ఇన్ఫీలో ఇన్‌సైడర్‌ వివాదం: సెబీ వేటు 

Infosys stock under SEBI radar for insider trading; two employees banned - Sakshi

ఇన్ఫోసిస్‌లో ఇన్‌సైడర్ ట్రేడింగ్‌ ఆరోపణలు

ఇద్దరు ఇన్ఫీ ఎగ్జిక్యూటివ్‌లతోపాటు 8 మందిపై  సెబీ  నిషేధం

సాక్షి,ముంబై: దేశీయ టెక్‌ దిగ్గజం ఇన్ఫోసిస్‌ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ వివాదంలో ఇరుక్కుంది. ఇన్ఫోసిస్‌లో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ చేశార‌న్న ఆరోప‌ణ‌ల‌తో ఎనిమిది మందిపై సెక్యూరిటీస్ అండ్ ఎక్స్‌చేంజ్ ఆఫ్ ఇండియా (సెబీ) నిషేధం విధించింది.  వీరిలో ఇద్దరు ఇన్ఫో ఉద్యోగులు కూడా ఉన్నారు.  వీరిపై  రూ.3.06 కోట్ల జ‌రిమానా విధించడంతోపాటు సెక్యూరిటీలను నేరుగా లేదా పరోక్షంగా కొనుగోలు చేయడం, అమ్మడం లేదా వ్యాపారం చేయకుండా సెబీ నిషేధించింది. గ‌త ఏడాది (జూలై 15, 2020) ఈ ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ వెలుగులోకి వ‌చ్చింది. దీనికిపై సెబీ ప్రాథమిక దర్యాప్తు అనంతరం తాజా నిషేధ ఉత్తర్వులను జారీ చేసింది. 

సెబీ శాశ్వత సభ్యుడు మాధాబి పూరి బుచ్ మే 31న  జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇన్ఫోసిస్ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌ ప్ర‌భు భూత్రా, సీనియర్ ప్రిన్సిపల్ కార్పొరేట్ అకౌంటింగ్ గ్రూప్  వెంకట సుబ్రమణియన్ ల‌ను దోషిగా నిర్ధారించింది. గత ఏడాది ఇన్ఫోసిస్ షేర్లలో ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ జ‌రిగింద‌ని వ‌చ్చిన ఫిర్యాదుపై దర్యాప్తు జరిపినట్లు సెబీ తెలిపింది. ఈ దర్యాప్తులో ఇన్ఫోసిస్‌ ఉద్యోగులు ఇన్‌సైడ‌ర్ ట్రేడింగ్ చేసిన‌ట్లు గుర్తించారు. దీనికి సంబంధించి  వీరి మధ్య టెలిఫోన్‌ సంభాషణలను  కనుగొన్నామని కూడా  సెబీ వెల్లడించింది. ఈ దర్యాప్తులో క్యాపిటల్ వన్ పార్టనర్స్ భరత్ సీ జైన్, టెసోరా క్యాపిటల్, మనీష్ సీ జైన్,  అమిత్ బుత్రాల‌ను కూడా సెబీ దోషిగా తేల్చింది.  దీంతో  బుదవారం నాటి మార్కెట్‌లో ఇన్ఫోసిస్‌ షేరు దాదాపు 2 శాతం నష్టాలతో కొనసాగుతోంది. 

టెసోరా, క్యాపిటల్ వన్ రెండూ షేర్ ధరలకు సంబంధించిన సున్నితమైన సమాచారం ఆధారంగా ఇన్ఫోసిస్ ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ విభాగంలో షేర్లను కొనుగోలు చేసి విక్రయించాయని సెబీ తెలిపింది. ఇన్ఫోసిస్ అధికారి  వెంకట్ సుబ్రమణియన్ ధరల సమాచారాన్ని లీక్ చేసి ఉండవచ్చని సెబీ భావిస్తున్న‌ది. భూత్రాతో సుబ్ర‌మ‌ణియ‌న్‌ నిరంతరం సంప్రదింపులు జరిపిన‌ట్లు అందిన సమాచారం మేర‌కు విచార‌ణ జ‌రిపిన‌ట్లు సెబీ వెల్ల‌డించింది. అటు జూన్ 1 న  సెబీ నిషేధం విషయం తమ దృష్టికి వచ్చిందనీ, ఈ విషయంలో సెబీకి పూర్తిగా సహకరిస్తామనీ, అదనంగా, అంతర్గత దర్యాప్తును ప్రారంభించి, ఫలితాల ఆధారంగా తగిన చర్యలు తీసుకుంటామని ఇన్ఫోసిస్ తెలిపింది. మరోవైపు సంబంధిత పార్టీలు ప్రతిస్పందన లేదా అభ్యంతరాన్ని 21 రోజుల్లో సమర్పించవచ్చు. అలాగే వ్యక్తిగత విచారణను కూడా కోరే అవకాశం ఉంది. 

చదవండి: భారీగా తగ్గిన ఎల్‌పీజీ సిలిండర్‌ ధర
stockmarket: లాభాల స్వీకరణ, ఐటీసీ ఢమాల్‌

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top