IPO: ఆగస్టులో ఐపీవో స్పీడ్‌ డౌన్‌

Ipo Listing Weakness In August Month - Sakshi

న్యూఢిల్లీ: ఇటీవల కాలంలో దూకుడు చూపుతూ వచ్చిన ప్రైమరీ మార్కెట్‌ గత నెలలో కొంతమేర మందగించింది. అయితే ఇదే సమయంలో సెకండరీ మార్కెట్లు రేసు గుర్రాల్లా దౌడు తీశాయి. ప్రామాణిక ఇండెక్సులు సెన్సెక్స్, నిఫ్టీ సరికొత్త గరిష్టాలకు చేరడం ద్వారా రికార్డులు నెలకొల్పాయి. ఒక్క ఆగస్ట్‌ నెలలోనే 9 శాతం పురోగమించాయి. సెన్సెక్స్‌ 57,000, నిఫ్టీ 17,000 పాయింట్ల మైలురాళ్లను అధిగమించాయి. ఈ జోష్‌తో 10 కంపెనీలు విజయవంతంగా పబ్లిక్‌ ఇష్యూలను పూర్తి చేసుకున్నాయి. తద్వారా స్టాక్‌ ఎక్సే్ఛంజీలలో లిస్టయ్యాయి. అయితే లిస్టింగ్‌లో సగం కంపెనీలు ఇన్వెస్టర్లను నిరాశపరచాయి. వివరాలు ఎలా ఉన్నాయంటే..
  
స్పందన సైతం 
గత కేలండర్‌ ఏడాది(2020)లో అటు ఇన్వెస్టర్ల స్పందనలోనూ.. ఇటు లిస్టింగ్‌ లాభాల్లోనూ జోరు చూపిన ఐపీవోలు ఈ ఏడాది(2021)లోనూ ఇదే ట్రెండ్‌ను కొనసాగించాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22)ను పరిగణిస్తే ఏప్రిల్‌ నుంచి 20 కంపెనీలు పబ్లిక్‌ ఇష్యూలను చేపట్టాయి. రూ. 45,000 కోట్లను సమీకరించాయి. వీటిలో ఆగస్ట్‌లోనే 10 కంపెనీలు ఐపీవోలు పూర్తి చేసుకున్నాయి. అయితే గత నెలకల్లా ఐపీవోల స్పీడ్‌కు బ్రేక్‌ పడింది. ఇష్యూలకు ఇన్వెస్టర్ల నుంచి ఆసక్తి తగ్గింది. దీంతో ఇష్యూ ధరతో పోలిస్తే సగం కంపెనీలు నీరసంగా లిస్టయ్యాయి. ఇందుకు వెల్లువెత్తుతున్న ఇష్యూలు, నాణ్యమైన ఆఫర్లు కరవుకావడం వంటి అంశాలు కారణమైనట్లు జియోజిత్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ రీసెర్చ్‌ హెడ్‌ వినోద్‌ నాయిర్‌ తెలియజేశారు. దీనికితోడు మిడ్, స్మాల్‌ క్యాప్స్‌లో భారీ ఒడిదొడుకులు నమోదుకావడం ప్రభావం చూపినట్లు విశ్లేషించారు. ఆగస్ట్‌లో మిడ్‌ క్యాప్‌ 3.3 శాతం పుంజుకోగా.. స్మాల్‌ క్యాప్‌ 0.5 శాతమే బలపడింది. 

జాబితా ఇదీ 
ఆగస్ట్‌లో గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్, రోలెక్స్‌ రింగ్స్, ఎగ్జారో టైల్స్, విండ్లాస్‌ బయోటెక్, క్రిస్నా డయాగ్నోస్టిక్స్, దేవయాని ఇంటర్నేషనల్, కార్‌ట్రేడ్‌ టెక్, నువోకో విస్టాస్‌ కార్పొరేషన్, కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్, ఆప్టస్‌ వేల్యూ హౌసింగ్‌ ఫైనాన్స్‌ ఇండియా ఐపీవోలను పూర్తి చేసుకుని లిస్టింగ్‌ సాధించాయి. వీటిలో ఐదు కంపెనీలే ఇన్వెస్టర్లకు హుషారునిచ్చాయి. దేవయాని ఇంటర్నేషనల్‌ 37 శాతం, రోలెక్స్‌ రింగ్స్‌ 30 శాతం ప్రీమియంతో లిస్టింగ్‌ను సాధించాయి. ఈ బాటలో ఎగ్జారో టైల్స్‌ 10 శాతం, గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ 4 శాతం లాభాలతో మాత్రమే లిస్టయ్యాయి. ఇక తొలి రోజు క్రిస్నా 4% బలపడింది.  

