వీటిని తెగవాడుతున్నారు..! | Sakshi
Sakshi News home page

వీటిని తెగవాడుతున్నారు..!

Published Tue, Dec 19 2023 3:35 PM

Increasing Payments Of UPI Transactions - Sakshi

ప్రస్తుతం ఏ చిన్న వస్తువు కొనాలన్నా యూపీఐ ద్వారా పేమెంట్‌ చేస్తున్నారు. ఎక్కడ చూసినా క్యూఆర్ కోడ్ స్కానర్లు కనిపిస్తున్నాయి. గూగుల్ పే, ఫోన్ పే, పేటీఎం వంటి యూపీఐ యాప్స్‌తో చెల్లింపులు సాగిస్తున్నారు.

చేతిలో స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు కచ్చితంగా ఫోన్ పే, గూగుల్ పే వంటి యూపీఐ యాప్స్ ఉంటున్నాయి. చిటికెలో ట్రాన్సాక్షన్ పూర్తి చేసే సౌలభ్యం అందుబాటులోకి వచ్చిన క్రమంలో డిజిటల్ పేమెంట్లలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్ ఫేస్ (యూపీఐ) ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ మేరకు యూపీఐ పేమెంట్లకు సంబంధించి కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగవత్ కె కరాద్‌ పార్లమెంట్‌లో కీలక విషయాలు వెల్లడించారు. 

యూపీఐ పేమెంట్లు పెరగడంతో గతేడాది చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 7.8 శాతానికి తగ్గినట్లు చెప్పారు. 2017-18 ఏడాదిలో యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్య 92 కోట్లుగా ఉండగా.. అది 2022-23కు ఏకంగా 8,357 కోట్లకు చేరినట్లు చెప్పారు. యూపీఐ ట్రాన్సాక్షన్ల సంఖ్యాపరంగా వార్షిక వృద్ధి 147 శాతంగా ఉందని పేర్కొన్నారు.

యూపీఐ ట్రాన్సాక్షన్ల విలువ 2017-18లో దాదాపు రూ.1 లక్ష కోట్లుగా ఉండగా.. అది 168 శాతం పెరిగి 2022-23లో రూ.139 లక్షల కోట్లకు చేరినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2023-24లో డిసెంబర్ 11 వరకు యూపీఐ మొత్తం ట్రాన్సాక్షన్ల సంఖ్య 8,572 కోట్లుగా తెలిపారు. 2022-23లో మొత్తం డిజిటల్ ట్రాన్సాక్షన్లలో యూపీఐ లావాదేవీలే 62 శాతంగా ఉన్నట్లు చెప్పారు.

ఇదీ చదవండి: రూ.1000 కోట్లు ఆదా చేసిన ప్రభుత్వ సంస్థ..

చలామణిలో ఉన్న నోట్ల విలువలో వృద్ధి 2021-22లో 9.9 శాతంగా ఉండగా.. 2022-23లో 7.8 శాతానికి తగ్గిందన్నారు. యూపీఐతో రూపే క్రెడిట్ కార్డులు లింక్ చేసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. దీనివల్ల క్రెడిట్ కార్డులను తమతో తీసుకెళ్లకుండానే చిన్న విక్రయ కేంద్రాల్లోనైనా చెల్లింపులు చేసే అవకాశం ఉందని తెలిపారు. ఇదిలాఉండగా.. గత తొమ్మిదేళ్లలో 57 బ్యాంకులను మూసివేసినట్లు మంత్రి చెప్పారు. మూడు బ్యాంకులు పంజాబ్ అండ్ మహారాష్ట్ర కోఆపరేటివ్ బ్యాంక్, లక్ష్మీ విలాస్ బ్యాంక్, యెస్ బ్యాంకులను పునరుద్ధరించినట్లు చెప్పారు.

Advertisement
 
Advertisement