మూకుమ్మడిగా షాకిచ్చేందుకు సిద్ధమైన బ్యాంకులు..మరింత భారం కానున్న ఈఎంఐలు..ఎంతంటే..?

Loans to Be Costlier as Banks Hike Rates Sbi Axis Revise McLr Upwards - Sakshi

ఇక ఈఎంఐలు భారం..

రుణాలపై వడ్డీ రేట్లు పెంచుతున్న బ్యాంకులు 

0.1 శాతం పెంచిన ఎస్‌బీఐ, బీవోబీ 

అదే బాటలో యాక్సిస్, కోటక్‌ మహీంద్రా కూడా

న్యూఢిల్లీ: గృహ, వాహన, వ్యక్తిగత రుణగ్రహీతలకు ఈఎంఐల భారం పెరిగే దిశగా బ్యాంకులు దాదాపు మూడేళ్ల తర్వాత వడ్డీ రేట్లను పెంచడం ప్రారంభించాయి. ప్రభుత్వ రంగ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ)తో పాటు బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా (బీవోబీ), యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ తమ మార్జినల్‌ కాస్ట్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేట్లను (ఎంసీఎల్‌ఆర్‌) 0.10 శాతం వరకు పెంచాయి. మిగతా బ్యాంకులు కూడా అదే బాట పట్టనున్నాయి. దీంతో ఎంసీఎల్‌ఆర్‌కు అనుసంధానమైన రుణాలు తీసుకున్న వివిధ రకాల రుణగ్రహీతలకు  .. నెలవారీగా చెల్లించాల్సిన వాయిదాలు (ఈఎంఐ) మరింత భారం కానున్నాయి.  

వివరాల్లోకి వెడితే.. ఎస్‌బీఐ తమ ఎంసీఎల్‌ఆర్‌ వివిధ కాలావధులకు సంబంధించి 0.10 శాతం పెంచింది. దీంతో ఏడాది వ్యవధికి ఈ రేటు 7 శాతం నుంచి 7.10 శాతానికి చేరింది. అలాగే, రెండు.. మూడేళ్ల వ్యవధికి సంబంధించిన ఎంసీఎల్‌ఆర్‌ వరుసగా 7.30 శాతం, 7.40 శాతానికి చేరింది. కొత్త ఎంసీఎల్‌ఆర్‌ ఏప్రిల్‌ 15 నుంచి అమల్లోకి వచ్చినట్లు ఎస్‌బీఐ తమ వెబ్‌సైట్లో పేర్కొంది. అటు ప్రభుత్వ రంగానికే చెందిన మరో బ్యాంకు బీవోబీ కూడా ఏడాది వ్యవధి ఎంసీఎల్‌ఆర్‌ను 0.05 శాతం పెంచడంతో ఇది 7.35 శాతానికి చేరింది. ఏప్రిల్‌ 12 నుంచి కొత్త రేటు అమల్లోకి వచ్చింది. ప్రైవేట్‌ రంగ యాక్సిస్‌ బ్యాంక్, కోటక్‌ మహీంద్రా (కేఎంబీ) బ్యాంకులు కూడా ఏడాది కాలావధి ఎంసీఎల్‌ఆర్‌ను సవరించడంతో ఇది 7.40 శాతానికి చేరింది. యాక్సిస్‌ బ్యాంక్‌ కొత్త రేటు ఏప్రిల్‌ 18 నుంచి, కేఎంబీ రేటు ఏప్రిల్‌ 16 నుంచి అమల్లోకివచ్చాయి.

ఈబీఎల్‌ఆర్‌ రేట్లు యథాతథం 
ఎంసీఎల్‌ఆర్‌ ఆధారిత రుణాలపై ఈఎంఐలు స్వల్పంగా పెరగనున్నప్పటికీ .. ఈబీఎల్‌ఆర్, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌ ఆధారిత రుణాల నెలసరి వాయిదాలు యథాతథంగానే కొనసాగనున్నాయి. ఎస్‌బీఐకి సంబంధించి ఎక్స్‌టర్నల్‌ బెంచ్‌మార్క్‌ ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఈబీఎల్‌ఆర్‌) ఏప్రిల్‌ 1 నుంచి 6.65 శాతంగాను, రెపో ఆధారిత రుణాలపై వడ్డీ రేటు (ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌) 6.25 శాతం స్థాయిలో ఉన్నాయి. హౌసింగ్, ఆటో లోన్స్‌ సహా రుణాలు ఇచ్చేటప్పుడు బ్యాంకులు ఈబీఎల్‌ఆర్, ఆర్‌ఎల్‌ఎల్‌ఆర్‌పై కొంత క్రెడిట్‌ రిస్క్‌ ప్రీమియం అధికంగా వసూలు చేస్తున్నాయి. ద్రవ్య పరపతి విధానంలో మార్పుల ప్రయోజనాలు వినియోగదారులకు బదిలీ అయ్యేలా చూసేందుకు ఈబీఎల్‌ఆర్‌ విధానాన్ని పాటించాలంటూ బ్యాంకులకు ఆర్‌బీఐ సూచించింది. దీని ప్రకారం 2019 అక్టోబర్‌ 1 నుంచి బ్యాంకులు.. రుణ మంజూరీలో ఈబీఎల్‌ఆర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి. 

చదవండి: రెరా నిబంధనలు...గృహ కొనుగోలుదారుల ప్రయోజనాలపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు..!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top