దేశంలోనే.. మిగిలిన ప్రాంతాలతో పోలిస్తే హైదరాబాద్‌లోనే ఇళ్ల ధరలు తక్కువే!

Mercer 2022 Cost Of Living Survey Least Expensive City Hyderabad - Sakshi

ముంబై: ముంబై అధిక ఖర్చుతో కూడుకున్న మెట్రోగా, హైదరాబాద్‌ను చౌకగా ప్రవాస భారతీయులు భావిస్తున్నారు. జీవన వ్యయాలు, నివాసానికి అయ్యే వ్యయాలను పరిగణనలోకి తీసుకుని ముంబైకి ఈ రేటింగ్‌ ఇచ్చారు. ఆ తర్వాతి స్థానంలో ఢిల్లీ ఉంది. అంతర్జాతీయంగా చూస్తే మాత్రం ముంబై, ఢిల్లీ వ్యయాల పరంగా ఆకర్షణీయంగా ఉన్నట్టు ‘మెర్సర్స్‌ 2022 కాస్ట్‌ ఆఫ్‌ లివింగ్‌ సర్వే’లో తెలిసింది.

అంతర్జాతీయంగా చూస్తే ముంబై ర్యాంకు 127. ఢిల్లీ 155, చెన్నై 177, బెంగళూరు 178, హైదరాబాద్‌ 192వ స్థానంలో ఉన్నాయి. పుణె 201, కోల్‌కతా 203 ర్యాంకుల్లో ఉన్నాయి. ఈ పట్టణాల్లో నివాస, జీవన వ్యయాలు చౌకగా ఉన్నాయని ప్రవాసులు భావిస్తున్నట్టు సర్వేలో వెల్లడైంది. అంతర్జాతీయంగా హాంగ్‌కాంగ్‌ అత్యంత ఖర్చుతో కూడుకున్న నగరంగా నిలిచింది. ఆ తర్వాత జ్యురిచ్, జెనీవా, స్విట్జర్లాండ్‌లోని బాసెల్, బెర్న్, ఇజ్రాయెల్‌ టెల్‌ అవీవ్, అమెరికాలోని న్యూయార్క్, సింగపూర్, టోక్యో, బీజింగ్‌ నగరాలు అధిక వ్యయాలతో అగ్రస్థానాల్లో ఉన్నాయి. ఈ ఏడాది మార్చిలో మెర్సర్స్‌ ఈ సర్వే నిర్వహించింది. 200కు పైగా కమోడిటీల ధరలు, ఇళ్లు, రవాణా, ఆహారం, వస్త్రాలు, ఇంట్లోని వస్తువులు, వినోదానికి చేసే ఖర్చు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకుంది. ప్రపంచవ్యాప్తంగా 227 పట్టణాలను ర్యాంకుల్లోకి తీసుకుంది.  

హైదరాబాద్‌ అనుకూలతలు 
ప్రముఖ బహుళజాతి కంపెనీలు తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ముంబైని అత్యంత అనుకూల నగరంగా భావిస్తున్నాయి. అదే సమయంలో తక్కువ వ్యయాలు ఉండే హైదరాబాద్, చెన్నై, పుణె పట్ల కూడా కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉండడంతో.. హైదరాబాద్, చెన్నై, పుణె నగరాలు తక్కువ వ్యయాలతో ఆకర్షణీయమైన మెట్రోలుగా సర్వే పేర్కొంది. కోల్‌కతాలో జీవన వ్యయాలు తక్కువగా ఉన్నాయి. పాలు, బ్రెడ్, కూరగాయలు, పండ్లను ధరలను పరిగణనలోకి ఈ ర్యాంకులను నిర్ణయించారు. ఢిల్లీ, ముంబైలో మాత్రం వీటి ధరలు అధికంగా ఉన్నాయి. ముంబైలో అధిక వ్యయాలు ఉంటే, చెన్నై, హైదరాబాద్‌లో తక్కువగా ఉన్నాయి. సినిమా చూడాలంటే ముంబైలో చాలా ఖర్చు చేయాలి. హైదరాబాద్‌లో సినిమా చూసేందుకు చేసే ఖర్చు తక్కువ.  

ఇళ్ల ధరలు తక్కువ 
దేశవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లోకి హైదరాబాద్, ఇళ్ల ధరల పరంగా చౌకగా ఉన్నట్టు ఈ నివేదిక ప్రస్తావించింది. కానీ, జీవన వ్యయాలు, నివాస వ్యయాలు (ఇళ్ల అద్దెలు/ధరలు) కలిపి చూస్తే పుణె, కోల్‌కతా కంటే హైదరాబాద్‌ వెనుక ఉంది. ముంబై, ఢిల్లీ, బెంగళూరులో ఇళ్ల అద్దెలు దేశంలోనే అత్యంత ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ జీవన వ్యయాలు చాలా ఎక్కువ ఖర్చుతో కూడినవిగా సర్వే పేర్కొంది.

చదవండి👉 తెలంగాణ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్‌!

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top