ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ కార్యాలయాల్లో ఐటీ సర్వే

IT department surveying in Flipkart Instakart -Swiggy offices - Sakshi

సిబ్బంది సరఫరా కంపెనీలపై ఆరా

ఇన్‌వాయిస్‌లు, చెల్లింపులపై సమీక్ష

బెంగళూరు: ఈకామర్స్‌ దిగ్గజం ఫ్లిప్‌కార్ట్‌కు చెందిన ఇన్‌స్టాకార్ట్‌, ఫుడ్‌ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ స్విగ్గీకి చెందిన స్థానిక కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సర్వే చేపట్టినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. ప్రధానంగా ఈ రెండు కంపెనీలకూ సిబ్బందిని సరఫరా చేసిన మెర్లిన్‌ ఫెసిలిటీస్‌ ప్రయివేట్‌, సూర్య టీమ్‌ మేనేజ్‌మెంట్‌లకు చేసిన చెల్లింపులపై ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. ఈ అంశంపై ఆదాయ పన్ను శాఖకు పూర్తి తోడ్పాటును అందిస్తున్న్లట్లు ఫ్లిప్‌కార్ట్‌, స్విగ్గీ విడిగా పేర్కొన్నాయి. పన్ను విధానాలకు అనుగుణంగానే తమ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలియజేశాయి. చట్టాలకు అనుగుణంగా పనిచేసే తాము పన్ను, న్యాయ సంబంధ నిబంధనలను పూర్తిగా పాటిస్తున్నట్లు ఈ సందర్భంగా స్విగ్గీ స్పష్టం చేసింది. ఇదేవిధంగా ఆదాయపన్ను శాఖ అధికారులు తమను సంప్రదించినట్లు ఫ్లిప్‌కార్ట్‌ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. వారికి అవసరమైన సమాచారాన్ని సమగ్రంగా అందిస్తున్నట్లు తెలియజేశారు. 

జీఎస్‌టీ ఎగవేత?
ఇన్‌స్టాకార్ట్‌, స్విగ్గీ జారీ చేసిన ఇన్‌వాయిస్‌లను ఆదాయ పన్ను శాఖ పరిశీలిస్తున్నట్లు సంబంధిత అధికారి ఒకరు పేర్కొన్నారు. సిబ్బందిని సరఫరా చేసిన రెండు కంపెనీలతో స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్‌ రూ. 300-400 కోట్ల లావాదేవీలు నిర్వహించినట్లు తెలుస్తోంది. వీటిపై ఆరాతీస్తున్నట్లు అధికారి తెలియజేశారు. ఈ అంశంలో థర్డ్‌పార్టీ వెండర్స్‌గా వ్యవహరించిన కంపెనీలకు స్విగ్గీ, ఫ్లిప్‌కార్ట్‌ చేపట్టిన చెల్లింపులు, ఇన్‌వాయిస్‌లను సమీక్షిస్తున్నట్లు వివరించారు. ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ క్రెడిట్‌ను పొందేందుకు బోగస్‌ ఇన్‌వాయిస్‌ల సృష్టి జరిగిందా అన్న అంశంపై సర్వే చేపట్టినట్లు ఆంగ్ల మీడియా పేర్కొంది. అక్రమంగా ఇన్‌పుట్‌ ట్యాక్స్‌ పొందడం ద్వారా పన్ను ఎగవేతదారులుగా నిలిచేవారిపై ఇటీవల ఆదాయ పన్ను శాఖ దృష్టిసారించినట్లు తెలియజేసింది.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top