నాలుగేళ్లలో రెట్టింపైన ఆదాయం!
భారత క్రీడా రంగం సరికొత్త చరిత్ర సృష్టించింది. 2025 క్యాలెండర్ ఇయర్ ముగిసే నాటికి దేశీయ క్రీడా ఆర్థిక వ్యవస్థ మొదటిసారిగా 2 బిలియన్ డాలర్ల మైలురాయిని అధిగమించింది. ప్రముఖ అంతర్జాతీయ మార్కెటింగ్ సంస్థ డబ్ల్యూపీపీ మీడియా విడుదల చేసిన ‘స్పోర్టింగ్ నేషన్: బిల్డింగ్ ఏ లెగసీ’ నివేదిక ప్రకారం, భారత క్రీడా మార్కెట్ విలువ ప్రస్తుతం రూ.18,864 కోట్లకు (2.13 బిలియన్ డాలర్లు) చేరుకుంది. గతేడాదితో పోలిస్తే ఇది 13.4 శాతం వృద్ధిని నమోదు చేయడం విశేషం. కేవలం నాలుగేళ్ల కాలంలోనే (2021లో రూ.9,530 కోట్లు) ఈ రంగం రెట్టింపు వృద్ధిని సాధించడం గమనార్హం.
నివేదికలోని ముఖ్యాంశాలు
క్రీడా రంగం మొత్తం ఆదాయంలో 51 శాతం వాటా ప్రకటనలదే. గత ఏడాదితో పోలిస్తే ఇవి 19.8 శాతం పెరిగి రూ.9,571 కోట్లకు చేరాయి.
టీమ్, లీగ్ స్పాన్సర్‌షిప్‌ల ద్వారా రూ.7,943 కోట్లు (42% వాటా) సమకూరాయి.
క్రీడాకారుల బ్రాండ్ అంబాసిడర్ ఒప్పందాల విలువ 10.3 శాతం పెరిగి రూ.1,350 కోట్లకు చేరింది.
‘భారత క్రీడా రంగం సుస్థిరత, విస్తరణ దశకు చేరుకుంది. 2021 నుంచి చూస్తే 19 శాతం చక్రవడ్డీ రేటుతో (సీఏజీఆర్) ఈ వృద్ధి కొనసాగుతోంది’ అని డబ్ల్యూపీపీ మీడియా ఎండీ (కంటెంట్, స్పోర్ట్స్) వినీత్ కర్ణిక్ తెలిపారు.
ఎదురులేని రారాజు క్రికెట్
భారత మార్కెట్‌లో క్రికెట్ తన ఆధిపత్యాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. మొత్తం క్రీడా ఆదాయంలో 89 శాతం వాటా (రూ.16,704.2 కోట్లు) ఒక్క క్రికెట్ ద్వారానే లభిస్తోంది. లీనియర్ టీవీ (సాధారణ ఛానెళ్లు) కంటే డిజిటల్ మాధ్యమాల్లో ప్రకటనల వ్యయం వేగంగా పెరుగుతోంది. ఐపీఎల్ ఫ్రాంచైజీల మొత్తం స్పాన్సర్‌షిప్ ఆదాయం మొదటిసారిగా రూ.1,000 కోట్ల మార్కును దాటింది. రియల్ మనీ గేమింగ్ యాప్‌లపై ఆంక్షలు ఉన్నప్పటికీ ఆ లోటును సంప్రదాయ బ్రాండ్లు భర్తీ చేశాయని నివేదిక పేర్కొంది.
ఇతర క్రీడల పరిస్థితి ఏమిటి?
క్రికెట్ దూసుకుపోతున్నా ఇతర క్రీడల ఆదాయం 2025లో 12.2 శాతం క్షీణించి రూ.2,159.9 కోట్లకు పరిమితమైంది. ఇండియన్ సూపర్ లీగ్ వాయిదా పడటం, ఇతర భారీ అంతర్జాతీయ టోర్నీలు లేకపోవడం దీనికి ప్రధాన కారణం. అయితే, నీరజ్ చోప్రా క్లాసిక్, మెస్సీ ఇండియా టూర్ వంటి ఈవెంట్లతో పాటు పికిల్ బాల్ వంటి కొత్త క్రీడలకు ఆదరణ పెరుగుతుండటం సానుకూలాంశం.
ఇదీ చదవండి: తికమకపెట్టే ప్రశ్నలకు ఏఐ స్కోర్ ఎంతంటే..


