గుడ్‌న్యూస్‌ చెప్పిన రైల్వే శాఖ.. జనరల్‌ టికెట్‌ కోసం క్యూలో నిలబడక్కర్లేదు!

Indian Railway Launches New Service UTS App Booking Unreserved Train Tickets - Sakshi

మీ రైల్వే స్టేషన్‌లో గమనిస్తే ప్రయాణికులు జనరల్‌ టికెట్‌ కోసం పొడవైన క్యూలలో నిల్చుని ఉండడం చూసే ఉంటారు. కొన్నిసార్లు, టికెట్‌ కౌంటర్‌ వద్ద ఆలస్యం అయ్యి మీ ప్రయాణం రద్దు కావడమో లేదా టికెట్‌ లేకుండా రైలులో ప్రయాణం చేసి టికెట్‌ కలెక్టర్‌కు జరిమానా కట్టిన ఘటనలు చాలానే ఉన్నాయి. ఈ సమస్యకు పరిష్కారంగా రైల్వే శాఖ తాజాగా సరికొత్త సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

సరికొత్త సేవ..
కేవలం సెకన్ల వ్యవధిలో మీ మొబైల్ ఫోన్‌తో మీ స్థానిక రైలు టికెట్ లేదా ప్లాట్‌ఫారమ్ టిక్కెట్‌ను ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునే వెసలుబాటుని కల్పించనుంది భారతీయ రైల్వే. రోజూ ప్రయాణించే ప్యాసింజర్లలకు లేదా ఆకస్మిక బయట ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా యూటీఎస్ (అన్ రిజ‌ర్వుడ్ టికెట్ బుకింగ్ సిస్ట‌మ్‌) యాప్‌ తీసుకొచ్చింది. 

యూటీఎస్ యాప్ ఇన్‌స్ట‌లేష‌న్
స్మార్ట్ ఫోన్ వినియోగదారులు గూగుల్ ప్లేస్టోర్ నుంచి యూటీఎస్ యాప్ ఇన్‌స్ట‌ల్ చేసుకోవాల్సి ఉంటుంది. మీ మొబైల్‌లోని జీపీఎస్ ఆధారంగా ఈ యాప్ ప‌ని చేస్తుంది. స‌బ‌ర్బ‌న్ ప్రాంతాల వెళ్లే ప్రయాణికులు త‌మ ప‌రిధిలోని రైల్వే స్టేష‌న్‌కు ప్రయాణించేందుకు దీని ద్వారా టికెట్‌ బుక్‌ చేసుకోవచ్చు. ఇప్ప‌టివ‌ర‌కు దీని పరిధి రెండు కి.మీ. దూరంలో ఉంటే..  ఆ దూరాన్ని పెంచనుంది రైల్వేశాఖ.

యూటీఎస్‌ మొబైల్ యాప్‌లను ఉపయోగించే వారు ఈ  నియమాలను పాటించాల్సి ఉంటుంది.

►మీరు ప్రయాణ తేదీకి టికెట్ మాత్రమే బుక్ చేసుకోవాలి.
►టికెట్ బుక్ చేసుకునే సమయంలో మొబైల్ జీపీఎస్ లొకేషన్ ఆన్‌లో ఉండాలి.
►స్టేషన్ ఆవరణకు 5 కి.మీ నుంచి 30 మీటర్ల పరిధిలో ఉన్న ప్రయాణికులు మాత్రమే టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు.
►ATVMలో ప్రయాణికులు పేపర్‌లెస్ టిక్కెట్‌లను ప్రింట్ చేయలేరు. వారికి పేపర్ టిక్కెట్ కావాలంటే, టిక్కెట్ బుకింగ్ సమయంలో వారు ఈ ఎంపికను ఎంచుకోవాలి.
►అన్‌రిజర్వ్‌డ్ టికెట్ బుకింగ్ యాప్‌తో, బుకింగ్ చేసిన 3 గంటల తర్వాత ప్రయాణికులు రైలు ఎక్కాల్సి ఉంటుంది.


►ప్లాట్‌ఫారం టిక్కెట్‌లను బుక్ చేసుకోవడానికి, మీరు స్టేషన్‌కు 2 కిలోమీటర్ల పరిధిలో లేదా రైల్వే ట్రాక్‌కు 15 మీటర్ల దూరంలో ఉండాలి.
►ప్రయాణీకులు 3 నెలలు, 6 నెలలు లేదా సంవత్సరానికి సీజనల్ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు.
►ఒక ప్రయాణీకుడు బుక్ & ప్రింట్ ఎంచుకుంటే. ఆ వ్యక్తికి పేపర్‌ లెస్‌ టికెట్‌తో ప్రయాణించడానికి అనుమతి లేదు.
►మీరు స్టేషన్ ఆవరణలో లేదా రైలులో యూటీఎస్‌ టిక్కెట్‌ను బుక్ చేయలేరు.
►ఎక్స్‌ప్రెస్/మెయిల్/ప్యాసింజర్, సూపర్‌ఫాస్ట్ రైళ్లకు యూటీఎస్‌ టిక్కెట్ బుకింగ్ చెల్లుబాటు అవుతుంది.

చదవండి: ఫోన్‌పే,గూగుల్‌పే, పేటీఎం యూజర్లకు షాక్‌.. యూపీఐ చెల్లింపులపై లిమిట్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top