
ఎయిరిండియా విమాన దుర్ఘటనపై కొనసాగుతున్న దర్యాప్తులో పైలట్లకు భాగస్వామ్యం కల్పించాలని, సాంకేతిక నిపుణులను కూడా తీసుకోవాలని భారత ఎయిర్లైన్ పైలట్ల సంఘం(ఆల్పా ఇండియా) తీవ్రంగా పట్టుపడుతోంది. పైలట్ల సంఘం ఈమేరకు తమ డిమాండ్లను పలుమార్లు విమాన ప్రమాద దర్యాప్తు బ్యూరో (ఏఏఐబీ) ముందుంచింది. దీంతో ఏఏఐబీ కూడా సానుకూలంగా స్పందించింది. ఎయిరిండియాలో గతంలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ గా పనిచేసిన మాజీ పైలట్ కెప్టెన్ ఆర్‌ఎస్ సంధును ఏఏఐబీ రంగంలోకి దించుతోంది. గత నెల 12న అహ్మదాబాద్ వద్ద ఎయిరిండియాకు చెందిన బోయింగ్ 787-8 విమానం కూలిపోయి 260 మంది చనిపోయిన సంగతి తెలిసిందే.
విమాన దుర్ఘటనపై దర్యాప్తు నిర్వహిస్తున్న బృందంలో ‘డొమైన్ ఎక్స్పర్ట్’గా చేరాలని ఆర్‌ఎస్ సంధును ఏఏఐబీ కోరిందని, అందుకు ఆయన అంగీకరించారని కొన్ని వర్గాలను ఉటంకిస్తూ ‘హిందుస్థాన్ టైమ్స్’ పత్రిక వెల్లడించింది. వైమానిక రంగంలో విశేషానుభవం గడించిన, విషయ పరిజ్ఞానం గల నిపుణుడిగా (డొమైన్ ఎక్స్పర్ట్)గా ఆర్‌ఎస్ సంధుకు పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఎయిరిండియాలో మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్ అయిన ఆర్‌ఎస్ సంధుకు విమానయాన పరిశ్రమలో దాదాపు 39 ఏళ్ల వృత్తిపరమైన అనుభవం ఉంది. ఎయిరిండియాలో డైరెక్టర్ ఆఫ్ ఆపరేషన్స్ హోదాలో సేవలందించారు.
2013లో ప్రత్యేకించి బోయింగ్ 787-8 విమానాల శ్రేణికి పరిశీలకుడిగా (డెజిగ్నేటెడ్ ఎగ్జామినర్)గా వ్యవహరించారు. ప్రస్తుతం ఆయన ‘ఏవియాజియోన్’ పేరుతో ఏవియేషన్ కన్సల్టెన్సీ సంస్థను నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా బోయింగ్ 787 విమానాల విషయంలో ఆర్‌ఎస్ సంధుకు సుదీర్ఘానుభవం, సాంకేతిక పరిజ్ఞానం ఉన్నందున ప్రస్తుతం కొనసాగుతున్న దర్యాప్తులో ఆయన మరింత లోతుకెళ్లడంతోపాటు దర్యాప్తుకు విశ్వసనీయత కల్పిస్తారని భావిస్తున్నారు. మరోవైపు- దర్యాప్తులో సహకారం అందిస్తున్న ఇతర ‘డొమైన్ ఎక్స్పర్ట్స్’ పేర్లను ఏఏఐబీ వెల్లడించలేదు. సంజీవ్ కుమార్ సింగ్ (56) నేతృత్వంలోని ఐదుగురు సభ్యుల బృందం ఎయిరిండియా విమాన దుర్ఘటనపై దర్యాప్తు చేస్తోంది.
- జమ్ముల శ్రీకాంత్