అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే! | AI Overtakes Human Creativity 51% of Internet Content Now Machine Made | Sakshi
Sakshi News home page

అంతర్జాలంలో సగానికి పైగా ఏఐ రాతలే!

Apr 17 2026 2:19 PM | Updated on Apr 17 2026 2:31 PM

AI Overtakes Human Creativity 51% of Internet Content Now Machine Made

సాంకేతిక ప్రపంచంలో ఏఐ విప్లవం రోజురోజుకూ పెరుగుతోంది. నిత్యం ఇంటర్నెట్‌లో చదివే సమాచారంలో సగానికి పైగా కంటెంట్‌ మనుషులు రాసింది కాదు. ప్రతిష్టాత్మక స్టాన్‌ఫోర్డ్ ఏఐ ఇండెక్స్ రిపోర్ట్ 2026 వెల్లడించిన గణాంకాలు ఇప్పుడు యావత్ ప్రపంచాన్ని విస్మయానికి గురిచేస్తున్నాయి.

50 ప్లస్ వరకు..

కేవలం మూడేళ్ల కాలంలో అంతర్జాల ముఖచిత్రం పూర్తిగా మారిపోయింది. నివేదిక ప్రకారం, 2025 ప్రారంభం నుంచి ఇంటర్నెట్‌లో కొత్తగా పుట్టుకొస్తున్న కంటెంట్‌లో 51.72 శాతం వాటా ఏఐ సొంతం చేసుకోగా మానవ మేధస్సుతో సృష్టించిన కంటెంట్ 48.28 శాతానికి పరిమితమైంది.

నవంబర్ 2022: చాట్‌జీపీటీ రాకతో ఏఐ కంటెంట్ ప్రస్థానం దాదాపు సున్నా వద్ద మొదలైంది.

2023-24: అధునాతన టూల్స్ అందుబాటులోకి రావడంతో గ్రాఫ్ వేగంగా పెరిగింది.

2025-26: మొదటిసారిగా మానవ కంటెంట్‌ను ఏఐ అధిగమించింది.

ఎందుకీ పరుగు?

కంపెనీలు, క్రియేటర్లు, చిన్న వ్యాపార సంస్థలు ఏఐ వైపు మొగ్గు చూపడానికి ప్రధానంగా కొన్ని కారణాలు కనిపిస్తున్నాయి. ఒక రచయిత గంటల తరబడి శ్రమించి రాసే వ్యాసాన్ని ఏఐ సెకన్ల వ్యవధిలో సిద్ధం చేస్తోంది. వెబ్‌సైట్‌లకు అవసరమైన భారీ సమాచారాన్ని క్షణాల్లో అందిస్తుంది. పెద్ద సంఖ్యలో కంటెంట్ రైటర్లను నియమించుకోవడం కంటే ఏఐ టూల్స్ వాడటం సంస్థలకు ఆర్థికంగా లాభదాయకంగా మారింది. ముఖ్యంగా ప్రొడక్ట్ డిస్క్రిప్షన్లు, ఎస్‌ఈఓ పేజీలు, సాధారణ ఈమెయిల్స్ వంటి వాటికి ఇప్పుడు ఏఐకే ప్రాధాన్యత ఇస్తున్నారు.

విస్తరిస్తున్న ఏఐ సామ్రాజ్యం

కేవలం బ్లాగులకే పరిమితం కాకుండా ఏఐ ఇప్పుడు అన్ని రంగాల్లోనూ విస్తరించింది. మార్కెటింగ్ కాపీలు, సోషల్ మీడియాలో ఇన్‌స్టాగ్రామ్ క్యాప్షన్ల నుంచి ఫేస్‌బుక్ యాడ్స్ వరకు, కస్టమర్ సపోర్ట్ విభాగంలో రోబోటిక్ మెసేజ్‌లతోపాటు సహజంగా అనిపించే ఏఐ సమాధానాలు.. ఇలా చాలా వాటికి ఏఐ టూల్స్‌ వాడుతున్నారు.

మానవ మేధస్సు పాత్ర ముగిసినట్లేనా?

ఏఐ ఆధిపత్యం పెరిగినప్పటికీ మానవ పర్యవేక్షణ ఇంకా కీలకంగానే ఉంది. ప్రస్తుతం ఇంటర్నెట్‌లో వస్తున్న కంటెంట్‌లో ఎక్కువ భాగం ఒక మిశ్రమ ప్రక్రియ (హైబ్రిడ్‌ ప్రాసెస్‌). ఏఐ ఒక డ్రాఫ్ట్‌ సిద్ధం చేస్తే మనుషులు దాన్ని ఎడిట్ చేయడం, వాస్తవాలను తనిఖీ చేయడం, భాషాలోపాలు సరిదిద్దడం వంటి పనులు చేస్తున్నారు. కంటెంట్‌లో సృజనాత్మకత, భావోద్వేగాల కోసం మనిషి అవసరం ఇంకా ఉందని సాంకేతిక నిపుణుల విశ్లేషిస్తున్నారు.

ఇదీ చదవండి: చల్లబడిన బంగారం ధరల వేడి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement