ఊహించని ఘోరం.. విమానప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి | Indian Business Titans Mourn Ahmedabad Air Tragedy | Sakshi
Sakshi News home page

ఊహించని ఘోరం.. విమానప్రమాదంపై అదానీ దిగ్భ్రాంతి

Jun 12 2025 5:50 PM | Updated on Jun 12 2025 6:54 PM

Indian Business Titans Mourn Ahmedabad Air Tragedy

అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదంపై పలువురు వ్యాపార ప్రముఖులు స్పందించారు. ఘటన పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్, అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌ నత్వానీ తదితరులు ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.

ఘటనపై టాటా సన్స్, ఎయిరిండియా చైర్మన్ ఎన్ చంద్రశేఖరన్ ఒక ప్రకటన విడుదల చేశారు. "అహ్మదాబాద్-లండన్ గాట్విక్  ఎయిరిండియా విమానం 171 ఈ రోజు ఘోర ప్రమాదానికి గురైందని నేను తీవ్ర విచారంతో ధ్రువీకరిస్తున్నాను. ఈ వినాశకరమైన సంఘటనతో ప్రభావితమైన వారందరి కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలియజేస్తున్నాము. ఈ సమయంలో, మా ప్రాథమిక దృష్టి బాధితులందరికీ, వారి కుటుంబాలకు మద్దతు ఇవ్వడంపై ఉంది. సంఘటనా స్థలంలో అత్యవసర ప్రతిస్పందన బృందాలకు సహాయపడటానికి, ప్రభావితులకు అవసరమైన మద్దతు, సహకారం అందించడానికి మేము మా శక్తి మేరకు కృషి చేస్తున్నాము" అని పేర్కొన్నారు.

అహ్మదాబాద్ విమానాశ్రయాన్ని నిర్వహిస్తున్న అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ ఘటనపై స్పందిస్తూ ఎక్స్‌లో పోస్ట్ చేశారు. "ఎయిరిండియా ఫ్లైట్ 171 దుర్ఘటనతో మేము దిగ్భ్రాంతికి గురయ్యాము. ఊహించని నష్టాన్ని చవిచూసిన బాధిత కుటుంబాల వైపు మా హృదయాలు ద్రవిస్తున్నాయి. అధికారులందరితో కలిసి పనిచేస్తున్నాం. క్షేత్రస్థాయిలో బాధిత కుటుంబాలకు పూర్తి సహకారం అందిస్తున్నాం" అని రాసుకొచ్చారు.

👉ఇదీ చదవండి: విమానం క్రాష్‌ దెబ్బకు బోయింగ్‌ షేర్లూ క్రాష్‌

పారిశ్రామికవేత్త, రాజ్యసభ ఎంపీ పరిమళ్‌ నత్వానీ కూడా ప్రమాదంపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘అహ్మదాబాద్-లండన్ విమానం కూలిన విషాద ఘటనతో తీవ్ర దిగ్భ్రాంతికి, ఆవేదనకు గురయ్యాను. నా ఆలోచనలు, ప్రార్థనలు విమానంలో ఉన్న వారు, ప్రభావిత ప్రాంత నివాసితుల వైపే ఉన్నాయి. ప్రతి ఒక్కరి భద్రత,సత్వర అత్యవసర ప్రతిస్పందన కోసం ఆకాంక్షిస్తున్నాను’ అంటూ ఘటన జరిగిన వెంటనే ‘ఎక్స్‌’లో పోస్ట్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement