రయ్‌రయ్‌మని... బోయింగ్‌ సర్వీసులకు వీలుగా..

Hyderabad International Airport Expansion Plans - Sakshi

రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టుని భారీ స్థాయిలో అభివృద్ధి చేయనున్నారు. జాతీయ, అంతర్జాతీయ విమానాల రాకపోకలు సుళువుగా సాగేలా మరింతగా విస్తరించనున్నారు. ఈ విస్తరణ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడి నుంచి భారీ విమానాలైన బోయింగ్‌ సర్వీసులు రయ్‌రయ్‌మంటూ రెగ్యులర్‌గా ఎగరనున్నాయి. 

ప్రస్తుతం రాజీవ్‌గాంధీ ఇంటర్నేషనల్‌ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 1.20 మంది ప్రయాణిస్తున్నారు. రోజురోజుకి ఈ ఎయిర్‌పోర్టు ద్వారా రాకపోకలు భారీగా పెరుగుతున్నాయి. కరోనాకి ముందు 2019లో అయితే  ఏకంగా 2.10 కోట్ల మంది ప్రయాణికులు ఈ ఎయిర్‌పోర్టుని ఉపయోగించుకున్నారు. 

ఢిల్లీ, ముంబై, చెన్నై, బెంగళూరుల తరహాలో రాబోయే రోజుల్లో హైదరాబాద్‌ ఎయిర్‌పోర్టుకి మరింత రద్దీ పెరగబోతుంది. ఇక్కడి నుంచి అమెరికా, యూరప్‌లకి నేరుగా విమాన సర్వీసులు ప్రారంభించాలనే డిమాండ్‌ పెరుగుతోంది. దీంతో యూరప్‌, అమెరికా, గల్ఫ్‌ దేశాలకు  నేరుగా సర్వీసులు అందుబాటులోకి వస్తే హైదరాబాద్‌ నుంచి ఏడాదికి 3.4 కోట్ల మంది ఆకాశయానం సాగించే వీలుంది. దీంతో ఆ స్థాయికి తగ్గట్టుగా ఎయిర్‌పోర్టుని భారీగా విస్తరించాలని నిర్ణయించారు. 

అంతర్జాతీయ విమాన సర్వీసుల్లో ఎక్కువగా ఉపయోగించే 93 కోడ్‌ సీ శ్రేణికి చెందిన బోయింగ్‌ 737, 700, ఏ 320 వంటి భారీ విమానాలు రాకపోకలు సాగించేందుకు వీలుగా విమానాశ్రయాన్ని అభివృద్ధి చేయనున్నారు. అందులో భాగంగా వెస్టర్న్‌ అప్రాన్‌లో నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసుల రాకపోకల కోసం కొత్తగా 17 కాంటాక్ట్‌ స్టాండ్‌లను 57,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో నిర్మించనున్నారు. వీటితో పాటు ఒక రిమోట్‌స్టాండ్‌ రానుంది. ఇక దేశీ విమానాల కోసం ఈస్టర్న్‌ అప్రాన్‌లో 25,500 చదరపు మీటర్ల విస్తీర్ణంలో 17 కమాండ్‌స్టాండ్‌లు, నాలుగు రిమోట్‌ స్టాండ్‌లు కొత్తగా అందుబాటులోకి తేనున్నారు. ప్రస్తుతం ఉన్న టెర్మినల్‌ని పూర్తి స్థాయిలో విస్తరించిన తర్వాత ఒకేసారి 93 కోడ్‌ సీ శ్రేణికి చెందిన విమానాలను ఇక్కడి నుంచి ఆపరేట్‌ చేసే అవకాశం కలుగుతుంది. ఇందులో 44 కాంటాక్ట్‌ స్టాండ్స్‌ ఉండగా 49 రిమోట్‌ స్టాండ్స్‌ ఉండనున్నాయి. 

విమానాలు నిలిచే సౌకర్యాలు విస్తరించడంతో పాటు ప్రయాణికులు లగేజ్‌ సులువుగా తీసుకునేందుకు వీలుగా ఓ టన్నెల్‌ మార్గం కూడా నిర్మించనున్నారు. అంతేకాదు ర్యాపిడ్‌ ట్యాక్సి ఎగ్జిట్ మార్గాలను సైతం అందుబాటులోకి తేనున్నారు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top