
గ్లోబల్–500 లిస్ట్‌లో 88వ ర్యాంకు
ఎల్‌ఐసీ, ఐవోసీ, ఎస్‌బీఐ సహా 9 సంస్థలకు చోటు
న్యూఢిల్లీ: ఈ ఏడాది (2025) ఫార్చూన్ గ్లోబల్–500 కంపెనీల జాబితాలో భారత్ నుంచి తొమ్మిది కంపెనీలకు చోటు లభించింది. వీటిలో అయిదు ప్రభుత్వ రంగానికి చెందినవి కాగా, నాలుగు ప్రైవేట్ రంగానికి చెందినవి. అన్నింటికన్నా మెరుగ్గా ప్రైవేట్ దిగ్గజం రిలయన్స్ ఇండస్ట్రీస్ 88వ స్థానంలో నిల్చింది. అయితే, 2024లోని 86వ ర్యాంకు నుంచి రెండు స్థానాలు తగ్గింది.
అటు, లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసీ) 95వ ర్యాంకులో కొనసాగింది. 22 ఏళ్లుగా ఫార్చూన్ గ్లోబల్ లిస్టులో స్థానం దక్కించుకుంటున్న ఏకైక ప్రైవేట్ రంగ కంపెనీ రిలయన్స్ కావడం గమనార్హం. గత ఆర్థిక సంవత్సరంలో కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన రిలయన్స్ స్థూల ఆదాయం 7.1% పెరిగి రూ. 10,71,174 కోట్లకు చేరింది. 2025 మార్చితో ముగిసే ఆర్థిక సంవత్సరంలో ఆదాయాలను బట్టి కంపెనీలకు ర్యాంకింగ్ ఉంటుంది.
ఐవోసీ డౌన్.. ఎస్‌బీఐ అప్..
అటు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ (ఐవోసీ) 11 ర్యాంకులు తగ్గి 127వ స్థానానికి పడిపోగా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 15 స్థానాలు మెరుగుపడి 163 ర్యాంకును, హెచ్‌డీఎఫ్‌సీ 48 స్థానాలు ఎగబాకి 258వ ర్యాంకును దక్కించుకున్నాయి. ఆయిల్ అండ్ నేచురల్ గ్యాస్ కార్పొరేషన్ (ఓఎన్‌జీసీ) ఒక ర్యాంకు తగ్గి 181వ స్థానానికి పరిమితమైంది. ఇక మిగతా వాటిలో టాటా మోటార్స్ (283 ర్యాంకు, 12 స్థానాలు డౌన్), భారత్ పెట్రోలియం కార్పొరేషన్ (285 స్థానం, 27 స్థానాల క్షీణత), ఐసీఐసీఐ బ్యాంక్ (464 ర్యాంకు, ఎలాంటి మార్పు లేదు) ఉన్నాయి.