
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 2026 ఆర్థిక సంవత్సరంలో మొత్తం సిబ్బందిలో 2% మంది(సుమారు 12,000) ఉద్యోగులను తొలగించే ప్రణాళికలను ప్రకటించిన నేపథ్యంలో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. సామాజిక మాధ్యమాలు వేదికగా కంపెనీ సీఈఓ కృతివాసన్ వేతన భత్యాలను కోట్ చేస్తూ పోస్ట్‌లు వెలుస్తున్నాయి. ముఖ్యంగా కంపెనీ లాభదాయకంగా ఉంటూ ఇలా లేఆఫ్స్ ప్రకటిస్తుండడంపై ఉద్యోగులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాలు వేదికగా టీసీఎస్ సీఈఓ కృతివాసన్ రూ.26.52 కోట్ల ప్యాకేజీపై తీవ్ర చర్చ సాగుతోంది. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆయన మొత్తం ప్యాకేజీ బేస్ జీతం రూ.1.39 కోట్లు, బెనిఫిట్స్ అండ్ అలవెన్స్‌లు రూ .2.12 కోట్లు, కమిషన్లలో రూ.23 కోట్లుగా ఉన్నాయని కొందరు పోస్ట్ చేశారు. దాంతో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్ (గతంలో ట్విట్టర్)లో తన వేతన భత్యాలపై స్పందించారు.
ఇదీ చదవండి: మళ్లీ భాగ్యనగరంలో భూముల వేలం
‘బలమైన భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న సంస్థను నిర్మించడానికి 12,000 మంది ఉద్యోగులను తొలగించాలి. వాస్తవానికి, కంపెనీ చాలా ముఖ్యమైంది. ఉద్యోగులు జీవితాలు ఏమైనా ఫర్వాలేదు’ అని ఒక నెటిజన్ రిప్లై ఇచ్చారు. ఎగ్జిక్యూటివ్ వేతనాల్లో కోత విధించాలని కొందరు డిమాండ్ చేయగా, మరికొందరు టీసీఎస్ ఛైర్మన్లు ఏడాదికి రూ.150 కోట్లు తీసుకుంటున్నారని ప్రచారం చేస్తున్నారు. ఉద్యోగుల తొలగింపు వ్యూహాత్మకమే తప్పా, ఆర్థిక సమస్య కాదని కంపెనీ మద్దతుదారులు అంటున్నారు. కొంతమంది ఈ నిర్ణయాన్ని సమర్థించారు. ఇది ప్రతిభను పునర్నిర్మించే చర్యగా చూడాలని తెలిపారు. ఖర్చు ఆదా చేసే చర్య కాదన్నారు. మరో నెటిజన్ స్పందిస్తూ.. ‘టెక్ కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లకు రూ.కోట్లల్లో వేతనాలు ఉంటున్నాయి. కానీ ఉద్యోగులకు మాత్రం తమ కొలువుల్లో కోత విధిస్తున్నారు’ అని చెప్పారు.