ఎల్‌ఐసీ పాలసీల పునరుద్ధరణ ఆఫర్‌

LIC allows customers to revive lapsed policies - Sakshi

నేటి నుంచి మార్చి 25 వరకూ అవకాశం

హైదరాబాద్‌: వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్‌డ్‌) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్‌ఐసీ మరో విడత కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజీకి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్‌ఐసీ ఈ ఆఫర్‌ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్‌ఐసీ ప్రకటించింది. లేట్‌ఫీజులో తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలపైనా లేట్‌ ఫీజులో రాయితీ ఇస్తోంది.

ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాలసీదారులు చివరిగా ప్రీమియం కట్టిన తేదీ నుంచి ఐదేళ్లకు మించకుండా ఉంటే పునరుద్ధరించుకునేందుకు అర్హత ఉంటుంది. రూ.లక్ష వరకు బీమాతో కూడిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంలో 20 శాతం (గరిష్టంగా రూ.2,000) తగ్గింపు పొందొచ్చు. రూ.1– 3 లక్షల మధ్య పాలసీలకు ఆలస్యపు రుసుంలో 25 శాతం (గరిష్టంగా రూ.2,500), రూ.3లక్షలకు పైన రిస్క్‌ కవర్‌తో కూడిన పాలసీలకు ఆలస్యపు రుసుంలో 30 శాతం (గరిష్టంగా రూ.3,000) తగ్గింపునిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్‌ పాలసీలకు అయితే ఆలస్యపు రుసుంలో పూర్తి రాయితీ ఇస్తోంది. అధిక రిస్క్‌ కవర్‌తో ఉంటే టర్మ్‌ ప్లాన ఆలస్యపు రుసుంలో తగ్గింపు ఉండదు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top