ఈఎల్‌ఎస్‌ఎస్‌ను అలవాటుగా మార్చుకోండి | Invest in Best Equity Linked Savings Scheme Funds | Sakshi
Sakshi News home page

ఈఎల్‌ఎస్‌ఎస్‌ను అలవాటుగా మార్చుకోండి

Apr 3 2023 5:06 AM | Updated on Apr 3 2023 5:06 AM

Invest in Best Equity Linked Savings Scheme Funds - Sakshi

శ్రీనివాస రావు రావూరి సీఐవో, పీజీఐఎం ఇండియా మ్యుచువల్‌ ఫండ్‌

ఒకవైపు పన్ను భారాన్ని తగ్గించుకుంటూ మరోవైపు సంపదను పెంచుకునేలా పెట్టుబడులను ఉపయోగించుకునేందుకు మంచి అవకాశాలు ఉన్నాయి. ఈక్విటీ ఆధారిత సేవింగ్స్‌ స్కీములు (ఈఎల్‌ఎస్‌ఎస్‌) ఆ కోవకి చెందినవే. ఇలాంటి సాధనంలో ఇన్వెస్ట్‌ చేయడాన్ని అలవాటుగా మార్చుకోవడం వల్ల ఒనగూరే ప్రయోజనాలపై అవగాహన కల్పించేదే ఈ కథనం.

► కష్టమైనదైనా స్థిరంగా, తరచుగా ఒకే పనిని పదే పదే చేయడం వల్ల అలవాటు ఏర్పడుతుంది. ఒకసారి అలవాటుగా మారిన తర్వాత ఆ పని చేయడం కూడా సులువవుతుంది. ఆర్థిక క్రమశిక్షణలోనూ కొన్ని మంచి అలవాట్లు మనల్ని ఎంతగానో ఆదుకుంటాయి. సాధారణంగా మనకు క్రమం తప్పకుండా వచ్చే ఆదాయాలను నిత్యం ఎదురయ్యే అవసరాల కోసం ఖర్చు పెడుతుంటాం. ఈ క్రమంలో పొదుపు చేయడం, పెట్టుబడి పెట్టడం కన్నా ఖర్చు చేయడానికే ప్రాధాన్యం ఇవ్వడమనేది మనకు సులువైన అలవాటుగా మారిపోతుంది. ఎందుకంటే పొదుపు, పెట్టుబడి చేసి తర్వాతెప్పుడో ప్రతిఫలాన్ని అందుకోవడం కన్నా ఇప్పటికిప్పుడు ఖర్చు చేయడం వల్ల తక్షణం కలిగే సంతృప్తి ఎంతో ఎక్కువగా అనిపిస్తుంది. ఇదే ధోరణికి అలవాటు పడిపోయి తీరా ఆర్థిక సంవత్సరం ముగింపు వచ్చేసి, పన్ను భారం భయపెడుతుంటే అప్పుడు ఆ భారాన్ని తప్పించుకునేందుకు మార్గాలను వెదకడం మొదలుపెడుతుంటాం. ఆ ఒత్తిడిలో ఇటు పన్ను భారాన్ని తగ్గించడంతో పాటు మెరుగైన రాబడులను ఇవ్వగలిగే పెట్టుబడి సాధనాలను క్షుణ్నంగా తెలుసుకునే అవకాశాలు కోల్పోతుంటాం. ముందు నుంచే కాస్త జాగ్రత్తపడితే అలాంటి పరిస్థితి ఎదురుకాకుండా చూసుకోవచ్చు.
► వేతనజీవులైన ట్యాక్స్‌పేయర్ల విషయంలో వారి కంపెనీలు పీఎఫ్‌ రూపంలో ప్రతి నెలా ఎంతో కొంత ఆటోమేటిక్‌గా డిడక్ట్‌ చేస్తుంటాయి. పన్ను ఆదా చేసుకునేందుకు సింహభాగం వాటా ఈ రూపంలోనే వెడుతుంటుంది. పన్ను ఆదాకు సంబంధించి సెక్షన్‌ 80సి కింద ప్రావిడెంట్‌ ఫండ్‌ (పీఎఫ్‌) సహా అనేక చాయిస్‌లు ఉన్నాయి. దీనితో ఏది ఎంచుకోవాలనేదానిపై కాస్త సందిగ్ధం ఏర్పడవచ్చు.
► సెక్షన్‌ 80సి కింద పన్ను ఆదా చేసుకునేందుకు ఉపయోగపడే సాధనాల్లో ఈఎల్‌ఎస్‌ఎస్‌ అనేది ఎంతగానో ప్రాచుర్యం పొందింది. దీనితో రెండు రకాల ప్రయోజనాలు ఉంటాయి. పన్నులను ఆదా చేసుకోవడం ఒకటైతే, సంపద సృష్టికి ఉపయోగపడటం రెండోది.


