ఆన్‌లైన్‌లో చక్కర్లు కొడుతున్న జియోబుక్ ల్యాప్‌టాప్‌ ఫీచర్స్‌ ఇవే!

JioBook Laptop Specifications Appear on GeekBench, Check Full Details - Sakshi

భారత్‌ టెలికాం రంగంలో తక్కువ ధరకే ఇంటర్నెట్‌ అందించి రిలయన్స్‌ జియో రికార్డు సృష్టించిన సంగతి మనకు తెలిసిందే. అలాగే, కొద్దిరోజుల క్రితం దీపావళి పండుగా సందర్భంగా 4జీ మొబైల్ మార్కెట్లోకి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా మరో కొత్త ప్రోడక్ట్ ను ఎలక్ట్రానిక్ మార్కెట్లోకి తీసుకొనిరాబోతుంది. జియో త్వరలో తక్కువ ధరకే ‘జియోబుక్‌’ పేరుతో ల్యాప్‌టాప్‌లు కూడా తీసుకొస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం దానికి సంబందించిన పనులు కీలక దశకు చేరుకున్నాయని తెలుస్తుంది. మీడియాటెక్ ఎమ్‌టీ8788 ప్రాసెసర్ ద్వారా నడిచే "జియోబుక్" ల్యాప్‌టాప్‌ ఈ మధ్య గీక్ బెంచ్‌లో కనిపించింది. 

ఈ ల్యాప్ టాప్ 2జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 11 మీద పనిచేయనున్నట్లు చెబుతున్నారు. ఇంతకు ముందు ల్యాప్‌టాప్‌ బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్(బీఐఎస్) సర్టిఫికేషన్ పోర్టల్‌లో కనిపించింది. రిలయన్స్‌ జియో మరో ల్యాప్‌టాప్‌ క్వాల్కామ్ స్నాప్ డ్రాగన్ 665 ప్రాసెసర్, స్నాప్ డ్రాగన్ ఎక్స్12 4జీ మోడెం చేత పని చేయనున్నట్లు తెలుస్తుంది. గీక్ బెంచ్‌లో జియోబుక్ సింగిల్ కోర్ స్కోరు 1,178, మల్టీ కోర్ స్కోరు 4,246 సాధించింది. ఈ ల్యాప్‌టాప్‌ స్పెసిఫికేషన్స్ చూస్తే ప్రధానంగా పాఠశాల విధ్యార్ధులను దృష్టిలో పెట్టుకొని తీసుకొస్తున్నట్లు కనిపిస్తుంది. 

జియోబుక్ స్పెసిఫికేషన్స్
స్పెసిఫికేషన్ల పరంగా.. జియోబుక్ 1,366x768 పిక్సెల్స్ రిజల్యూషన్ స్నాప్‌డ్రాగన్ ఎక్స్12 4జీ ఎల్‌టీఈ మోడెమ్ డిస్ప్లేని కలిగి ఉంది. ల్యాప్‌టాప్‌ తయారీ ఖర్చు తగ్గించడం కోసం ఇందులో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 665 ప్రాసెసర్ తీసుకొనిరానున్నారు. ఇది 11 నానో మీటర్‌ టెక్నాలజీతో పని చేస్తుంది. ఒక మోడల్‌లో 2జీబీ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్ తో పాటు 32జీబీ ఇఎంఎంసి స్టోరేజ్ ఉంది.

మరో మోడల్‌లో 4జీబీ ఎల్‌పిడిడిఆర్ 4ఎక్స్ ర్యామ్, 64జీబీ ఇఎంఎంసి 5.1 స్టోరేజ్ ఉన్నాయి. ఇందులో వీడియోల కోసం మినీ హెచ్‌డీఎంఐ, 5గిగా హెడ్జ్‌ వైఫై సపోర్ట్‌, బ్లూటూత్‌, 3 యాక్సిస్‌ యాక్సెలెరోమీటర్‌, క్వాల్‌కోమ్‌ ఆడియో చిప్‌లను వినియోగించనున్నారు. జియో ల్యాప్‌టాప్‌లను కూడా తక్కువ ధరలోనే తీసుకొస్తుందని టెక్‌ నిపుణులు పేర్కొంటున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top