తెలంగాణ ప్రభుత్వం మాస్టర్‌ ప్లాన్‌, ఆ ప్రాంతంలోని ఇళ్లకు భారీ డిమాండ్‌!

Housing demand with urban development - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: అర్బన్‌ డెవలప్‌మెంట్‌ మీద ప్రభుత్వం దృష్టిసారించింది. ఓఆర్‌ఆర్‌తో జిల్లా కేంద్రాలకు, మెట్రో రైల్‌తో ప్రధాన నగరంలో కనెక్టివిటీ పెరిగింది. సిటీలో పెద్ద ఎత్తున ఫ్లై ఓవర్లు, అండర్‌పాస్‌లు అందుబాటులోకి వచ్చాయి. దీంతో ప్రయాణ సమయం సగానికి పైగా తగ్గింది. దీంతో అందుబాటు ధరలు ఉండే శివారు ప్రాంతాలలో సైతం గృహాలను కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. ఆఫీస్‌లు పునఃప్రారంభం కావటంతో ఇప్పటికే ఉన్న కంపెనీలతో పాటూ కొత్తవి విస్తరణ చేపట్టాయి. దీంతో ఆఫీస్‌ స్పేస్‌ ఆక్యుపెన్సీ పెరిగింది. ఇది రానున్న రోజుల్లో గృహాల డిమాండ్‌ను ఏర్పరుస్తుందని ఎస్‌ఎంఆర్‌ బిల్డర్స్‌ సీఎండీ రాంరెడ్డి అభిప్రాయపడ్డారు. సాధారణంగా హైదరాబాద్‌లో ఏటా 30–40 వేల గృహాలు డెలివరీ అవుతుంటాయి.

మరో 70–75 వేల యూనిట్లు వివిధ దశలో నిర్మాణంలో ఉంటాయి. అయితే ఈ ఏడాది అదనంగా 1.5 – 2 లక్షల యూనిట్ల అవసరం ఉంటుందని అంచనా వేశారు. ప్రస్తుతం నగరంలో గృహ ప్రవేశానికి సిద్ధంగా ఉన్న యూనిట్ల సంఖ్య చాలా తక్కువగా ఉందని తెలిపారు. దీంతో నాణ్యమైన నిర్మాణం, పెద్ద సైజు యూనిట్లకు డిమాండ్‌ ఉంటుందని పేర్కొన్నారు. పశ్చిమ హైదరాబాద్‌తో పాటూ షాద్‌నగర్, శంకర్‌పల్లి, చేవెళ్ల, ఆదిభట్ల, నాగార్జున్‌ సాగర్‌ రోడ్, శ్రీశైలం జాతీయ రహదారి మార్గంలో డిమాండ్‌ కొనసాగుతుందని వివరించారు. మేడ్చల్, షామీర్‌పేట మార్గంలో ప్రక్క జిల్లాల పెట్టుబడిదారులు చేపట్టే విక్రయాలే ఉంటాయని తెలిపారు. యాదాద్రిని చూపించి వరంగల్‌ రహదారి మార్కెట్‌ను పాడుచేశారని పేర్కొన్నారు.

► నిర్మాణ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశహర్మ్యాలు అని ఆర్భాట ప్రచారానికి వెళ్లకూడదు. అంత ఎత్తులో ప్రాజెక్ట్‌ను చేపట్టే ఆర్థ్ధిక స్థోమత, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయా అనేది విశ్లేషించుకోవాలి. అంతే తప్ప పులిని చూసి నక్క వాతపెట్టుకున్నట్లు తొందరపాటు గురైతే తనతో పాటు కొనుగోలుదారులూ నిండా మునిగిపోతారు. నిర్మాణ అనుమతులు వచ్చాక ప్రాజెక్ట్‌లను లాంచింగ్, విక్రయాలు చేయాలి. దీంతో డెవలపర్, కస్టమర్, బ్యాంకర్, ప్రభుత్వం అందరూ హ్యాపీగానే ఉంటారు. బిల్డర్‌ ప్రొఫైల్‌ను పరిశీలించకుండా, తక్కువ ధర అనగానే తొందరపడి కొనుగోలు చేయవద్దు.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top