భారత్‌–యూఏఈ బంధం బలోపేతం

India, UAE sign comprehensive trade pact - Sakshi

ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు  

న్యూఢిల్లీ: భారత్‌–యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, ఆర్థిక సంబంధాలు మరింత పటిష్టమయ్యే కీలక ఒప్పందం శుక్రవారం జరిగింది. సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం (సీఈపీఏ) పేరుతో జరిగిన స్వేచ్చా వాణిజ్య ఒప్పంద (ఎఫ్‌టీఏ) పత్రాలపై భారత్‌ వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయెల్, యూఏఈ ఆర్థిక వ్యవహారాల మంత్రి అబ్దుల్లా బిన్‌ తౌక్‌ అల్‌ మరీ న్యూఢిల్లీలో జరిగిన ఒక కార్యక్రమంలో సంతకాలు చేశారు.

ఒప్పంద పత్రాలను ఒకరికొకరు మార్చుకున్నారు. అనంతరం  మాట్లాడుతూ, ఈ ఒప్పందం వల్ల రెండు దేశాలకూ బహుళ ప్రయోజనాలు ఒనగూరుతాయని పేర్కొన్నారు.వస్తువులు, సేవలు, నిబంధనలు, కస్టమ్స్‌ విధానాలు, ప్రభుత్వ సేకరణ, మేధో సంపత్తి హక్కులు, ఈ–కామర్స్‌తో సహా పలు అంశాలు తాజా ఒప్పందం పరిధిలోకి వస్తాయని ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. ఒప్పందం ప్రకారం రెండు దేశాలు గరిష్ట స్థాయి ఉత్పత్తులపై కస్టమ్స్‌ సుంకాలు తగ్గుతాయి.

సేవలు, పెట్టుబడులకు సంబంధించి పలు నిబంధనలను సరళతరం అవుతాయి.  గత ఏడాది సెప్టెంబర్‌లో రెండు దేశాలు వాణిజ్య ఒప్పంద చర్చలను  లాంఛనంగా ప్రారంభించాయి. కాగా, తాజా ఒప్పందంపై సంతకాలకు ముందు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, అబుదాబి క్రౌన్‌ ప్రిన్స్‌ షేక్‌ మొహమ్మద్‌ బిన్‌ జాయెద్‌ అల్‌ నహ్యాన్‌లు ఒక వర్చువల్‌ సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ‘‘భారతదేశం–యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం: కొత్త హద్దులు, మైలురాయి‘ అనే పేరుతో సంయుక్త విజన్‌ ప్రకటనను విడుదల చేశారు.  ప్రస్తుతం 2 దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం విలువ దాదాపు 60 బిలియన్‌ డాల ర్లు ఉంటే, ఇది వచ్చే ఐదేళ్లలో 100 బిలియన్‌ డాలర్లకు చేరుతుందని అంచనా. ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, ప్రపంచంలోని ఇతర దేశాలకు యూఏఈ ఒక గేట్‌వేగా ఉండడం  మరో కీలక అంశం.  
స్మారక స్టాంప్‌ ఆవిష్కరణ: కాగా భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవడం, యూఏఈ ఏర్పాటై 50 ఏళ్లు పూర్తయిన సందర్భాన్ని పురస్కరించుకుని ఇరు దేశాల నాయకులు సంయుక్త స్మారక స్టాంప్‌ను విడుదల చేశాయి.

అపార వాణిజ్య అవకాశాలు
ఇది ఒక సమగ్ర, సమతౌల్య వాణిజ్య ఒప్పందం. దీనివల్ల రెండు దేశాలకూ అపార వాణిజ్య అవకాశాలు ఏర్పడతాయి. దైపాక్షిక వాణిజ్య సంబంధాలు రెట్టింపు అవుతాయి.     
– పీయూష్‌ గోయెల్,  వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top