Google Good News: ‘స్ట్రీట్‌ వ్యూ’ని ఎంజాయ్‌ చేయండి!

Including Hyderabad Google Maps launches street view in 10 Indian cities - Sakshi

హైదరాబాద్‌ సహా 10 నగరాల్లో లభ్యం 

న్యూఢిల్లీ: టెక్‌ దిగ్గజం గూగుల్‌ తాజాగా తమ గూగుల్‌ మ్యాప్స్‌లో ’స్ట్రీట్‌ వ్యూ’ ఫీచర్‌ను భారత మార్కెట్లో మరోసారి తీసుకొచ్చింది. హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, ఢిల్లీ, ముంబై తదితర 10 నగరాల్లో 1,50,000 కి.మీ. విస్తీర్ణంలో ఇది బుధవారం నుండి అందుబాటులోకి వచ్చింది. ఇందుకోసం జెనెసిస్‌ ఇంటర్నేషనల్, టెక్‌ మహీంద్రాతో జట్టు కట్టినట్లు పేర్కొంది. స్థానిక సంస్థల భాగస్వామ్యంతో స్ట్రీట్‌ వ్యూను అందుబాటులోకి తేవడం ఇదే తొలిసారని వివరించింది.

2022 ఆఖరు నాటికి ఈ ఫీచర్‌ను 50 నగరాలకు విస్తరించే ప్రణాళికలు ఉన్నట్లు గూగుల్‌ పేర్కొంది. ఏదైనా ప్రాంతం ఇమేజీని 360 డిగ్రీల కోణంలో చూసేందుకు ఈ ఫీచర్‌ ఉపయోగపడుతుంది. గతంలోనే  దేశీయంగా ప్రవేశపెట్టినప్పటికీ భద్రతా కారణాల రీత్యా పూర్తి స్థాయిలో విస్తరించేందుకు  కేంద్రం అనుమతించలేదు.

మరోవైపు, ట్రాఫిక్‌ సిగ్నల్‌ టైమింగ్‌లను మెరుగుపర్చేందుకు బెంగళూరు ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగంతో కూడా జట్టు కట్టినట్లు గూగుల్‌ వివరించింది. త్వరలో హైదరాబాద్, కోల్‌కతాలోని స్థానిక ట్రాఫిక్‌ విభాగంతో కూడా ఈ తరహా ఒప్పందాలు కుదుర్చుకోనున్నట్లు గూగుల్‌ మ్యాప్స్‌ ఎక్స్‌పీరియెన్సెస్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ మిరియం కార్తీక డేనియల్‌ తెలిపారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top