వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్‌లో జీసెక్‌ | JP Morgan includes India in emerging market debt index | Sakshi
Sakshi News home page

వర్ధమాన మార్కెట్ల ఇండెక్స్‌లో జీసెక్‌

Published Sat, Sep 23 2023 5:04 AM | Last Updated on Sat, Sep 23 2023 5:05 AM

JP Morgan includes India in emerging market debt index - Sakshi

న్యూఢిల్లీ: వచ్చే ఏడాది నుంచి వర్ధమాన మార్కెట్ల(ఈఎం) ఇండెక్స్‌లో భారత ప్రభుత్వ సెక్యూరిటీ(జీసెక్‌)లను చేర్చే ప్రణాళికల్లో ఉన్నట్లు గ్లోబల్‌ ఫైనాన్షియల్‌ దిగ్గజం జేపీ మోర్గాన్‌ తాజాగా పేర్కొంది. దీంతో ప్రభుత్వ బాండ్ల ద్వారా సమీకరించే రుణ వ్యయాలు తగ్గే వీలుంది. భారత ప్రభుత్వ బాండ్ల(ఐజీబీ)ను 2024 జూన్‌ 28 నుంచి 2025 మార్చి 31వరకూ 10 నెలలపాటు ఇండెక్సులో చేర్చనుంది. ఫలితంగా ఇండెక్స్‌ వెయిటేజీ ప్రతీ నెలా ఒక శాతంమేర పెరగనుంది.

వెరసి జీబీఐ–ఈఎం గ్లోబల్‌ డైవర్సిఫైడ్‌ ఇండెక్స్‌లో ఇండియా వెయిటేజీ గరిష్టంగా 10 శాతాన్ని తాకవచ్చని అంచనా. ఇక జీబీఐ–ఈఎం గ్లోబల్‌ ఇండెక్స్‌లో సుమారు 8.7 శాతానికి చేరే వీలున్నట్లు జేపీ మోర్గాన్‌ ఒక ప్రకటనలో వెల్లడించింది. పలు విదేశీ ఫండ్స్‌.. గ్లోబల్‌ ఇండెక్సుల ఆధారంగా పెట్టుబడులు చేపట్టే సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో విదేశీ పెట్టుబడులు భారీగా పుంజుకునేందుకు ఇది సహకరించనుంది. అంతేకాకుండా విదేశాల నుంచి ప్యాసివ్‌ పెట్టుబడులు భారీ స్థాయిలో తరలి వచ్చేందుకు వీలుంటుంది. పరిశ్రమలకు దేశీయంగా మరిన్ని నిధులు అందుబాటులోకి వస్తాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  

ఆహా్వనించదగ్గ పరిణామం
జేపీ మోర్గాన్‌ తాజా ప్రణాళికలపై స్పందనగా.. ఇది ఆహా్వనించదగ్గ పరిణామమంటూ ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి అజయ్‌ సేథ్‌ పేర్కొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థపై విశ్వాసాన్ని పట్టిచూపుతున్నదని వ్యాఖ్యానించారు. ఇది జేపీ మోర్గాన్‌ సొంతంగా తీసుకున్న నిర్ణయంకాగా.. భారత్‌కున్న భారీ వృద్ధి అవకాశాలు, స్థూల ఆర్థిక విధానాలపట్ల ప్రపంచ ఫైనాన్షియల్‌ సంస్థలు, మార్కెట్లకున్న విశ్వాసాన్ని తెలియజేస్తున్నదని ప్రధాన ఆర్థిక సలహాదారు వి.అనంత నాగేశ్వరన్‌ పేర్కొన్నారు. దేశీ మార్కెట్లలో పెట్టుబడుల ద్వారా భారీగా లాభపడుతున్న దీర్ఘకాలిక ఇన్వెస్టర్ల మాదిరి భారత్‌ ప్రభుత్వ బాండ్లలోనూ దీర్ఘకాలిక పెట్టుబడిదారులు లబ్ది పొందుతారని తెలియజేశారు. దేశీ కరెన్సీ బలపడేందుకు వీలుంటుందని అభిప్రాయపడ్డారు. ఇండెక్సులలో లిస్టయ్యే వీటికి లాకిన్‌ అవసరం ఉండదని స్పష్టం చేశారు.   

10 శాతం వాటా
జేపీ మోర్గాన్‌ ఇండెక్స్‌కుగల 240 బిలియన్‌ డాలర్ల విలువలో ఇండియాకు 10 శాతం వాటా లభించనుంది. వెరసి 24 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు వీలుంది. ఇది భారత్‌ బేస్‌ రేటులో మార్పులు తీసుకురానుండగా.. ఈల్డ్‌ భారీగా తగ్గనుంది. దీంతో భారత ప్రభుత్వ రుణ వ్యయాలు దిగిరానున్నట్లు ఏయూఎం క్యాపిటల్‌ నేషనల్‌ హెడ్‌ వెల్త్‌ ముకేష్‌ కొచర్‌ పేర్కొన్నారు. ఇక గ్లోబల్‌ ఇండెక్సులలో ఐజీబీకి చోటు లభించడం ద్వారా రిస్కులకంటే లాభాలే అధికంగా ఉండనున్నట్లు పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడ్డాయి. నెలకు 1.5–2 బిలియన్‌ డాలర్ల పెట్టుబడులకు వీలున్నట్లు యాక్సిస్‌ మ్యూచువల్‌ ఫండ్‌ అంచనా వేసింది. ఇది ప్రపంచస్థాయిలో భారత ప్రొఫైల్‌కు బలిమినివ్వడంతోపాటు.. దేశీయంగా మూలాలు మరింత పటిష్టంకానున్నట్లు అభిప్రాయపడింది. ప్రభుత్వ సెక్యూరిటీలకు డిమాండును మరింత పెంచనున్నట్లు యాంఫి పేర్కొంది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
Advertisement