క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయొచ్చా? | Sakshi
Sakshi News home page

క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేయొచ్చా?

Published Mon, Jan 8 2024 7:50 AM

Invest In Capital Gain Bonds - Sakshi

ప్రాపర్టీ విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ ఆధారిత సాధనాల్లో ఇన్వెస్ట్‌ చేసుకోవడం మంచిదా? లేక దీర్ఘకాల మూలధన లాభాల పన్ను నుంచి మినహాయింపు కోసం ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఐఆర్‌ఎఫ్‌సీ జారీ చేసే సెక్షన్‌ 54ఈసీ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసుకోవాలా..? – అనిల్‌ మిశ్రా

ప్రాపర్టీని రెండేళ్లకు పైగా కలిగి ఉన్న తర్వాత విక్రయించినప్పుడు వచ్చిన లాభం నుంచి ఇండెక్సేషన్‌ (ద్రవ్యోల్బణ ప్రభావాన్ని మినహాయించడం) చేసిన తర్వాత మిగిలిన మొత్తంపై 20 శాతం పన్ను చెల్లించాల్సి ఉంటుంది.  ప్రాపర్టీని విక్రయించిన ఆరు నెలల్లోపు క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లలో ఇన్వెస్ట్‌ చేసినప్పుడు ఆదాయపన్ను చట్టంలోని సెక్షన్‌ 54ఈసీ కింద రూ.50 లక్షల వరకు లాభాన్ని మూలధన లాభాల నుంచి మినహాయింపునకు అవకాశం ఉంటుంది. రూ.50 లక్షలపై 20 శాతం పన్ను అంటే రూ.10 లక్షల మేర ఆదా చేసుకున్నట్టు అవుతుంది. 

ప్రభుత్వ మద్దతు గల ఆర్‌ఈసీ, పీఎఫ్‌సీ, ఐఆర్‌ఎఫ్‌సీ తదితర ఇన్‌ఫ్రా ఫైనాన్సింగ్‌ కంపెనీలు జారీ చేసే స్థిరాదాయ సాధనాలనే క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లుగా చెబుతారు. క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లు ఐదేళ్ల లాకిన్‌ పీరియడ్‌తో ఉంటాయి. వీటిపై 5.25 శాతం వార్షిక వడ్డీ రేటు వర్తిస్తుంది. ఈ వడ్డీ పన్ను పరిధిలోకి వస్తుంది. వడ్డీ ఆదాయాన్ని ఏటా రిటర్నుల్లో చూపించి పన్ను చెల్లించాల్సి ఉంటుంది. 30 శాతం పన్ను పరిధిలో ఉన్న వారికి నికరంగా లభించే రేటు 3.68 శాతం.  ఈక్విటీ ఫండ్స్‌తో పోల్చి చూసినప్పుడు క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లపై లభించే 5.25 శాతం రేటు చాలా తక్కువ. 

ఫ్లెక్సీక్యాప్‌ ఫండ్‌ గత ఐదేళ్ల కాల సగటు రాబడి 20 శాతంగా ఉంది. ఇప్పుడు పన్ను ఆదా కోసం క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లలో ఐదేళ్ల కాలానికి రూ.50 లక్షలు ఇన్వెస్ట్‌ చేస్తే, 5.25 శాతం రేటు ప్రకారం గడువు తీరిన తర్వాత రూ.63 లక్షలు సమకూరుతుంది. అదే 20 శాతం క్యాపిటల్‌ గెయిన్‌ ట్యాక్స్‌ (రూ.10లక్షలు) చెల్లించి, మిగిలిన రూ.40 లక్షలను ఫ్లెక్సీక్యాప్‌ పథకాల్లో క్రమానుగతంగా ఇన్వెస్ట్‌ చేస్తే ఐదేళ్లలో రూ.70 లక్షలు సమకూరుతుంది. ఈ గణాంకాలను పరిశీలించి చూసినప్పుడు మూలధన లాభాల పన్ను చెల్లించి, ఈక్విటీ మ్యూచువల్‌ ఫండ్‌లో ఇన్వెస్ట్‌ చేయడమే మేలని అనిపిస్తుంది. కానీ, ఈక్విటీల్లో మెరుగైన రాబడి వస్తుందని చెప్పి మొత్తం తీసుకెళ్లి ఇన్వెస్ట్‌ చేయడం సంక్లిష్టం కావచ్చు. 

