
న్యూఢిల్లీ: స్టాక్ మార్కెట్లలో పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో ఆసక్తి పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ స్టాక్ ఎక్సే్చంజ్ (ఎన్‌ఎస్‌ఈ)లో ట్రేడింగ్ ఖాతాల సంఖ్య జూలైలో 23 కోట్ల స్థాయిని దాటింది. అకౌంట్ల సంఖ్య ఏప్రిల్‌లో 22 కోట్ల మార్కును దాటగా కేవలం మూడు నెలల్లోనే మరో 1 కోటి అకౌంట్లు జతయ్యాయి. మహారాష్ట్ర నుంచి అత్యధికంగా 4 కోట్ల ఖాతాలు (మొత్తం అకౌంట్లలో 17 శాతం) ఉండగా, తర్వాత స్థానాల్లో ఉత్తర్‌ప్రదేశ్ (2.5 కోట్లు, 11 శాతం వాటా), గుజరాత్ (2 కోట్లకు పైగా, 9 శాతం వాటా), పశ్చిమ బెంగాల్..రాజస్థాన్ (చెరి 1.3 కోట్లు, 6 శాతం వాటా) ఉన్నాయి.
మొత్తం ఇన్వెస్టర్ అకౌంట్లలో దాదాపు సగ భాగం వాటా ఈ అయిదు రాష్ట్రాలదే ఉంది. టాప్ 10 రాష్ట్రాల వాటా నాలుగింట మూడొంతులు ఉందని ఎన్‌ఎస్‌ఈ వెల్లడించింది. విశిష్ట ఖాతాదారుల సంఖ్య 11.8 కోట్లుగా ఉంది. సాధారణంగా ఒకే ఇన్వెస్టరు పలు బ్రోకరేజీ సంస్థల్లో అకౌంట్లు తీసుకోవచ్చు. ఇన్వెస్టర్లలో యువత, మొదటిసారిగా పెట్టుబడులు పెట్టేవారి సంఖ్య గణనీయంగా పెరుగుతోందని ఎన్‌ఎస్‌ఈ వివరించింది. డిజిటలీకరణ వేగవంతం కావడం, మొబైల్ ఆధారిత ట్రేడింగ్ సొల్యూషన్స్ విస్తృతంగా వినియోగంలోకి రావడం తదితర అంశాలు ఇన్వెస్టర్ల సంఖ్య పెరగడానికి కారణమని సంస్థ చీఫ్ బిజినెస్ డెవలప్‌మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ తెలిపారు.