మెరుగైన రాబడులు..
మిగతా సాధనాలతో పోలిస్తే దీర్ఘకాలంలో ఈక్విటీలు మరింత మెరుగైన రాబడులు ఇస్తాయని రుజువైంది. నిఫ్టి 500 టీఆర్‌ఐ గత పదేళ్లలో 13.32 శాతం మేర వార్షిక రాబడులు ఇచ్చింది. మిగతా ట్యాక్స్‌ సేవింగ్‌ సాధనాలతో పోల్చితే ఈఎల్‌ఎస్‌ఎస్‌ లాకిన్‌ పీరియడ్‌ చాలా తక్కువగా మూడేళ్లే ఉంటుంది. కాబట్టి ఈక్విటీలపై ఆసక్తి గల ఇన్వెస్టర్లు ఈ సాధనాన్ని పరిశీలించవచ్చు.

సిప్‌ ప్రయోజనాలు..
మీకు ప్రతి నెలా ఎలాగైతే వేతనం వస్తుందో, పీఎఫ్‌ కటింగ్‌ జరుగుతుందో అదే విధంగా ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేసేందుకు సిస్టమాటిక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాన్‌ (సిప్‌) విధానాన్ని ఎంచుకోవచ్చు. మన ఆర్థిక లక్ష్యాల కోసం పొదుపు చేసేటప్పుడు ఆ ప్రక్రియను ఆటోమేటిక్‌ చేయడం వల్ల ఇన్వెస్ట్‌ చేయడం సులభతరం అవుతుంది. ఆదాయం ఆర్జించడం, ఖర్చు చేయడం, పొదుపు, విందులు.. విహారయాత్రల తరహాలోనే ట్యాక్స్‌ సేవింగ్‌ను కూడా ఒక అలవాటుగా మార్చుకోండి. ఫలితంగా పన్ను ఆదా చేసుకోవడం కోసం ఆఖరు నిమిషంలో హడావిడిగా పరుగులు తీయనక్కర్లేదు.
► సిప్‌ మార్గంలో ఇన్వెస్ట్‌ చేయడం వల్ల కాస్ట్‌ యావరేజింగ్‌ ప్రయోజనాలు పొందవచ్చు. ఈక్విటీలు ఒకోసారి పెరుగుతాయి ఒకోసారి తగ్గుతాయి. ఏకమొత్తంగా ఒకేసారి ఇన్వెస్ట్‌ చేయడం వల్ల ఒకే రేటు దగ్గర కొనుగోలు చేసినట్లవుతుంది. అలా కాకుండా సిప్‌ విధానంలో కాస్త కాస్తగా పెట్టుబడులు పెట్టడం వల్ల కాస్ట్‌ యావరేజింగ్‌ ప్రయోజనాలు పొందవచ్చు. అంటే కొనుగోలు రేటు సగటున తగ్గుతుంది. తత్ఫలితంగా తదుపరి మరింత రాబడులను అందుకోవడానికి ఆస్కారం ఉంటుంది.
► ఈఎల్‌ఎస్‌ఎస్‌లో అవసరమైనప్పుడు మీకు కావాల్సిన విధంగా పెట్టుబడిని పెంచుకునే సౌలభ్యం కూడా ఉంటుంది. ముందుగా మీ పన్ను భారాన్ని తగ్గించుకునేందుకు అవసరమైన మొత్తంతో మొదలుపెట్టండి. క్రమంగా ఆర్థిక సంవత్సరం ఆఖరు నాటికి పెట్టుబడులు ఒకవేళ సెక్షన్‌ 80సి కింద గల రూ. 1.5 లక్షల పరిమితి కన్నా తక్కువగానే ఉంటే కాస్త పెంచుకోండి.
► ఇలా క్రమం తప్పకుండా సిప్‌ ద్వారా ఈఎల్‌ఎస్‌ఎస్‌లో ఇన్వెస్ట్‌ చేయడాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి. ఇటు సంపద సృష్టికి అదనంగా అటు పన్నుల ఆదాను చేసుకునేందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement