ఐసీఐసీఐ -యస్‌ బ్యాంక్‌ షేర్ల పతనం

ICICI Bank- Yes bank plunges  - Sakshi

క్యూ1 ఎఫెక్ట్‌- ఐసీఐసీఐ 5.5 శాతం డౌన్‌

10 శాతం కుప్పకూలిన యస్‌ బ్యాంక్

‌ రూ. 12.30 వద్ద లోయర్‌ సర్క్యూట్‌

ఎఫ్‌పీవో షేర్ల అలాట్‌మెంట్‌ పూర్తి

ఎఫ్‌పీవో ధర రూ. 12 సమీపానికి షేరు

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2020-21) తొలి క్వార్టర్‌లో ఆకర్షణీయ ఫలితాలు ప్రకటించినప్పటికీ  ప్రయివేట్‌ రంగ దిగ్గజం ఐసీఐసీఐ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు ఊపందుకున్నాయి. ప్రస్తుతం ఎన్‌ఎస్‌ఈలో ఈ షేరు 5.5 శాతం పతనమై రూ. 361 దిగువన ట్రేడవుతోంది. క్యూ1(ఏప్రిల్‌-జూన్‌)లో ఐసీఐసీఐ నికర లాభం 36 శాతం పెరిగి రూ. 2599 కోట్లను అధిగమించింది. ప్రధానంగా జనరల్‌, లైఫ్‌ ఇన్సూరెన్స్‌ అనుబంధ సంస్థల పనితీరు ఇందుకు సహకరించినట్లు నిపుణులు పేర్కొన్నారు. అయితే కోవిడ్‌-19 సంబంధ ప్రొవిజన్లు రూ. 5,550 కోట్లు అదనంగా నమోదుకావడం ప్రతికూల అంశమని తెలియజేశారు. క్యూ1లో నికర వడ్డీ ఆదాయం 20 శాతం పుంజుకుని రూ. 9280 కోట్లను తాకింది. 

యస్‌ బ్యాంక్‌ 
ఈ నెల 15-17 మధ్య ఫాలోఆన్‌ పబ్లిక్‌ ఆఫర్(ఎఫ్‌పీవో) చేపట్టిన ప్రయివేట్‌ రంగ సంస్థ యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో ఒక్కసారిగా అమ్మకాలు ఊపందుకున్నాయి. కొనేవాళ్లు కరువుకావడంతో ఎన్‌ఎస్‌ఈలో 10 శాతం డౌన్‌ సర్క్యూట్‌ను తాకింది. రూ. 12.30 వద్ద ఫ్రీజయ్యింది. తద్వారా ఎఫ్‌పీవో ధర రూ. 12 సమీపానికి చేరింది. కాగా.. ఎఫ్‌పీవో ద్వారా బ్యాంకు రూ. 14,272 కోట్లను సమీకరించింది. ఎఫ్‌పీవోలో భాగంగా బ్యాంక్‌ షేర్ల అలాట్‌మెంట్‌ను పూర్తిచేయడంతో ఇవి ట్రేడింగ్‌కు అందుబాటులోకి వచ్చినట్లు విశ్లేషకులు పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ కౌంటర్లో సుమారు 4.2 కోట్ల షేర్ల సెల్‌ ఆర్డర్లు పెండింగ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నెల 10న ఎఫ్‌పీవోకు రూ. 12 ధరను ఖరారు చేశాక యస్‌ బ్యాంక్‌ కౌంటర్లో అమ్మకాలు కొనసాగుతూనే ఉన్నట్లు నిపుణులు తెలియజేశారు. వెరసి వారాంతానికల్లా యస్‌ బ్యాంక్‌ షేరు 55 శాతం దిగజారినట్లు వివరించారు. 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top