లాభాల బాటలో ప్రభుత్వ బ్యాంకులు.. కారణం ఇదే! | India: Public Sector Banks Register Profits And Decrease Npa List | Sakshi
Sakshi News home page

లాభాల బాటలో ప్రభుత్వ బ్యాంకులు.. కారణం ఇదే!

Dec 30 2022 9:01 PM | Updated on Dec 30 2022 9:01 PM

India: Public Sector Banks Register Profits And Decrease Npa List - Sakshi

ప్రభుత్వ రంగ బ్యాంకులు (పీఎస్‌బీ) ఈ ఆర్థిక సంవత్సరంలో మొండి బాకీలను తగ్గించుకుని, రికార్డు లాభాలు నమోదు చేశాయి. రుణాలకు భారీగా డిమాండ్‌ నెలకొనడం, వడ్డీ రేట్లు అధిక స్థాయిలో కొనసాగుతుండటంతో వచ్చే ఆర్థిక సంవత్సరంలోనూ ఇదే జోరును కొనసాగించనున్నాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక ప్రైవేట్‌ రంగంలో స్థిరీకరణ కనిపిస్తుందని వారు తెలిపారు. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీనం, సిటీబ్యాంక్‌ రిటైల్‌ పోర్ట్‌ఫోలియోను యాక్సిస్‌ బ్యాంక్‌ టేకోవర్‌ చేయడం 2023లో పూర్తి కానుంది.

రిజర్వ్‌ బ్యాంక్‌ కీలక పాలసీ రేటును మరో పావు శాతం పెంచి 6.25 శాతం నుంచి 6.50 శాతానికి చేర్చే అవకాశం ఉందని కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ ఎండీ ఉదయ్‌ కోటక్‌ తెలిపారు. ఇదే జరిగితే, బ్యాంకులు రుణాలపై పెంచినంతగా డిపాజిట్లపై వడ్డీ రేట్లను పెంచటం లేదు కాబట్టి వాటి లాభదాయకతకు మరింతగా తోడ్పడగలదని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. కొత్త ఏడాదిలో అడుగుపెడుతున్న నేపథ్యంలో ఒకసారి ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకూ బ్యాంకింగ్‌ రంగంలో కొన్ని పరిణామాలు చూస్తే.. 

► మొత్తం బ్యాంకింగ్‌ వ్యాపారంలో దాదాపు 60 శాతం వాటా ఉన్న 12 పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రథమార్ధంలో  32 శాతం అధికంగా నికర లాభాలు నమోదు చేశాయి. రూ. 40,991 కోట్లు ఆర్జించాయి. సెప్టెంబర్‌ క్వార్టర్‌లో పీఎస్‌బీలన్నింటి నికర లాభం 50 శాతం పెరిగి రూ. 25,685 కోట్లకు ఎగిసింది.  
► ఇదే తీరు కొనసాగితే పీఎస్‌బీలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2021–22కు మించి లాభాలు సాధించవచ్చని అంచనా. 2021–22లో 12 పీఎస్‌బీల లాభాలు 110 శాతం పెరిగి రూ. 31,816 కోట్ల నుంచి రూ. 66,539 కోట్లకు చేరాయి. 

► మొండి బాకీలను తగ్గించేందుకు, అదనపు మూలధనం ఇచ్చి బ్యాంకులను పటిష్టం చేసేందుకు ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలిస్తున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ఇటీవల అభిప్రాయపడ్డారు. 2022 మార్చి ఆఖరు నాటికి మొండి బాకీలు 9.11 శాతం నుంచి 7.28 శాతానికి దిగి వచ్చాయని ఇటీవల తెలిపారు. కార్పొరేట్లు కూడా రుణాలు తీసుకోవడం పెరుగుతుండటంతో రుణ వృద్ధి మరింత పుంజుకుంటుందని అంచనా వేస్తున్నట్లు పేర్కొన్నారు. 
► ప్రైవేట్‌ రంగం విషయానికొస్తే యస్‌ బ్యాంకులోకి రెండు గ్లోబల్‌ ప్రైవేట్‌ ఈక్విటీ సంస్థలు (కార్లైల్‌ గ్రూప్, యాడ్వెంట్‌) రూ. 8,896 కోట్లు ఇన్వెస్ట్‌ చేశాయి. చెరో 9.99 శాతం వాటా తీసుకున్నాయి.  

► హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో హెచ్‌డీఎఫ్‌సీ విలీన ప్రతిపాదనకు ఆమోదముద్ర పడింది. దాదాపు 40 బిలియన్‌ డాలర్ల విలువ చేసే ఈ డీల్‌తో హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ భారీ ఆర్థిక సేవల దిగ్గజంగా ఆవిర్భవించనుంది. 2023–24 రెండో త్రైమాసికంలో ఈ డీల్‌ పూర్తి కావచ్చని అంచనా. 
► వ్యాపార వృద్ధి ప్రణాళికల్లో భాగంగా సిటీబ్యాంక్‌ రిటైల్‌ వ్యాపారాన్ని రూ. 12,325 కోట్లకు కొనుగోలు చేసేందుకు యాక్సిస్‌ బ్యాంక్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఇందులో క్రెడిట్‌ కార్డులు, రిటైల్‌ బ్యాంకింగ్, వెల్త్‌ మేనేజ్‌మెంట్, వినియోగదారు రుణాలు తదితర వ్యాపార విభాగాలు ఉన్నాయి. విలీనం పూర్తయితే యాక్సిస్‌ బ్యాంక్‌ వద్ద 2.85 కోట్ల పొదుపు ఖాతాలు, 1.06 కోట్ల క్రియాశీలక క్రెడిట్‌ కార్డులు ఉంటాయి.

చదవండి: జొమాటో షాకింగ్‌ రిపోర్ట్‌: పూణె వాసి యాప్ ద్వారా రూ.28 లక్షల పుడ్‌ ఆర్డర్‌!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement