
జీవిత బీమా కంపెనీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి రెండు నెలల్లో మెరుగైన వృద్ధిని చూశాయి. న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం (కొత్త పాలసీల ద్వారా) 10.8 శాతం పెరిగింది. లైఫ్ ఇన్సూరెన్స్ కౌన్సిల్ తాజాగా విడుదల చేసిన డేటా ప్రకారం.. మే నెలలో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం 12.6 శాతం పెరిగి రూ.30,463 కోట్లుగా నమోదైంది. క్రితం ఏడాది మే నెలలో ఇది రూ.27,034 కోట్లుగా ఉంది.
ఇక ఏప్రిల్, మే నెలల్లో కలిపి న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.52,427 కోట్లు వసూలైంది. క్రితం ఆర్థిక సంవత్సరం (2024–25) మొదటి రెండు నెలల్లో న్యూ బిజినెస్ ప్రీమియం ఆదాయం రూ.47,293 కోట్లుగా ఉంది. మొదటిసారి బీమా పాలసీల విక్రయంపై కంపెనీలు ప్రత్యేకంగా దృష్టి సారించడం ఈ వృద్ధికి దారితీసింది.
ఇదీ చదవండి: యువతకు సత్య నాదెళ్ల సూచన
ఇండివిడ్యువల్ సింగిల్ ప్రీమియం పాలసీల రూపంలో ఆదాయం 5.21 శాతం పెరిగి మే నెలలో రూ.3,525 కోట్లుగా ఉంది. జీవిత బీమా రంగంలో దిగ్గజ సంస్థ అయిన ఎల్‌ఐసీ న్యూ బిజినెస్ ప్రీమియం మే నెలలో 10.27 శాతం పెరిగి రూ.18,405 కోట్లకు చేరుకుంది. మే నెలలో ఎల్‌ఐసీ గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.79 శాతం వృద్ధి చెందింది. ఏప్రిల్, మే రెండు నెలలకు కలిపి గ్రూప్ ప్రీమియం ఆదాయం 13.66 శాతం పెరిగింది.