
ప్రస్తుత రోజుల్లో క్రెడిట్ కార్డుల వినియోగం విస్తృతంగా పెరిగిపోయింది. దాదాపు అన్ని బ్యాంకులు క్రెడిట్ కార్డులు జారీ చేస్తుంటాయి. వీటితో పలు ఇతర సంస్థలూ క్రెడిట్ కార్డులు ఇస్తున్నాయి. వీటిలో అనేక రకాలు ఉన్నాయి. క్రెడిట్ కార్డులకు సాధారణంగా వార్షిక రుసుము ఉంటుంది. ఇది కార్డు రకాన్ని, జారీ చేసే బ్యాంకు, సంస్థను బట్టి ఉంటుంది. కానీ ఎలాంటి రుసుము లేకుండా జీవితకాల ఉచిత క్రెడిట్ కార్డులూ కొన్ని సంస్థలు లేదా బ్యాంకులు ఇస్తున్నాయి. ఉచితమే కదా చాలామంది వీటిని తీసుకుంటున్నారు. అయితే ఎలాంటి రుసుము లేకపోయినప్పటికీ కంటికి కనిపించని కొన్ని ఛార్జీలు వీటికి ఉంటాయి. 'లైఫ్ టైమ్ ఫ్రీ' అయిన క్రెడిట్ కార్డుల విషయంలో దాగిఉన్న ఖర్చులు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..
అధిక వడ్డీ రేట్లు
వార్షిక రుసుములు లేనప్పటికీ, ఈ కార్డులు అధిక వడ్డీ రేట్లను కలిగి ఉండవచ్చు. తద్వారా మీ కార్డు వాడకం మరింత ఖరీదైనదిగా మారుతుంది. 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసేటప్పుడు దీన్ని పరిగణనలోకి తీసుకోవాలి.
విదేశీ లావాదేవీ మార్పిడి రుసుము
వార్షిక రుసుము లేనప్పటికీ, ఈ కార్డులకు ఫారెక్స్ మార్క్-అప్ ఫీజు (2 నుండి 4 శాతం మధ్య) ఉండవచ్చు. ఇది యూఎస్ డాలర్ లేదా బ్రిటిష్ పౌండ్లు వంటి విదేశీ కరెన్సీలో ఏదైనా ఉత్పత్తి లేదా సర్వీస్ కోసం చెల్లింపు సమయంలో వసూలు చేస్తారు. . 'లైఫ్ టైమ్ ఫ్రీ' క్రెడిట్ కార్డు పొందే సమయంలో ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి.
ఓవర్ లిమిట్ ఫీజు
మీరు నగదు ఉపసంహరణను ఎంచుకున్నప్పుడు లేదా క్రెడిట్ లిమిట్ దాటి కార్డును ఉపయోగించినప్పుడు, బ్యాంకు దానిపై ఓవర్ లిమిట్ ఫీజును విధించవచ్చు. ఇది గుర్తుంచుకోవలసిన మరొక అంశం.
ఆలస్య చెల్లింపు పెనాల్టీలు
కార్డు జీవితకాలం ఉచితం అయినప్పటికీ క్రెడిట్ కార్డు బిల్లును సకాలంలో చెల్లించనప్పుడు ఆలస్య చెల్లింపు పెనాల్టీలు ఉండవచ్చు. ఇది ఇతర కార్డుల కంటే ఎంత ఎక్కువగా ఉందో చూసుకోవాలి.
ఇనాక్టివిటీ ఫీజులు
కొంత మంది కార్డును తరచుగా ఉపయోగించరు. దీనికిగానూ కొన్ని కార్డు ప్రొవైడర్ సంస్థలు రుసుము విధించవచ్చు. మునుపటి సంవత్సరంలో మొత్తం ఖర్చు ఒక పరిమితిని దాటినప్పుడు మాత్రమే బ్యాంకులు కొన్ని కార్డులకు వార్షిక రుసుమును మాఫీ చేస్తాయి.
ప్రాసెసింగ్ ఫీజు
ఇది బ్యాంకులు విధించే సాధారణ రుసుము కానప్పటికీ, ప్రాసెసింగ్ లేదా నిర్వహణ ఖర్చుల కోసమంటూ దీన్ని బ్యాంకులు చేస్తాయి. ఇది మీ కార్డుకు సాధారణంగానే ఉందా లేదా మరీ ఎక్కువగా ఉందా అన్న అన్న విషయాన్ని గమనించాలి.