డిజి భారత్‌: ‘డిజిటల్‌’ వాడకం జిగేల్‌!

IBM Survey On Digital Utilization In India - Sakshi

గోప్యత, భద్రతపై యూజర్లలో ఆందోళన

యాప్‌లు, వెబ్‌సైట్ల ట్రాకింగ్‌కు నిరాకరణ

ఐబీఎం సర్వేలో వెల్లడి

న్యూఢిల్లీ: దేశీయంగా డిజిటలీకరణ వేగవంతం అవుతోందనడానికి నిదర్శనంగా.. వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌ల ద్వారా వ్యాపార సంస్థలతో యూజర్లు నిర్వహించే వ్యాపార లావాదేవీలు గణనీయంగా పెరుగుతున్నాయి. కానీ, అదే సమయంలో గోప్యత, భద్రతపైనా యూజర్లలో ఆందోళన ఉంటోంది. టెక్‌ దిగ్గజం ఐబీఎం నిర్వహించిన సర్వేలో ఈ అంశాలు వెల్లడయ్యాయి. మార్చి 12–26 మధ్య నిర్వహించిన  ప్రకారం కరోనా వైరస్‌ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో అన్ని వయస్సుల వారు ఎంతో కొంత డిజిటల్‌ మాధ్యమం ద్వారా లావాదేవీలు నిర్వహిస్తుండగా .. 35 సంవత్సరాలకు పైబడిన వర్గాల్లో ఇది గణనీయంగా పెరిగింది. ‘కోవిడ్‌ నేపథ్యంలో వెబ్‌సైట్లు, మొబైల్‌ యాప్‌ల ద్వారా దేశీ యూజర్లు అన్ని రకాల వ్యాపారాలు, సంస్థలతో లావాదేవీలు నిర్వహించారు.

ముఖ్యంగా బ్యాంకింగ్‌ (65 శాతం), షాపింగ్‌/రిటైల్‌ (54 శాతం) విభాగాల్లో ఈ ధోరణి అత్యధికంగా కనిపించింది‘ అని ఐబీఎం పేర్కొంది. ‘పలువురు యూజర్లు యాప్‌లను వాడటానికి ఇష్టపడకపోవడానికి ప్రధాన కారణాలు గోప్యత, భద్రతపై సందేహాలే. అయినప్పటికీ చాలా మంది ఇలాంటి ఏదో ఒక మాధ్యమాన్ని ఎంచుకుంటున్నారు. సర్వేలో పాల్గొన్న ప్రతి పది మందిలో నలుగురు.. షాపింగ్‌ చేసేందుకు లేదా ఆర్డరు చేసేందుకు ఆన్‌లైన్‌ ప్లాట్‌ఫాంను వాడటానికి ఇష్టపడటం లేదు. యాప్‌ లేదా వెబ్‌సైట్‌లో గోప్యతపై (40 శాతం), భద్రతపై (38 శాతం) సందేహాలు ఇందుకు కారణం‘ అని నివేదిక తెలిపింది.
   
అయితే, మహమ్మారి వ్యాప్తి సమయంలో డిజిటల్‌ లావాదేవీలందించే సౌకర్యానికి చాలా మంది వినియోగదారులు కాస్త అలవాటు పడినట్లు ఈ సర్వే ద్వారా తెలుస్తోందని ఐబీఎం టెక్నాలజీ సేల్స్‌ సెక్యూరిటీ సాఫ్ట్‌వేర్‌ సేల్స్‌ లీడర్‌ ప్రశాంత్‌ భత్కల్‌ తెలిపారు. కరోనా పూర్వ స్థాయికి పరిస్థితులు తిరిగి వచ్చినా ఇదే ధోరణి కొనసాగవచ్చని అంచనాలు ఉన్నాయని వివరించారు. భారత్‌ సహా 22 దేశాల్లో నిర్వహించిన సర్వేలో 22,000 మంది (ఒక్కో దేశంలో 1,000 మంది) పాల్గొన్నారు.

మరిన్ని విశేషాలు..

  • మహమ్మారి వ్యాప్తి సమయంలో దేశీ యూజర్లు వివిధ కేటగిరీల్లో సుమారు 19 కొత్త ఆన్‌లైన్‌ ఖాతాలు తెరిచారు. సోషల్‌ మీడియా, వినోదం కోసం సగటున 3 కొత్త ఖాతాలు తీసుకున్నారు.
  • 50 ఏళ్లు పైబడిన వారు వివిధ కేటగిరీల్లో దాదాపు 27 కొత్త ఆన్‌లైన్‌ ఖాతాలు తెరిచారు. ఒక్కో కేటగిరీలో మిగతా వయస్సుల వారికన్నా ఎక్కువ అకౌంట్లు తెరిచారు.
  • దాదాపు సగం మంది (47 శాతం) భారతీయ యూజర్లు చాలా సందర్భాల్లో ఇతర అకౌంట్లకు కూడా ఒకే రకం లాగిన్‌ వివరాలను ఉపయోగిస్తున్నారు. ఇక 17 శాతం మంది కొత్త, పాత వివరాలు కలిపి ఉపయోగిస్తున్నారు. 35-49 ఏళ్ల మధ్య వారిలో దాదాపు సగం మంది యూజర్లు ఇతర అకౌంట్లకు ఉపయోగించిన క్రెడెన్షియల్స్‌నే మళ్లీ మళ్లీ వాడుతున్నారు.
  • వెబ్‌సైట్‌ లేదా యాప్‌ భద్రతపై సందేహాలు ఉన్నప్పటికీ జనరేషన్‌ జెడ్‌ తరం (1990ల తర్వాత, 2000 తొలినాళ్లలో పుట్టిన వారు) మినహా 57 శాతం మంది యూజర్లు.. భౌతికంగా స్టోర్‌కి వెళ్లడం లేదా ఫోన్‌ కాల్‌ ద్వారా ఆర్డర్‌ చేయడం కన్నా డిజిటల్‌గా ఆర్డరు, చెల్లింపులు చేయడానికే ప్రాధాన్యం ఇస్తున్నారు.  
  • తాము సందర్శించే యాప్‌లు, వెబ్‌సైట్లను ఇతర యాప్‌లు ట్రాక్‌ చేసేందుకు యూజర్లు ఇష్టపడటం లేదు. ట్రాకింగ్‌కు సంబంధించి పలు యాప్‌లకు అనుమతులు నిరాకరించినట్లు సర్వేలో పాల్గొన్న వారిలో సగం మంది పైగా వెల్లడించారు. 
  • తమ వ్యక్తిగత డేటా భద్రంగా ఉంచుతాయని యూజర్లు అత్యధికంగా నమ్ముతున్న కేటగిరీల సంస్థల్లో హెల్త్‌కేర్‌ (51 శాతం), బ్యాంకింగ్‌/ఆర్థిక సంస్థలు (56%) ఉన్నాయి. సోషల్‌ మీడియాపై యూజర్లు అత్యంత అపనమ్మకంతో ఉన్నారు. 
Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top