నష్టాలతో.. 
ఇష్యూ ధరతో పోలిస్తే విండ్లాస్‌ బయోటెక్‌ 11 శాతం నష్టంతో లిస్టయ్యింది. ఇక కార్‌ట్రేడ్‌ టెక్‌ 8 శాతం, నువోకో విస్టాస్‌ 7 శాతం డిస్కౌంట్‌తో నమోదయ్యాయి. కెమ్‌ప్లాస్ట్‌ సన్మార్, ఆప్టస్‌ వేల్యూ ట్రేడింగ్‌ రోజున 1 శాతం చొప్పున నష్టాలతో ముగిశాయి. కాగా.. గత నెలలో వచ్చిన అన్ని ఐపీవోలు సక్సెస్‌ అయినప్పటికీ దేవయాని, రోలెక్స్‌ రింగ్స్‌కు మాత్రమే భారీ స్పందన లభించడం గమనార్హం!

ఐపీవోకు ఈఎస్‌డీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ 
న్యూఢిల్లీ: క్లౌడ్‌ సర్వీసులు, డేటా సెంటిర్ల సంస్థ ఈఎస్‌డీఎస్‌ సాఫ్ట్‌వేర్‌ సొల్యూషన్‌ పబ్లిక్‌ ఇష్యూ చేపట్టే యోచనలో ఉంది. తద్వారా రూ. 1,300 కోట్లు సమకూర్చుకోవాలని ప్రణాళికలు వేసినట్లు సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇందుకు వీలుగా ఈ నెలలోనే క్యాపిటల్‌ మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి ప్రాస్పెక్టస్‌ను దాఖలు చేయనుంది. 2005లో ప్రారంభమైన కంపెనీ క్లౌడ్‌ సర్వీసులు, డేటా సెంటర్లతోపాటు.. ప్రొడక్ట్‌ ఆర్‌అండ్‌డీ తదితర సేవలు అందిస్తోంది. కస్టమర్లలో చిన్నతరహా పరిశ్రమల అభివృద్ధి బ్యాంక్, టాటా క్యాపిటల్, డీసీబీ బ్యాంక్, ముత్తూట్‌ గ్రూప్, యూనియన్‌ బ్యాంక్‌ తదితరాలున్నాయి.  

ఐపీవోకు తొందర లేదు:ఫోన్‌పే
న్యూఢిల్లీ: ఐపీవోకు వెళ్లేందుకు తొందర లేదని ఫోన్‌పే సీఈవో సమీర్‌ నిగమ్‌ స్పష్టం చేశారు. కంపెనీకి అర్ధవంతం, కారణం ఉన్నప్పుడు మాత్రమే వెళ్తామని అన్నారు. ‘కంపెనీ అయిదేళ్ల క్రితం ప్రారంభమైంది. 30 కోట్ల పైచిలుకు కస్టమర్లు ఉన్నారు. ఆర్థిక సేవల్లోకి లోతుగా చొచ్చుకుపోతున్నాం. మ్యూచువల్‌ ఫండ్స్, బీమా విభాగాల్లో గణనీయమైన పెరుగుదలను ఫోన్‌పే నమోదు చేసింది. త్వరలో బీటూబీ అకౌంట్‌ అగ్రిగేటర్‌సహా ఇతర సేవల్లోకి అడుగు పెడుతున్నాం. పోటీ కంపెనీ ఐపీవోకు వెళితే నేను లెక్క చేయను’ అని తెలిపారు. రూ.7.47 లక్షల కోట్ల విలువైన 394.13 కోట్ల లావాదేవీ లను జూన్‌ క్వార్టర్‌లో  ఫోన్‌పే నమోదు చేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top