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో 1.84 లక్షల ఇళ్ల యూనిట్లు అమ్ముడుపోయాయి. ఇందులో లగ్జరీ ఇళ్ల వాటా 14 శాతానికి చేరుకుంది. కరోనా రెండో విడత తర్వాత నుంచి ఇళ్ల ధరలు పెరిగినట్టు అనరాక్‌ తెలిపింది. ఇప్పటికీ ఇళ్ల ధరలు సహేతుక స్థాయిలోనే ఉన్నాయని, ఈ రేట్లు ఇంకా పెరగొచ్చని కొనుగోలుదారులు భావిస్తున్నట్టు వెల్లడించింది.

Advertisement
 
Advertisement
 
Advertisement