Hindenburg Research: త్వరలో హిండెన్‌బర్గ్‌ మరో బాంబ్‌.. ఈసారి ఎవరి వంతో..!

Hindenburg says Another Big Report Soon - Sakshi

వివాదస్పద నివేదికతో అదానీ గ్రూప్‌ను దెబ్బ కొట్టిన అమెరికాకు చెందిన షార్ట్ సెల్లింగ్ ఇన్వెస్ట్‌మెంట్ రీసెర్చ్ సంస్థ హిండెన్‌బర్గ్ మరో బాంబ్‌ పేల్చేందుకు సిద్ధమైంది. కార్పొరేట్ మోసాలు, అక్రమాలను బహిర్గతం చేస్తూ మరో ‘పెద్ద’ నివేదికను త్వరలో విడుదల చేస్తామని ట్విటర్‌ ద్వారా హిండెన్‌బర్గ్‌ తెలియజేసింది. అయితే ఈసారి హిండెన్ బర్గ్ ఎవరిని లక్ష్యం చేసుకుందోనన్న ఆందోళన మార్కెట్‌ వర్గాల్లో మొదలయింది.

ఏమిటీ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌?
ఈక్విటీ, క్రెడిట్, డెరివేటివ్‌లను విశ్లేషించే ఫోరెన్సిక్ ఆర్థిక పరిశోధన సంస్థ హిండెన్‌బర్గ్ రీసెర్చ్‌. ఈ సంస్థను 2017లో నాథన్ ఆండర్సన్ స్థాపించారు.  పెద్ద పెద్ద కంపెనీల్లో జరిగే అకౌంటింగ్ అక్రమాలు, దుర్వినియోగం, బహిర్గతం చేయని లావాదేవీలను ఈ సంస్థ శోధించి బయటపెడుతుంది. ఇందుకోసం కంపెనీ తన సొంత మూలధనాన్ని ఖర్చు పెడుతుంది. హిండెన్‌బర్గ్ వెబ్‌సైట్ పేర్కొన్న దాని ప్రకారం..  2017 నుంచి ఇప్పటివరకు 16 కంపెనీల్లో అవకతవకలను గుర్తించి బయటపెట్టింది.

అదానీ గ్రూప్‌పై ఆరోపణలతో కుదుపు
ఇక్కడి వరకు బాగానే ఉన్నా.. అదానీ గ్రూప్‌ అక్రమాలకు పాల్పడిదంటూ గత జనవరి 24న హిండెన్‌బర్గ్ రీసెర్చ్ రిపోర్ట్‌ను వెలువరించింది. దాన్ని మరుసటి రోజున ట్విటర్‌లో షేర్ చేసింది. మాజీ సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లతో సహా అదానీ గ్రూప్‌తో సంబంధం ఉన్న అనేక మందితో  మాట్లాడి, వేలాది డాక్యుమెంట్‌లను పరిశీలించి ఈ నివేదిక వెలువరించినట్లు హిండెన్‌బర్గ్‌ పేర్కొంది. అయితే హిండెన్ బర్గ్ నివేదిక పట్ల చాలా అనుమానాలున్నాయి. కేవలం తాను షార్ట్ సెల్లింగ్ చేసేందుకు గాను, అంటే తనకు ప్రయోజనం కల్పించుకునేందుకు హిండెన్ బర్గ్ ఆరోపణలు గుప్పించిందని పలువురు విమర్శించారు. దీనిపై సుప్రీంకోర్టులోనూ పిటిషన్లు దాఖలయ్యాయి. ఈ వ్యవహారం మీద సమగ్ర దర్యాప్తు చేసి నిజాలు నిగ్గు తేల్చాలంటూ SEBI సెబీని సుప్రీంకోర్టు ఆదేశించింది.

(చదవండి : హిండెన్ బర్గ్ పై హరీష్ సాల్వే వ్యాఖ్యలు)

ఇదీ చదవండి: ఈ కంపెనీ ఉద్యోగులు ఎంత అదృష్టవంతులో..! ఐదేళ్ల జీతం బోనస్‌ 

ఈ నివేదిక వెలువడిన ఐదు వారాల్లోనే అదానీ గ్రూప్ మార్కెట్ విలువ 150 బిలియన్‌ డాలర్లకుపైగా తుడిచిపెట్టుకుపోయింది. దేశంలోనే అత్యంత ధనవంతుడుగా ఉన్న గౌతమ్ అదానీ వెనుకబడిపోయాడు. అదానీ గ్రూప్ కూడా ఊహించని విధంగా పూర్తిగా సబ్‌స్క్రైబ్ చేసిన రూ.20,000 కోట్ల ఎఫ్‌పీవోను  ఉపసంహరించుకుంది. అయితే హిండెన్‌బర్గ్‌ ఆరోపణలను అదానీ గ్రూప్‌ కొట్టిపారేసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top