
హ్యుందాయ్ కార్లలో ఉన్న సాంకేతిక లోపాలు, రోడ్ సెఫ్టీ విషయంలో కంపెనీ చెబుతున్న మాటల్లో డొల్లతనాన్ని ఆధారాలతో సహా నిరూపించిన ఓ విజిల్ బ్లోయర్ భారీ బహుమతిని అందుకున్నాడు. వినియోగదారుల భద్రత విజయంలో రాజీ పడొద్దంటూ ఆ ఉద్యోగి ఎంతగా చెప్పినా కంపెనీ యాజమాన్యం వినకపోవడంతో ఈ నిజాలు వెలుగులోకి వచ్చాయి.
దక్షిణ కొరియాకు చెందిన కిమ్ గ్వాంగ్ హో హ్యుందాయ్ మోటార్స్ కంపెనీలో 26 ఏళ్లుగా ఇంజనీరుగా పని చేస్తున్నాడు. ఈ ఘటన జరగడానికి ముందు హ్యుందాయ్‌లో క్వాలిటీ స్ట్రాటజీ టీమ్‌లో ఆయన పని చేశారు. అయితే హ్యుందాయ్‌తో పాటు దాని సబ్సిడరీగా ఉన్న కియా సంస్థ ఉత్పత్తి చేస్తున కార్లలో భద్రపరమైన లోపాలు ఉన్నట్టు కంపెనీ అంతర్గత సమావేశాల్లో అనేక సార్లు కిమ్ గొంతెత్తాడు. అయితే అతని సూచనలను హ్యుందాయ్ మేనేజ్‌మెంట్ బుట్టదాఖలు చేసింది. దీంతో వినియోగదారుల భద్రతకే ప్రాధాన్యత ఇచ్చిన కిమ్ గ్వాంగ్ హో అసలు నిజాలు బయటకు చెప్పారు.
హ్యుందాయ్, కియా నుంచి వస్తోన్న కార్లలో నెలకొన్న భద్రతాపరమైన లోపాలను అమెరికాకు చెందిన నేషనల్ హైవే ట్రాఫిక్ అడ్మినిస్ట్రేషన్ (ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ)కి కిమ్ ఉప్పందించాడు. అతను ఇచ్చిన వివరాల ఆధారంగా ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ పరిశీలించగా లోపాలు నిజమేనని తేలింది. దీంతో హ్యుందాయ్, కియా సంస్థలకు జరిమానాగా వరుసగా 140 మిలియన్లు, 70 మిలియన్ డాలర్లు విధించింది. ఐదేళ్ల కాలపరిమితిలో ఈ మొత్తం చెల్లించాలని ఆదేశించింది.
భద్రతాపరమైన లోపాలు తెలియజేసినందుకు ప్రోత్సాహాకంగా కిమ్‌గ్యాంగ్ హోకి రూ.24 మిలియన్ డాలర్లు (రూ.178 కోట్లు)ను బహుమతిగా ప్రకటించింది ఎన్‌హెచ్‌టీఎస్‌ఏ. వినియోగదారుల భద్రత కోసం నా భవిష్యత్తును ఫణంగా పెట్టినందుకు సరైన న్యాయమే జరిగిందంటూ కిమ్ గ్యాంగ్ హో స్పందించారు. కార్ల భద్రతకు సంబంధించి ప్రజల్లో అవగాహన పెంచేందుకు త్వరలో యూట్యూబ్ ఛానల్ ఏర్పాటు చేయబోతున్నట్టు తెలిపారు. ఈ ఘటనతో మరింత మంది విజిల్ బ్లోయర్లు ముందుకు వస్తారని, మరిన్ని చీకటి నిజాలు ప్రపంచానికి తెలుస్తాయని కిమ్ అన్నారు.