మార్కెట్‌పై ఉక్రెయిన్‌–రష్యా అనిశ్చితి

Investors prefer to sell in view of the Ukraine-Russia war tensions - Sakshi

అమ్మకాలకే అవకాశం

స్థూల ఆర్థిక గణాంకాలపై దృష్టి

జెరోమ్‌ పావెల్‌ టెస్టిమోనీపై ఇన్వెస్టర్ల కన్ను

నేడు డిసెంబర్‌ క్వార్టర్‌ జీడీపీ గణాంకాలు వెల్లడి

శివరాత్రి సందర్భంగా మంగళవారం సెలవు

ఈ వారం మార్కెట్‌ గమనంపై స్టాక్‌ నిపుణుల అభిప్రాయం

ముంబై: ఉక్రెయిన్‌–రష్యాల మధ్య నెలకొన్న యుద్ధ ఉద్రిక్తతల దృష్ట్యా ఇన్వెస్టర్లు ఈ వారమూ అమ్మకాలకే ప్రాధాన్యత ఇవ్వొచ్చని స్టాక్‌ మార్కెట్‌ నిపుణులు భావిస్తున్నారు. అలాగే కీలక స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో చోటు చేసుకోనున్న అప్రమత్తత విక్రయాలకు ఊతం ఇవ్వొచ్చని చెబుతున్నారు. ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ టెస్టిమోనీపై మార్కెట్‌ వర్గాలు దృష్టి సారించనున్నాయి. దేశీయంగా ఇదే వారంలో విడుదలయ్యే క్యూ3 జీడీపీ, ఫిబ్రవరి తయారీ, సేవల రంగానికి చెందిన పీఎంఐ(పర్చేజింగ్‌ మేనేజర్స్‌ ఇండెక్స్‌) గణాంకాలు, వాహన విక్రయ వివరాలు ట్రేడింగ్‌పై ప్రభావాన్ని చూపొచ్చు. వీటితో డాలర్‌తో రూపాయి మారకం కదలికలు, విదేశీ, దేశీ ఇన్వెస్టర్ల పెట్టుబడుల సరళి స్టాక్‌ మార్కెట్‌పై ట్రేడింగ్‌ ప్రభావితం చేసే ఇతర అంశాలుగా ఉన్నాయి.

ప్రభావితం చేసే అంశాలు..
► ఉక్రెయిన్‌ రష్యా సంక్షోభం  
ఉక్రెయిన్‌ రష్యాల మధ్య కొనసాగుతున్న భీకర యుద్ధంతో భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరుకున్నాయి. రష్యాను అదుపు చేసేందుకు ప్రపంచ దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఉక్రెయిన్‌ ఐక్యరాజ్య సమితిలోని భద్రతా మండలి అత్యవసర మరోసారి అత్యవసర సమావేశాన్ని అభ్యర్థించింది. తాజాగా అంతర్జాతీయ న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. యుద్ధ పరిస్థితులు అదుపులోకి వచ్చేంత వరకు ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో అస్థిర పరిస్థితులు కొనసాగవచ్చు.  

► నేడు క్యూ3 జీడీపీ గణాంకాల విడుదల   
కేంద్ర గణాంకాల శాఖ నేడు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం అక్టోబర్‌–డిసెంబర్‌ త్రైసికం(క్యూ3) జీడీపీ గణాంకాలను ప్రకటించనుంది. సమీక్షిస్తున్న మూడో క్వార్టర్‌లో జీడీపీ వృద్ధి 6.6% నమోదు అవుతుందని బ్రోకరేజ్‌ సంస్థ బార్‌క్లేస్‌ అంచనా వేసింది. ఎస్‌బీఐ రీసెర్చ్‌లు 5.8 శాతంగా నమోదుకావచ్చని భావిస్తోంది. ఇదే రోజున జనవరి నెల పారిశ్రామికోత్పత్తి, ద్రవ్య లోటు గణాంకాలు విడుదల అవుతాయి.  

► రేపు ఆటో అమ్మక డేటా వెల్లడి  
దేశీయ ఆటో కంపెనీలు మంగళవారం(రేపు) ఫిబ్రవరి నెల వాహన అమ్మక గణాంకాల వివరాలను వెల్లడించనున్నాయి. చిప్‌ కొరత కష్టాలు కాస్త తగ్గడంతో వాణిజ్య, ప్యాసింజర్‌ వాహన అమ్మకాల్లో వృద్ధి ఉండొచ్చని పరిశ్రమ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నాయి. అయితే బేస్‌ ఎఫెక్ట్‌ కారణంగా ద్విచక్ర, ట్రాక్టర్‌ విక్రయాల్లో క్షీణత నమోదు కావచ్చని అంటున్నారు. అమ్మక గణాంకాల విడుదల నేపథ్యంలో టాటా మోటార్స్, అశోక్‌ లేలాండ్, మారుతీ సుజుకీ, టీవీఎస్‌ మోటార్స్, జజాజ్‌ ఆటో, ఎస్కార్ట్స్, ఐషర్‌ మోటార్స్, ఎంఅండ్‌ఎం తదితర ఆటో కంపెనీల షేర్లు అధిక వ్యాల్యూమ్స్‌తో ట్రేడ్‌ కావచ్చు.  

