Indian Inc to Hire More Women Employees in 2023 - Sakshi
Sakshi News home page

మహిళలకు బంపరాఫర్‌.. పిలిచి మరి ఉద్యోగాలిస్తున్న దిగ్గజ కంపెనీలు! ..ఎందుకంటే?

Published Wed, Dec 28 2022 11:00 AM | Last Updated on Wed, Dec 28 2022 12:19 PM

Indian Inc Hire To More Women Employees In 2023 - Sakshi

న్యూఢిల్లీ: కార్పొరేట్‌ సంస్థలు మరింత మంది మహిళలను ఉద్యోగాల్లోకి తీసుకోవాలని అనుకుంటున్నాయి. కాగ్నిజంట్, ఎల్‌అండ్‌టీ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐటీసీ, కేపీఎంజీ, యాక్సిస్‌ బ్యాంకు, ష్నీడర్‌ ఎలక్ట్రిక్, సిప్లా, ప్రోక్టర్‌ అండ్‌ గ్యాంబుల్‌ తదితర ఎన్నో సంస్థలు తమ ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల నిష్పత్తి మరింత మెరుగ్గా ఉండాలని కోరుకుంటున్నాయి. ఇప్పటి వరకు మహిళల ప్రాతినిధ్యం తక్కువగా ఉండగా, మరింత పెంచాలని భావిస్తున్నాయి. ఇందుకు సంబంధించి చర్యలను కొన్ని సంస్థలు ఇప్పటికే అమలు చేస్తున్నాయి. 

సౌకర్యవంతంగా పనిచేసే ఏర్పాట్లు చేయడం, ట్రైనీలుగా, ఫ్రెషర్లుగా క్యాంపస్‌ల నుంచి తీసుకోవడం, సీనియర్‌ స్థాయిలో మార్గదర్శకులుగా నియమించుకోవడం, టీమ్‌ లీడ్‌ బాధ్యతల్లోకి మహిళలను తీసుకోవడం వంటివి సంస్థలు అమలు చేస్తున్నాయి. సెకండర్‌ కెరీర్‌ (విరామం తర్వాత మళ్లీ చేరడం) మహిలకు సైతం ప్రాధాన్యత ఇస్తున్నాయి.  

మంచి ఐడియాలకు నాంది 
ఉద్యోగుల్లో స్త్రీ/పురుషుల పరంగా మంచి వైవిధ్యం ఉంటే మెరుగైన ఆలోచనలు, ఆవిష్కరణలకు అవకాశం ఉంటుందని ఎల్‌అండ్‌టీ కార్పొరేట్‌ హ్యుమన్‌ రీసెర్సెస్‌ హెడ్‌ సి.జయకుమార్‌ తెలిపారు. వైవిధ్యంతో కూడిన బృందం ఇతరులతో పోలిస్తే ఎంత మెరుగైన ఫలితాలు ఇస్తుందనే దానిపై అధ్యయనాలు కూడా ఉన్నట్టు చెప్పారు. మంచి నైపుణ్యాలు కలిగిన మహిళా ఉద్యోగులను తాము కోల్పోకూడదనే ఉద్దేశ్యంతో ఉన్నట్టు పేర్కొన్నారు. మహిళలను ఆకర్షించేందుకు పనిలో సౌకర్యంపై దృష్టి పెట్టాలని చాలా కంపెనీల అభిప్రాయపడుతున్నాయి. 

ఐటీసీ అయితే మహిళా ఉద్యోగుల విధుల నిర్వహణలో మరిన్ని సౌకర్యాలు కల్పిస్తోంది. చంటి పిల్లలు ఉన్న ఉద్యోగినులకు సంరక్షకుల సేవలు, ప్రత్యేక రవాణా వసతులను సైతం సమకూరుస్తోంది. యాక్సిస్‌ బ్యాంకు అయితే ప్రత్యామ్నాయ పని నమూనాలతో నైపుణ్యాలు కలిగిన మహిళలను ఆకర్షిస్తోంది. ‘గిగ్‌–ఏ’ అవకాశాల పేరుతో ఓ ప్రత్యేక కార్యక్రమం కింద 44 శాతం అధికంగా మహిళలను నియమించుకున్నట్టు బ్యాంక్‌ హెచ్‌ హెడ్‌ రాజ్‌కమల్‌ వెంపటి తెలిపారు.

పోటీతత్వం.. 
ఎల్‌అండ్‌టీ మహిళల డిమాండ్లను సానుకూల దృక్పథంతో పరిశీలిస్తోంది. ఎవరైనా వేరే పట్టణానికి బదిలీ చేయాలని కోరితే, సాధ్యమైన మేర వారు కోరిన ప్రాంతంలో సర్దుబాటుకు ప్రయత్నిస్తోంది. వైవిధ్యమైన మానవ వనరులతో పోటీతత్వం పెరుగుతుందని ఐటీసీ కార్పొరేట్‌ హ్యూమన్‌ రీసోర్సెస్‌ హెడ్‌ అమితవ్‌ ముఖర్జి  పేర్కొన్నారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌లో లింగ నిష్పత్తి ప్రస్తుతం 23.3 శాతంగా ఉంది. అంటే ప్రతి 100 మందికి గాను 23 మంది మహిళా ఉద్యోగులు పనిచేస్తున్నారు. 

వైవిధ్యాన్ని పెంచడం కోసం గత కొన్ని త్రైమాసికాలుగా బ్యాంక్‌ తీసుకుంటున్న చర్యలతో ఇది పెరుగుతూ వస్తోంది. ఇందుకోసం ఓ నిర్మాణాత్మక విధానాన్ని అనుసరిస్తోంది. క్యాంపస్‌ నియామకాలకు ఇచ్చినంత ప్రాధాన్యాన్ని, సెకండ్‌ కెరీర్‌ మహిళల విషయంలోనూ కంపెనీలు చూపిస్తుండడం సానుకూలం. అధిక నైపుణ్యాలు, సామర్థ్యాలు ఉన్న మహిళలు తిరిగి చేరేందుకు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ ఆహ్వానం పలుకుతోంది. ఇందుకు రెండు విధానాలను అనుసరిస్తోంది. 

పిల్లల కోసం కెరీర్‌ బ్రేక్‌ తీసుకున్న వారిని తిరిగి నియమించుకోవడం, గత ఐదేళ్లలో సంస్థను వీడిని వారిని ప్రత్యేకంగా ఆహ్వానించడం చేస్తోంది. ఉన్న మహిళా ఉద్యోగులను కాపాడుకోవడం, కొత్త వారికి అవకాశాలు ఇవ్వడాన్ని కాగ్నిజంట్‌ అనుసరిస్తోంది. 2020 నుంచి డైరెక్టర్, ఆ పై స్థాయి వారికి ఇందుకోసం ప్రత్యేకంగా బాధ్యతలు అప్పగించింది. 

చదవండి👉 ఐటీ జాబ్‌ పొందడమే మీ లక్ష్యమా? రెజ్యూమ్‌లో ఈ తప్పులు చేయకండి!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
Advertisement
 
Advertisement
 
Advertisement