
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2025–26) ముగిసేలోగా ఐడీబీఐ బ్యాంక్‌లో వాటా విక్రయాన్ని పూర్తి చేసే వీలున్నట్లు దీపమ్ కార్యదర్శి అర్నుష్ చావ్లా పేర్కొన్నారు. అర్హతగల బిడ్డర్లు సాధ్యాసాధ్యాల పరిశీలనను దాదాపు పూర్తిచేసిన నేపథ్యంలో తాజా అంచనాకు వచ్చినట్లు వెల్లడించారు. ఫిక్కీ నిర్వహించిన క్యాపిటల్ మార్కెట్ సదస్సు సందర్భంగా చావ్లా విలేకరులతో ఈ అంశాలను ప్రస్తావించారు.
ఆస్తుల మానిటైజేషన్ ద్వారా ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 47,000 కోట్లు సమీకరించే లక్ష్యంలో భాగంగా ప్రభుత్వం ఇప్పటికే రూ. 20,000 కోట్లు సమకూర్చుకున్నట్లు వెల్లడించారు. అర్హతకలిగి ఆసక్తి ప్రదర్శించిన పార్టీలు ఇప్పటికే బ్యాంక్‌పై ఒక అవగాహనకు వచ్చినట్లు పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన అన్ని ప్రశ్నలకూ జవాబులు సైతం లభించినట్లు తెలియజేశారు. బ్యాంక్‌కు సంబంధించిన అన్ని గణాంకాలు లేదా వివరాలను సమగ్రంగా అందించినట్లు తెలియజేశారు.
ఐడీబీఐ బ్యాంక్‌లో బీమా రంగ పీఎస్‌యూ దిగ్గజం ఎల్‌ఐసీకి 95 శాతం వాటా ఉన్న సంగతి తెలిసిందే. ప్రభుత్వ డిజిన్వెస్ట్‌మెంట్‌లో భాగంగా దీనిలో 60.72 శాతం వాటాను ఎల్‌ఐసీ విక్రయించనుంది. ఇక ఎల్‌ఐసీలో కొంతమేర ప్రభుత్వ వాటా విక్రయ అంశంపై దీపమ్‌తోపాటు.. మర్చంట్ బ్యాంకర్లు, ఎల్‌ఐసీ ఉమ్మడిగా అంతర్‌మంత్రిత్వ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు వివరించారు.