► బుధవారం పావెల్‌ టెస్టిమోనీ ప్రసంగం
ఫెడ్‌ రిజర్వ్‌ చైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ అమెరికా కాంగ్రెస్‌ ఎదుట బుధవారం యూఎస్‌ దేశ ఆర్థిక స్థితిగతులపై వివరణ(టెస్టిమోనీ) వివరణ ఇవ్వనున్నారు. పావెల్‌ ప్రసంగంతో అమెరికా ఆర్థిక అవుట్‌లుక్, ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల అంశాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. తాజాగా ఉక్రెయిన్‌ – రష్యా సంఘర్షణ నేపథ్యంలో ద్రవ్యపాలసీపై ఫెడ్‌ రిజర్వ్‌ వైఖరి వెల్లడించనున్నారు.

► తయారీ, సేవల రంగ గణాంకాలు
ఫిబ్రవరి తయారీ రంగ సేవల గణాంకాలు బుధవారం వెల్లడి కానున్నాయి. కోవిడ్‌ వైరస్‌ వ్యాప్తి భయాలు తగ్గడం, లాక్‌డౌన్‌ ఆంక్షలు ఎత్తివేయడంతో కార్యకలాపాలు వేగవంతమయ్యాయి. కావున తయారీ డేటా ఆశించిన స్థాయిలో నమోదుకావచ్చని ఆర్థిక వేత్తలు అంచనా వేస్తున్నారు. ఇదేవారంలో శుక్రవారం జనవరి సేవల రంగ గణాంకాలు విడుదల అవుతాయి. ద్రవ్యోల్బణ ఒత్తిళ్ల నేపథ్యంతో పాటు జనవరిలో కోవిడ్‌ ఆంక్షలతో సేవారంగం నెమ్మదించి ఉండొచ్చని భావిస్తున్నారు.

► వరుసగా ఐదోనెల అమ్మకాలే...  
దేశీయ ఈక్విటీ మార్కెట్లో ఐదో నెల విదేశీ ఇన్వెస్టర్లు నికర అమ్మకందారులుగా నిలిచారు. ఫిబ్రవరిలో మొత్తం రూ.35,506 కోట్ల విలువైన షేర్లను విక్రయించారు. గడచిన ఐదు నెలల్లో మొత్తం రూ.1.84 లక్షల కోట్ల పెట్టుబడులను ఉపసంహరించుకున్నట్లు డిపాజిటరీ గణాంకాలు చెబుతున్నాయి. ఆయా దేశాల కేంద్ర బ్యాంకుల వడ్డీరేట్ల పెంపు భయాలకు తోడు తాజాగా ఉక్రెయిన్‌ రష్యా దేశాల యుద్ధ పరిస్థితులు తోడయ్యాయి.  

‘‘అంతర్జాతీయంగా నెలకొన్న భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తత పరిస్థితులు బేర్స్‌కు సానుకూలంగా ఉన్నాయి. ఈ వారంలో దేశ ఎక్సే్చంజీలు 4 రోజులకే పనిచేయనున్నాయి. దేశీయ ఆర్థిక స్థితిగతులను తెలిపే కీలకమైన స్థూల ఆర్థిక గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు రక్షణాత్మకంగా అప్రమత్తత ధోరణి ప్రదర్శించవచ్చు. నిఫ్టీకి సాంకేతికంగా దిగువ స్థాయిలో 16,200 వద్ద కీలకమైన మద్దతు స్థాయిని కలిగి ఉంది. షార్ట్‌ కవరింగ్‌ కొనుగోళ్లు జరిగితే ఎగువస్థాయిలో 16,900 వద్ద బలమైన నిరోధాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుంది’’ అని మోతీలాల్‌ ఓస్వాల్‌ ఫైనాన్సియల్‌ సర్వీసెస్‌ రిటైల్‌ రీసెర్చ్‌ హెడ్‌ సిద్ధార్థ్‌ ఖేమా తెలిపారు.

ట్రేడింగ్‌ నాలుగు రోజులే...
మహాశివరాత్రి సందర్భంగా మంగళ వారం స్టాక్‌ మార్కెట్‌కు సెలవు కావడంతో ఈ వారంలో ట్రేడింగ్‌ నాలుగురోజులకే పరిమితం కానుంది. రష్యా సైనిక చర్యతో గతవారంలో సెన్సెక్స్‌ 1,974 పాయింట్లు, నిఫ్టీ 618 పాయిం ట్లు చొప్పున నష్టపోయాయి. ఏడు రోజుల వరుస పతనం నేపథ్యంలో వారాంతపు రోజు శుక్రవారం సూచీలు స్వల్పంగా బౌన్స్‌బ్యాక్‌ కావడం మార్కెట్‌ వర్గాలకు ఊరటనిచ్చింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top