హైదరాబాద్‌ మార్కెట్లో అధికంగా ఇళ్ల విక్రయాలు

House sales are highked in Hyderabad market - Sakshi

జూలై–సెప్టెంబర్‌ కాలంలో 35 శాతం వృద్ధి

8 పట్టణాల్లో 49 శాతం అధిక అమ్మకాలు

ప్రాప్‌ టైగర్‌ నివేదిక వెల్లడి

న్యూఢిల్లీ: హైదరాబాద్‌ రియల్టీ మార్కెట్‌ మురిసింది. జూలై–సెప్టెంబర్‌ త్రైమాసికంలో 35 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. 10,570 ఇళ్ల యూనిట్లు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో 7,810 ఇళ్ల యూనిట్లు అమ్ముడు కావడం గమనార్హం. బెంగళూరు కంటే కూడా హైదరాబాద్‌ మార్కెట్‌ తన సత్తా చాటింది. బెంగళూరులో ఇళ్ల విక్రయాలు 20 శాతం వృద్ధితో 7,890 యూనిట్లుగా ఉన్నాయి. క్రితం ఏడాది ఇదే కాలంలో అమ్మకాలు 6,550 యూనిట్లు మాత్రమే.

దేశవ్యాప్తంగా ఎనిమిది ప్రధాన పట్టణాల్లో సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో ఇళ్ల అమ్మకాలు 49 శాతం వృద్ధిని చూశాయి. మొత్తం 83,220 యూనిట్లు విక్రయమైనట్టు ప్రాపర్‌టైగర్‌ పోర్టల్‌ ఈ ఏడాది మూడో త్రైమాసికానికి సంబంధించిన నివేదికలో వెల్లడించింది. ఇళ్ల ధరలు పెరిగినా, వడ్డీ రేట్లు పెరిగినా కానీ, గతంలో నిలిచిన డిమాండ్‌ తోడు కావడంతో ఇళ్ల అమ్మకాలు జోరుగా సాగినట్టు ప్రాప్‌ టైగర్‌ నివేదిక వివరించింది. 2021 సెప్టెంబర్‌ క్వార్టర్‌లో దేశవ్యాప్తంగా ఎనిమిది పట్టణాల్లో అమ్ముడుపోయిన ఇళ్ల యూనిట్లు 55,910గా ఉన్నాయి. అంతేకాదు ఈ పట్టణాల్లో ఇళ్ల అమ్మకాలు కరోనా ముందు నాటి గణాంకాలను మించి నమోదు కావడం డిమాండ్‌ బలంగా ఉన్నట్టు తెలియజేస్తోంది.  

ప్రతికూలతలను అధిగమించి..
రియల్‌ ఎస్టేట్‌ పరిశ్రమ కరోనా మహమ్మారి, తదనంతర అవరోధాలను అధిగమించినట్టు ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ గ్రూపు సీఎఫ్‌వో వికాస్‌ వాధ్వాన్‌ తెలిపారు. గృహ రుణాల రేట్లు పెరిగినప్పటికీ ఇళ్లకు డిమాండ్‌ తగ్గలేదన్నారు. సొంతిల్లు కలిగి ఉండాలన్న ఆకాంక్షే డిమాండ్‌ పుంజుకోవడానికి కారణంగా పేర్కొన్నారు. మార్కెట్‌ ధోరణులను పరిశీలిస్తే రానున్న త్రైమాసికాల్లో నివాసిత గృహాలకు సానుకూల డిమాండ్‌ ఉంటుందని తెలుస్తోందని ప్రాప్‌ టైగర్‌ డాట్‌ కామ్‌ రీసెర్చ్‌ హెడ్‌ అంకితా సూద్‌ తెలిపారు. పండుగల తగ్గింపులు, సులభతర చెల్లింపుల ప్లాన్లు ఇవన్నీ కలసి డిమాండ్‌ను బలంగా నిలబెడతాయని అంచనా వేశారు.

పట్టణాల వారీగా..   
► ముంబైలో ఇళ్ల విక్రయాలు సెప్టెంబర్‌ క్వార్టర్‌లో 28,800 యూనిట్లుగా ఉన్నాయి. అంతక్రితం ఏడాది ఇదే కాలంలో విక్రయాలు 14,160 యూనిట్లతో పోలిస్తే రెట్టింపయ్యాయి.  

► పుణెలో 55 శాతం పెరిగి 15,700 యూనిట్లు అమ్ముడుపోయాయి.

► అహ్మదాబాద్‌ మార్కెట్లోనూ 44 శాతం అధికంగా ఇళ్ల విక్రయాలు నమోదయ్యాయి. ఇక్కడ 7,880 యూనిట్ల విక్రయాలు జరిగాయి.

► చెన్నై, కోల్‌కతా మార్కెట్లో అమ్మకాలు క్షీణించాయి. చెన్నై మార్కెట్లో 6 శాతం తగ్గి 4,420 యూనిట్లు, కోల్‌కతా మార్కెట్లో 4 శాతం తగ్గి 2,530 యూనిట్ల అమ్మకాలకు పరిమితమయ్యాయి.   

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top