ఐపీఎల్ మాజీ బాస్ విలాసాల పర్వం
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) సృష్టికర్త, వివాదాస్పద వ్యాపారవేత్త లలిత్ మోడీ మరోసారి వార్తల్లో నిలిచారు. విలాసవంతమైన జీవనశైలికి పెట్టింది పేరుగా నిలిచే మోడీ, తన కుమారుడికి ఇచ్చే ఖరీదైన బహుమతుల గురించి సంచలన విషయాలను పంచుకున్నారు. ఇటీవల మాజీ క్రికెటర్ మైఖేల్ వాఘన్‌తో జరిగిన ఓ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితం, తన కుమారుడి వద్ద ఉన్న అరుదైన కార్ల సేకరణ గురించి ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ!
తన చిన్నతనంలో తండ్రి తనకు కారు కొనివ్వలేదన్న వెలితిని గుర్తు చేసుకుంటూ తన కుమారుడికి అలాంటి పరిస్థితి రాకూడదనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు మోడీ తెలిపారు. ‘నేను ఎదుగుతున్న క్రమంలో మా నాన్న నాకు ఫెరారీ కొనివ్వడానికి ఎప్పుడూ నిరాకరించేవారు. అది చాలా వేగంగా వెళ్తుందని, ప్రమాదకరమని ఆయన భావించేవారు. కానీ నాకు ఫెరారీ అంటే ప్రాణం. నా 40వ పుట్టినరోజున మా బంధువు నాకు మొదటి కారును బహుమతిగా ఇచ్చారు. అప్పుడే నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నా కుమారుడికి 21 ఏళ్లు నిండినప్పటి నుంచి ప్రతి పుట్టినరోజుకూ ఒక ఫెరారీ కారును బహుమతిగా ఇస్తున్నాను’ అన్నారు.
ప్రస్తుతం మోడీ కుమారుడి వయస్సు 32 ఏళ్లు. అంటే, గత 11 ఏళ్లుగా వరుసగా ఆయనకు ఫెరారీ కార్లు అందుతూనే ఉన్నాయి. ఫలితంగా, ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యుత్తమ, ఎక్కువ ఫెరారీ కార్ల సేకరణ కలిగిన వ్యక్తుల్లో ఒకరిగా ఆయన నిలిచారు.
లండన్‌లో తలదాచుకుంటున్న మోడీ
ఒకవైపు కొడుకు కోసం కోట్లు కుమ్మరిస్తూ వార్తల్లో నిలుస్తున్న లలిత్ మోడీ, మరోవైపు భారత చట్టాల నుంచి తప్పించుకుని లండన్‌లో తలదాచుకుంటున్నారు. వివిధ అంచనాల ప్రకారం మోడీ నికర ఆస్తి విలువ 500 మిలియన్ డాలర్ల నుంచి 600 మిలియన్ డాలర్ల (సుమారు రూ.4,000 - రూ.5,000 కోట్లు) వరకు ఉంటుందని సమాచారం. అయితే విదేశాల్లో ఉన్న పెట్టుబడుల కారణంగా దీనిపై కచ్చితమైన అధికారిక లెక్కలు లేవు.
ఐపీఎల్ ఛైర్మన్‌గా ఉన్న సమయంలో ఆర్థిక అవకతవకలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారనే ఆరోపణలతో 2013లో బీసీసీఐ ఆయనపై జీవితకాల నిషేధం విధించింది. 2010 నుంచి లండన్‌లో నివసిస్తున్న మోడీ తనపై ఉన్న ఆరోపణలన్నీ రాజకీయ ప్రేరేపితమని కొట్టిపారేస్తున్నారు. మనీలాండరింగ్ కేసుల్లో ఆయనను భారత్ రప్పించేందుకు దర్యాప్తు సంస్థలు ప్రయత్నిస్తూనే ఉన్నాయి. కోట్ల రూపాయల ప్రజాధనాన్ని కాజేశారనే ఆరోపణలు ఒకవైపు, విదేశీ గడ్డపై విలాసవంతమైన జీవితం, ఖరీదైన కార్ల వేలంపాటలు మరోవైపు.. లలిత్ మోడీ వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. భారత చట్టాలకు చిక్కకుండా ఆయన సాగిస్తున్న ఈ రాయల్ జీవితంపై సామాన్యుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!


