హైదరాబాద్‌లో తగ్గిన ఇళ్ల అమ్మకాలు, అసలు కారణం ఇదే!

Housing Sales Drop 15% In Top 7 Cities - Sakshi

న్యూఢిల్లీ: హైదరాబాద్‌తోపాటు దేశ వ్యాప్తంగా ఏడు ప్రధాన పట్టణాల్లో ఇళ్ల విక్రయాలు ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మొదటి మూడు నెలల్లో (ఏప్రిల్‌–జూన్‌) 15 శాతం తగ్గాయి. 84,930 యూనిట్లు అమ్ముడయ్యాయి. ఈ వివరాలను ప్రాపర్టీ కన్సల్టెన్సీ సంస్థ అనరాక్‌ ప్రకటించింది. 

ఈ ఏడాది మొదటి మూడు నెలల్లో (జనవరి–మార్చి) ఇళ్ల విక్రయాలు 99,550 యూనిట్లుగా ఉన్నాయి. అయితే గతేడాది ఏప్రిల్‌–జూన్‌ కాలంలో ఇళ్ల విక్రయాలు 24,569 యూనిట్లతో పోలిస్తే 3.5 రెట్లు పెరిగినట్టు తెలుస్తోంది. 
 
హైదరాబాద్‌లో 11,190 యూనిట్లు 

ఏప్రిల్‌–జూన్‌లో హైదరాబాద్‌ మార్కెట్లో 11,190 ఇళ్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది జనవరి–మార్చిలో విక్రయాలు 13,140 యూనిట్లుగా ఉండడం గమనించాలి. ఈ ఏడాది మొదటి మూడు నెలలతో పోలిస్తే, జూన్‌ త్రైమాసికంలో ముంబై మెట్రోపాలిటన్‌ రీజియన్‌లో ఇళ్ల అమ్మకాలు 11 శాతం తగ్గి 25,785 యూనిట్లుగా ఉన్నాయి.

ఢిల్లీ ఎన్‌సీఆర్‌ మార్కెట్లో 19 శాతం తక్కువగా 15,340 యూనిట్లు అమ్ముడుపోయాయి. బెంగళూరులో 14 శాతం తగ్గి 11,505 యూనిట్లుగా ఉన్నాయి. పుణెలో 11 శాతం తగ్గి 12,500 యూనిట్లు, చెన్నైలో 24 శాతం క్షీణించి 3,810 యూనిట్లు అమ్ముడయ్యాయి. కోల్‌కతాలోనూ 20 శాతం తక్కువగా 4,800 యూనిట్లు విక్రయమయ్యాయి. 

కొనుగోలు వ్యయాలు పెరగడం వల్లే.. 
‘‘నిర్మాణ వ్యయాలు పెరిగినందున డెవలపర్లు ప్రాపర్టీల రేట్లను పెంచాల్సి వచ్చింది. ఆర్‌బీఐ రెండు విడతలుగా రేట్ల పెంపుతో గృహ రుణ రేట్లు పైకి ఎగబాకాయి. ఈ రెండు అంశాలతో కొనుగోలు వ్యయం పెరిగిపోయింది. ఇళ్ల విక్రయాలు తగ్గడానికి కారణం ఇదే’’ అని అనరాక్‌ చైర్మన్‌ అనుజ్‌పురి తెలిపారు.

చదవండి👉 దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువే!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top