వేతనాలు 10 శాతం పెంచే చాన్స్‌

Indian employees likely to see 10percent median salary increase in 2023 - Sakshi

2023పై విల్లిస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక

ముంబై: భారత్‌లోని కంపెనీలు తమ ఉద్యోగులకు వచ్చే ఏడాది 10 శాతం వేతనం పెంచే అవకాశం ఉందని అడ్వైజరీ, బ్రోకింగ్, సొల్యూషన్స్‌ కంపెనీ విల్లిస్‌ టవర్స్‌ వాట్సన్‌ నివేదిక తెలిపింది. ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో ఇదే అధికం అని వెల్లడించింది. ప్రస్తుత సంవత్సరంలో జీతాలు 9.5% అధికం అయ్యాయని వివరించింది. ‘ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బ్యాంకింగ్, టెక్నాలజీ, మీడియా, గేమింగ్‌ రంగాల్లో వేతనాలు అత్యధికంగా 10–10.4 శాతం పెరగనున్నాయి.

ఈ రంగాల్లో 2022లో ఇప్పటికే గణనీయంగా సాలరీలు పెరిగాయి. పెంపు 2023లోనూ ఇదే తరహాలో ఉండనుంది. గత ఏడాదితో పోలిస్తే దేశంలోని కంపెనీల యజమానుల్లో 58 శాతం ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో అధిక జీతాల పెంపుదల కోసం బడ్జెట్‌ను కేటాయించారు. 24.4% ఎటువంటి మార్పు చేయలేదు. 5.4% మంది తగ్గించారు. వచ్చే 12 నెలలు ఆదాయం మెరుగ్గా ఉంటుందని 42 శాతం కంపెనీలు భావిస్తున్నాయి. తిరోగమనం ఉండొచ్చని 7.2 శాతం కంపెనీలు అభిప్రాయపడ్డాయి’ అని నివేదిక వెల్లడించింది.   

డిజిటల్‌ నిపుణుల కోసం..
‘తదుపరి 12 నెలల్లో ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ, ఇంజనీరింగ్, అమ్మకాలు, సాంకేతికంగా నైపుణ్యం కలిగిన వ్యాపారాలు, ఫైనాన్స్‌ రంగాల్లో నియామకాలు ఉంటాయి. డిజిటల్‌ నైపుణ్యాలు కలిగిన వారి కోసం డిమాండ్‌ ఉండడం వేతనాల పెంపునకు కారణం అవుతోంది. హాంకాంగ్‌ తర్వాత రెండవ స్థానంలో ఉన్న భారత్‌లో స్వచ్ఛంద అట్రిషన్‌ అత్యధికంగా 15.1 శాతంగా కొనసాగుతోంది’ అని నివేదిక వివరించింది.

గత సంవత్సరం బడ్జెట్ల కంటే వాస్తవ జీతాల పెంపుదల ఎక్కువగా ఉంది. ఊహించిన దాని కంటే మెరుగైన వ్యాపార పనితీరు, ప్రతిభను నిలుపుకోవాల్సిన అవసరం కారణంగా వేతన సవరణ జరిగిందని విల్లిస్‌ టవర్స్‌ వాట్సన్‌ కన్సల్టింగ్‌ ప్రతినిధి రాజుల్‌ మాథుర్‌ తెలిపారు. ఇక చైనా 6 శాతం, హాంగ్‌కాంగ్‌ 4, సింగపూర్‌ 4 శాతం వేతనాలు పెంచే చాన్స్‌ ఉంది. 2022 ఏప్రిల్‌–మే నెలల్లో 168 దేశాల్లో సర్వే జరిగింది. భారత్‌ నుంచి 590 కంపెనీలు పాలుపంచుకున్నాయి.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top