కరోనా 'వేలకోట్ల'లో దెబ్బకొట్టింది, గాల్లో ఎగిరేదెలా!

Indian Airlines  Financial Losses Worth Rs 22,400 Cr In 2020-21 - Sakshi

న్యూఢిల్లీ: విమానయాన సంస్థలను (ఎయిర్‌లైన్స్‌) కరోనా గట్టిగానే దెబ్బకొట్టింది. వైరస్‌ నేపథ్యంలో కార్యకలాపాలు సజావుగా నిర్వహించలేని పరిస్థితి ఏర్పడడం వల్ల..  గడిచిన ఆర్థిక సంవత్సరంలో (2020–21) ఈ రంగం ఏకంగా రూ.22,400 కోట్ల నష్టాలను మూటగట్టుకోవాల్సి వచ్చింది. అంతేకాదు ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఏఏఐ) నిర్వహించే విమానాశ్రయాల్లో 75 శాతం గత ఆర్థిక సంవత్సరంలో నష్టాలను ఎదుర్కొన్నాయి. పౌరవిమానయాన శాఖ సహాయ మంత్రి వీకే సింగ్‌ ఈ వివరాలను లోక్‌సభకు తెలియజేశారు.

కరోనా మహమ్మారి అంతర్జాతీయంగా పౌర విమానయాన రంగాన్ని తీవ్రంగా దెబ్బతీసినట్టు మంత్రి చెప్పారు. ఫలితంగా దేశీయంగా ఎయిర్‌లైన్స్‌తోపాటు, విమానాశ్రయాలు, అనుబంధ సేవల్లోనూ నష్టాలు ఎదురైనట్టు వివరించారు. ‘‘భారత ఎయిర్‌లైన్స్‌ సంస్థలకు 2020–21లో నష్టాలు సుమారుగా రూ.19,000 కోట్ల వరకు ఉంటాయి. ఎయిర్‌పోర్ట్‌లకు ఈ నష్టాలు రూ.3,400 కోట్లుగా ఉన్నాయి’’ అని మంత్రి పేర్కొన్నారు. కరోనా వైరస్‌ కారణంగా ప్రయాణించే వారు 61.7 శాతం తగ్గినట్టు తెలిపారు. వచ్చే కొన్నేళ్లలో దేశీయ ప్రయాణికుల మార్కెట్‌ రెట్టింపు అవుతుందన్న అంచనాను వ్యక్తం చేశారు. విమానయాన సేవల్లో ఎక్కువగా ఇంధనానికే (ఏటీఎఫ్‌) ఖర్చవుతున్నట్టు చెప్పారు.   
 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top