10 కోట్ల మందికి ‘హీరో’

Hero MotoCorp crosses 100-mn milestone in cumulative production - Sakshi

హైదరాబాద్, బిజినెస్‌ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్‌ గొప్ప రికార్డు సృష్టించింది. కంపెనీ ప్రారంభమైన 1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 కోట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేసి మరో మైలురాయిని అధిగమించింది. భారత్‌ నుంచి ఈ రికార్డు సాధించిన తొలి వాహన కంపెనీగా పేరు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న సంస్థగా వరుసగా 20 ఏళ్లుగా తన అగ్రస్థానాన్ని హీరో మోటోకార్ప్‌ పదిలపరుచుకుంది.

తొలి 10 లక్షల యూనిట్లు అమ్మడానికి సంస్థకు 10 ఏళ్ల సమయం పట్టింది. 2004 నాటికి 1 కోటి, 2013 నాటికి 5 కోట్ల యూనిట్ల మార్కును చేరుకుంది. ఇక గడిచిన ఏడేళ్లలోనే 5 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేయడం విశేషం. సంస్థ పట్టుదల, కలల ఫలానికి ