పెట్రో మంట తప్పదా..?  | Petrol, Diesel Price Hike Debate Intensifies Amid Rising Crude Costs And Heavy Oil Company Losses, More Details Inside | Sakshi
Sakshi News home page

పెట్రో మంట తప్పదా..? 

May 15 2026 5:23 AM | Updated on May 15 2026 10:43 AM

India may have to hike petrol and diesel prices if the West Asia crisis

ఆర్‌బీఐ హెచ్చరికలతో సంకేతాలు 

20 శాతం మోతకు రంగం సిద్ధమా 

అప్పుడే ఆయిల్‌ కంపెనీలకు ఊరట 

ప్రస్తుతం ప్రతి నెలా రూ. 55,416 కోట్ల ఆదాయ నష్టం 

రేటు కనీసం రూ.10 పెరిగితే రూ. 17,000 కోట్ల ఆదా

దేశంలో పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు ఇక తప్పదా అనే చర్చ మళ్లీ వేడెక్కుతోంది. పశ్చిమాసియా యుద్ధ ఉద్రిక్తతల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు భారీగా  పెరిగిన కారణంగా ప్రభుత్వరంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు తీవ్ర నష్టాలు ఎదుర్కొంటున్నాయి. ఇప్పటికే కోట్లకు పైగా అండర్‌ రికవరీ వస్తోందని కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఇండియన్‌ ఆయిల్, భారత్‌ పెట్రోలియం, హిందుస్థాన్‌ పెట్రోలియం వంటి సంస్థలు గత నాలుగేళ్లుగా పెట్రోల్, డీజిల్‌ ధరలను పెద్దగా పెంచకుండా కొనసాగిస్తున్నాయి. 

అయితే ప్రస్తుతం అంతర్జాతీయంగా బ్రెంట్‌ క్రూడ్‌ ధరలు భారీగా పెరగడం, రూపాయి బలహీనపడటం వల్ల కంపెనీలపై భారం మరింత పెరిగింది. పెట్రోలియం మంత్రి హర్‌దీప్‌ సింగ్‌ పురి కూడా ఆయిల్‌ కంపెనీలు భారీ నష్టాలు భరించలేని స్థితికి వచ్చాయని సంకేతాలు ఇచ్చారు. పరిస్థితి ఎక్కువకాలం కొనసాగితే ధరల సవరణ తప్పనిసరికావచ్చని ఆర్బీఐ గవర్నర్‌ సంజయ్‌ మల్హోత్రా కూడా హెచ్చరించారు. అయితే  ద్రవ్యోల్బణ భయం కారణంగా కేంద్ర ప్రభుత్వం  పెట్రోల్, డీజిల్‌ ధరల తక్షణ పెంపు నిర్ణయంపై ఇంకా ఆచితూచి వ్యవహరిస్తోంది.  

కానీ యుద్ధ ఉద్రిక్తతల దెబ్బతో ప్రపంచ మార్కెట్లో పెరిగిపోతున్న ఇంధన రేట్లకు తగ్గట్లు దేశీయంగా పెట్రోల్, డీజిల్‌ రిటైల్‌ ధరలను పెంచకపోవడంతో ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు (ఓఎంసీ) భారీగా ఆదాయాన్ని నష్టపోతున్నాయి. పెట్రోల్‌పై లీటరుకు రూ. 14, డీజిల్‌పై రూ. 42 మేర నష్టాలను పరిగణనలోకి తీసుకుంటే, ప్రస్తుతం నెలకు రూ. 55,416 కోట్ల మేర అండర్‌ రికవరీలు ఉంటున్నాయని అంచనా.  ఈ నష్టాలను తగ్గించుకుని, తిరిగి గతేడాది స్థాయికి చేరుకోవాలంటే పెట్రోల్, డీజిల్‌ రేట్లను 20 శాతం మేర పెంచాల్సి వస్తుందని పరిశ్రమ వర్గాలు లెక్కలు వేస్తున్నాయి. కనీసం రూ. 10 పెంచితే రూ. 17,000 కోట్ల మేర నష్టం భర్తీ అవుతుందని చెబుతున్నాయి.  

రేట్లు కొంత పెంచినా ఊరటే.. 
దేశీయంగా గత రెండు నెలలుగా, ప్రతి నెలా 37 లక్షల టన్నుల పెట్రోల్, 85 లక్షల టన్నుల డీజిల్‌ వినియోగం ఉంటోంది. దీంతో ఓఎంసీలపై భారం భారీగా పెరిగిపోయింది.  ప్రస్తుతం పెట్రోల్, డీజిల్‌ అమ్మకాలపై ఆయిల్‌ కంపెనీలకు నెలకు రూ. 55,416 కోట్ల మేర నష్టాలు వస్తున్నట్లు అంచనా. ఈ నేపథ్యంలో లీటరుకు రూ. 2 చొప్పున పెంచితే నెలవారీ అండర్‌ రికవరీలు రూ. 52,105 కోట్లకు, రూ. 4 పెంచితే రూ. 48.794 కోట్లకు తగ్గుతాయని భావిస్తున్నారు. రూ. 10 పెంచితే ఓఎంసీలకు రూ. 17,000 కోట్ల భారం తగ్గుతుందని, ఆదాయ నష్టం సుమారు రూ. 38,863 కోట్లకు దిగి వస్తుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. 

సాక్షి, బిజినెస్‌ డెస్క్‌  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement