
ప్రయాణాలకు పెరిగిన డిమాండ్
దేశ, విదేశీ పర్యటనల పట్ల ఆసక్తి
ఎక్కువ రోజులు వెళ్లొచ్చేందుకు ప్రణాళిక
రెట్టింపైన ఫ్లయిట్, హోటల్ బుకింగ్‌లు
ముంబై: దీపావళి పండుగ సందర్భంగా ప్రయాణ బుకింగ్‌లకు డిమాండ్ నెలకొంది. దేశీయంగా వేర్వేరు ప్రాంతాల్లో ఉన్న బంధుమిత్రులతో పండుగ సంబరాలు చేసుకునేందుకు.. దేశ, విదేశాల్లోని సుందర ప్రదేశాలు చూసి వచ్చేందుకు.. ఇలా అన్ని రకాల ట్రావెల్ బుకింగ్‌లకు డిమాండ్ ఏర్పడినట్టు పరిశ్రమ వర్గాలు తెలిపాయి. బంధు మిత్రులను కలుసుకోవడం పడుగల సీజన్‌లో ప్రయాణాలకు కీలక డిమాండ్‌గా ఉన్నట్టు మేక్‌మై ట్రిప్ కో ఫౌండర్, గ్రూప్ సీఈవో రాజేష్ మాగోవ్ తెలిపారు.
ఈ సమయంలో వేడుకల కోసం స్వస్థలాలకు వెళుతుంటారని చెప్పారు. అత్యధికంగా బుకింగ్‌లు జరిగిన టాప్–10 ప్రదేశాల్లో ఢిల్లీ, ముంబై, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై ఉన్నాయంటూ.. పుణ్యక్షేత్రాలకు సైతం డిమాండ్ పెరిగినట్టు పేర్కొన్నారు. అంతర్జాతీయంగా చూస్తే యూఏఈ, సింగపూర్, థాయ్‌లాండ్, వియత్నాంకు బుకింగ్‌లు అధికంగా ఉన్నట్టు చెప్పారు. దీపావళి సందర్భంగా కొత్త ప్రదేశాలకు చూసి వచ్చేందుకు ఆసక్తి పెరుగుతోందని థామస్ కుక్ (ఇండియా) ప్రెసిడెంట్ రాజీవ్ కాలే సైతం తెలిపారు. ‘‘ఒక్కొక్కరు పర్యటన కోసం చేసే సగటు వ్యయం పెరుగుతుండడం ఆసక్తికరం.
ప్రయాణికులు ఎక్కువ రోజులు బస చేయడానికి ఆసక్తి చూపిస్తున్నారు. సాధారణంగా కనిపించే మూడు రోజులకు బదులు 6–12 రోజులకు బుక్ చేసుకుంటున్నారు’’అని తెలిపారు. యూరప్‌లో స్విట్జర్లాండ్, ఫ్రాన్స్, ఇటలీ, ఆ్రస్టియా, స్పెయిన్, పోర్చుగల్ ప్రధాన బుకింగ్ కేంద్రాలుగా ఉన్నాయి. స్వల్పకాలం కోసం వియత్నాం, ఒమన్, మాల్దీవులు, బాలి, కంబోడియాకు డిమాండ్ నెలకొన్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. వీసా పరంగా సులభ ప్రవేశానికి అవకాశం ఉన్న థాయ్‌లాండ్, మలేషియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, దుబాయి–అబుదాబి, ఇండోనేíÙయా, ఫిలిప్పీన్స్‌కు ఎప్పటి మాదిరే డిమాండ్ కనిపిస్తున్నట్టు చెప్పారు.
వారణాసికి డిమాండ్..
దేశీయంగా కేరళ, రాజస్తాన్, ఉత్తరాఖండ్, అండమాన్‌తోపాటు ఆధ్యాత్మిక కేంద్రాలైన చార్‌ధామ్, కైలాస్ మానససరోవర్, అయోధ్య, వారణాసి వెళ్లొచ్చేందుకు ఎక్కువ మంది ఆసక్తి కనబరుస్తున్నట్టు రాజీవ్ కాలే తెలిపారు. ఈ దీపావళి సందర్భంగా ఫ్లయిట్ బుకింగ్‌లు పెరిగినట్టు ఇక్సిగో గ్రూప్ సీఈవో అలోకే బాజ్‌పాయ్ తెలిపారు. గతేడాదితో పోల్చి చూస్తే 60–65 శాతం డిమాండ్ పెరిగినట్టు చెప్పారు.
ముఖ్యంగా అయోధ్య, వారణాసికి బుకింగ్‌లు 100 శాతం అధికంగా ఉన్నట్టు తెలిపారు. జెనరేషన్ జెడ్, దంపతులు అయితే క్రూయిజ్ బుకింగ్‌లు ఆసక్తి చూపిస్తున్నట్టు చెప్పారు. ఈ దీపావళి సీజన్‌కు ముందు 4, 5 స్టార్ హోటళ్లలో బుకింగ్‌లు గణనీయంగా పెరిగినట్టు, ముఖ్యంగా 5 స్టార్ కోసం రెండు రెట్లు అధికంగా బుకింగ్‌లు వస్తున్నట్టు క్లియర్‌ట్రిప్ అధికార ప్రతినిధి సైతం తెలిపారు. పండుగలకు ముందు నాటితో పోల్చి చూస్తే ఫ్లయిట్ బుకింగ్ రెండు రెట్లు, హోటల్ బుకింగ్‌లు 3.5 రెట్లు అధికంగా ఉన్నట్టు చెప్పారు.