ఐదేళ్లు, అంతకుమించిన కాలాలకు ఈక్విటీల్లో మెరుగైన రాబడులు వస్తాయి. కానీ ఇదేమీ గ్యారంటీడ్‌ కాదు. ఆటుపోట్లను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లు హామీతో కూడిన రాబడిని ఇస్తాయి. రిస్క్‌ లేని రాబడి కోరుకునేట్టు అయితే, ఐదేళ్ల తర్వాత కచ్చితంగా పెట్టుబడి మొత్తం కావాల్సిన వారు క్యాపిటల్‌ గెయిన్‌ బాండ్లకు వెళ్లొచ్చు. కొంత రిస్క్‌ తీసుకుని, అవసరమైతే ఐదేళ్లకు అదనంగా మరికొంత కాలం పాటు ఇన్వెస్ట్‌ చేసేట్టు అయితే దీర్ఘకాల మూలధన లాభాల పన్ను చెల్లించి మిగిలిన మొత్తాన్ని ఈక్విటీ పథకాలకు కేటాయించుకోవచ్చు.  

ఎస్‌సీఎస్‌ఎస్‌ ఖాతాను ఎనిమిదేళ్ల తర్వాత కూడా పొడిగించుకోవచ్చా..? – గురునాథ్‌

సీనియర్‌ సిటిజన్‌ సేవింగ్స్‌ స్కీమ్‌ (ఎస్‌సీఎస్‌ఎస్‌) నిబంధనల్లో సవరణ చోటు చేసుకుంది. ఈ పథకం కాల వ్యవధి ఐదేళ్లు. ఆ తర్వాత కోరుకుంటే మరో మూడేళ్ల కాలానికి దీన్ని పొడిగించుకోవచ్చు. ఇలా ఒక్కసారి మాత్రమే పొడిగింపునకు అవకాశం ఉండేది. ఆ తర్వాత కూడా అందులోనే ఇన్వెస్ట్‌మెంట్‌ కొనసాగించాలంటే, ఉపసంహరించుకుని మళ్లీ తాజాగా ఖాతా తెరవాల్సి వచ్చేది. ఈ నిబంధనను మార్చారు. ఇకపై ఐదేళ్ల ప్రాథమిక కాల వ్యవధి ముగిసిన తర్వాత నుంచి.. మూడేళ్లకు ఒకసారి చొప్పున ఖాతాను పొడిగించుకుంటూ వెళ్లొచ్చు. అంతేకానీ, ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ కొత్త ఖాతా తెరవాల్సిన అవసరం ఉండదు. 

గడువు పొడిగించే సమయంలో ఉన్న రేటు తదుపరి కాలానికి వర్తిస్తుంది. ఇందులో ప్రస్తుతం 8.2 శాతం వడ్డీ రేటు అమల్లో ఉంది. ఇప్పటికే పెట్టుబడి పెట్టి ఐదేళ్లు పూర్తయి ఉంటే, కొనసాగించుకోవడం వల్ల తదుపరి మూడేళ్ల కాలానికే 8.2 శాతం వడ్డీ రేటు వర్తిస్తుంది. దీనికి బదులు ఆ మొత్తాన్ని వెనక్కి తీసుకుని, తిరిగి తాజాగా ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఐదేళ్ల కాలానికి 8.2 శాతం గరిష్ట రేటును పొందొచ్చు.

Advertisement
 
Advertisement