
భారత్‌లో పూర్తిస్థాయిలో పుంజుకోని ఆయా రంగాలు
ప్రపంచవ్యాప్తంగా ఏఐ, ఎంఎల్ నిపుణులకు డిమాండ్
యువత నైపుణ్యాలపై దృష్టి సారించాలంటున్న నిపుణులు
ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేథ (ఏఐ), మెషీన్ లెర్నింగ్(ఎంఎల్) నైపుణ్యాలకు డిమాండ్ ఆమాంతం పెరగడంతో అందుకు తగ్గట్టుగానే మన దేశంలో, రాష్ట్రంలో ఎడ్ టెక్ రంగం క్రమంగా గణనీయ వృద్ధిని సాధిస్తోంది. ఏఐ కేంద్రీకృత కోర్సుల విస్తరణకు విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య భాగస్వామ్యాలు ఊపందుకుంటున్నాయి. విద్యా రంగంలో, నైపుణ్యాలను పెంచుకునే విషయంలో ఏఐను ఏకీకృతం చేయడానికి ఉద్దేశించి ప్రభుత్వ కార్యక్రమాలు ఈ దిశలో ముందుకు సాగుతున్నాయి. ఏఐ, ఎడ్‌టెక్ మార్కెట్ వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో రాబోయే సంవత్సరాల్లో ఈ మార్కెట్ పరిమాణంలో గణనీయమైన పెరుగుదల ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.
వివిధ పరిశ్రమల్లో ఏఐ నైపుణ్యాలకు ఆదరణ పెరగడంతో ఏఐ, ఎంఎల్ సంబంధిత రంగాల్లో నైపుణ్యం కలిగిన వృత్తి నిపుణులకు అధిక డిమాండ్ ఏర్పడుతోంది. తెలంగాణలో మరీ ముఖ్యంగా హైదరాబాద్‌లో ఏఐ, ఎడ్‌టెక్‌లకు కేంద్రంగా అనేక సంస్థలు ప్రత్యేక కోర్సులు, శిక్షణా కార్యక్రమాలను అందిస్తున్నాయి. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా విశ్వవిద్యాలయాలు, ప్రైవేట్ సంస్థలు, ఆన్‌లైన్ లెర్నింగ్ ప్లాట్‌ఫామ్‌లు తమ ఏఐ కోర్సు కేటలాగ్‌లను విస్తరిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వపరంగానూ వ్యవసాయం, ఆరోగ్య సంరక్షణ, విద్య, చలనశీలత వంటి రంగాల్లో ఏఐను ఉపయోగించడంపై దృష్టి సారిస్తోంది. ఏఐ విద్యకు ప్రొత్సాహంతోపాటు సాంఘిక సంక్షేమ పాఠశాలల్లో ఏఐ, రొబోటిక్స్ కోర్సులను ప్రవేశపెట్టింది. పరిశ్రమ సంబంధిత ఏఐ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి, విద్యార్థులకు ఆచరణాత్మక శిక్షణ అవకాశాలు అందించడానికి సంస్థలు పరిశ్రమలు, టెక్ కంపెనీలతో భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి.
ఉద్యోగాలున్నా నైపుణ్యాల కొరత
కృత్రిమ మేథ (ఏఐ), మెషిన్ లర్నింగ్ (ఎంఎల్)లలో ప్రావీణ్య సాధన ఎకో సిస్టమ్ పూర్తిస్థాయిలో ఇంకా మన దేశంలో ఏర్పడలేదని స్మార్ట్ స్టెప్స్ ట్రైనింగ్ అకాడమీ ఫౌండర్ నానబాల లావణ్యకుమార్ అభిప్రాయపడ్డారు. కొవిడ్ సమయంలో కంపెనీలు, ఉద్యోగులంతా క్లౌడ్ ఆధారిత టెక్నాలజీ, అప్లికేషన్లపైనే దృష్టి పెట్టారని.. కానీ అదే సమయంలో అమెరికా, చైనా మాత్రం జెనరేటివ్ ప్రీ–ట్రెయిన్డ్ ట్రాన్స్‌ఫార్మర్ (జీపీటీ)లను తయారు చేసి రేసులో ఎంతో ముందుకెళ్లిపోయాయని చెప్పారు. కానీ భారత్ మాత్రం సంప్రదాయ కోర్సులకే పరిమితమై వెనుకబడిపోయిందన్నారు. ఎట్టకేలకు విశ్వవిద్యాలయాలు అనేక ఏఐ, ఎంఎల్ కోర్సులను ప్రారంభించినప్పటికీ సంక్లిష్టమైన ఈ నైపుణ్యాలను నేర్చుకొనేందుకు అవసరమైన మేర ఫ్యాకల్టీ లేరని లావణ్యకుమార్ అన్నారు. అందుకే గుణాత్మకమైన విద్యను అందించడంలో అధిక శాతం కళాశాలలు, ట్రైనింగ్ కంపెనీలు విఫలమయ్యాయని పేర్కొన్నారు. అందుకే మార్కెట్‌లో డిమాండ్ ఉన్నా కావాల్సిన స్కిల్స్ లేక యువత వెనుకబడుతున్నారని.. ఏఐ ఆధారిత కంపెనీలు సైతం ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయన్నారు.
ఇదీ చదవండి: మర మనుషులు.. కేవలం రూ.5 లక్షలే!
కాలేజీల్లో మౌలిక సదుపాయాలేవి?
చైనాతో పోలిస్తే భారత్‌లోని ఎడ్‌టెక్ కంపెనీల సామర్థ్యాలు పూర్తిస్థాయిలో లేవని క్వాలిటీ థాట్ ఫౌండర్, కెరీర్ గైడెన్స్ కోచ్ రమణ భూపతి అభిప్రాయపడ్డారు. దేశంలోని ప్రతిభావంతులంతా విదేశాలకు వలస వెళ్లడం కూడా దీనికి కారణమన్నారు. ఏఐ రంగంలో నూతన ఆవిష్కరణలకు తగ్గట్టుగా ఎడ్‌టెక్ కంపెనీలు వేగాన్ని పెంచుకోలేకపోవడం, ఏఐ నైపుణ్యాలకు అవసరమైన గణితంలో లోతైన పరిజ్ఞానం విద్యార్థులకు కొరవడటం తదితర కారణాల వల్ల భారత్ కొంత వెనుకబడిందని భావిస్తున్నట్లు చెప్పారు. అయితే ఏఐను బోధించాలంటే ఒక సరైన కాన్‌ఫిగరేషన్ (రూ.1.20 లక్షల ధర, గ్రాఫిక్ కార్డ్ తదితరాలతో) ఉన్న కంప్యూటర్ కావాలని.. కానీ మన దేశంలో అలాంటి కంప్యూటర్లు లేని కాలేజీలే 99 శాతం ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. ఎడ్‌టెక్ కంపెనీలు ఇంజినీరింగ్ ఫైనల్ ఇయర్ విద్యార్థులకు పరిశ్రమ అవసరాలకు తగ్గట్లుగా శిక్షణనిస్తే ప్రయోజనం ఉంటుందని అభిప్రాయపడ్డారు.