breaking news
Policy guidelines
-
ఎల్ఐసీ పాలసీల పునరుద్ధరణ ఆఫర్
హైదరాబాద్: వివిధ కారణాలతో రద్దయిన (ల్యాప్స్డ్) పాలసీలను పునరుద్ధరించుకునే అవకాశాన్ని ఎల్ఐసీ మరో విడత కల్పించింది. కరోనాతో జీవిత బీమా కవరేజీకి ప్రాధాన్యం పెరిగిన క్రమంలో పాలసీదారుల ప్రయోజనాల కోణంలో ఎల్ఐసీ ఈ ఆఫర్ తీసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి మార్చి 25 వరకు పాలసీ పునరుద్ధరణ ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్టు ఎల్ఐసీ ప్రకటించింది. లేట్ఫీజులో తగ్గింపును ఇస్తున్నట్టు తెలిపింది. వైద్య పరీక్షలకు సంబంధించి ఎటువంటి రాయితీలు ఉండవు. హెల్త్, మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలపైనా లేట్ ఫీజులో రాయితీ ఇస్తోంది. ఈ ప్రత్యేక కార్యక్రమంలో భాగంగా పాలసీదారులు చివరిగా ప్రీమియం కట్టిన తేదీ నుంచి ఐదేళ్లకు మించకుండా ఉంటే పునరుద్ధరించుకునేందుకు అర్హత ఉంటుంది. రూ.లక్ష వరకు బీమాతో కూడిన ప్లాన్ల పునరుద్ధరణపై ఆలస్యపు రుసుంలో 20 శాతం (గరిష్టంగా రూ.2,000) తగ్గింపు పొందొచ్చు. రూ.1– 3 లక్షల మధ్య పాలసీలకు ఆలస్యపు రుసుంలో 25 శాతం (గరిష్టంగా రూ.2,500), రూ.3లక్షలకు పైన రిస్క్ కవర్‌తో కూడిన పాలసీలకు ఆలస్యపు రుసుంలో 30 శాతం (గరిష్టంగా రూ.3,000) తగ్గింపునిస్తోంది. మైక్రో ఇన్సూరెన్స్ పాలసీలకు అయితే ఆలస్యపు రుసుంలో పూర్తి రాయితీ ఇస్తోంది. అధిక రిస్క్ కవర్‌తో ఉంటే టర్మ్ ప్లాన ఆలస్యపు రుసుంలో తగ్గింపు ఉండదు. -
ఉమ్మడి పరీక్ష విధానం మార్గదర్శకాల కోసం కమిటీ
ఎస్కేయూ(అనంతపురం): రాష్ట్రంలోని అన్ని యూనివర్సిటీలలో అసిస్టెంట్, అసోసియేట్, ప్రొఫెసర్ పోస్టుల భర్తీకి ఉమ్మడి పరీక్ష విధానం మార్గదర్శకాలు రూపొందించడం కోసం రెండు రోజుల్లో కమిటీని నియమించనున్నట్లు ఏపీ ఉన్నత విద్యామండలి చైర్మన్ ఆచార్య ఎల్.వేణుగోపాల్‌రెడ్డి తెలిపారు. శనివారం ఆయన అనంతపురంలో విలేకరులతో మాట్లాడారు. మొదట ఉమ్మడి పరీక్ష నిర్వహించి.. అనంతరం ఇంటర్వ్యూలను ఆయా వర్సిటీలు చేపట్టేలా నిర్ణయించామన్నారు. ఉమ్మడి పరీక్ష ఎవరు నిర్వహించాలనే అంశంపై కసరత్తు మొదలైందన్నారు. ఇంజనీరింగ్, హ్యూమనిటీస్, సైన్సెస్.. ఇలా ఒక్కో సబ్జెక్టుకు సంబంధించి ఒక్కో వర్సిటీకి ఉమ్మడి పరీక్ష నిర్వహణ బాధ్యత అప్పగించే విషయంపై అధ్యయనం చేస్తున్నట్లు సూత్రప్రాయంగా తెలిపారు.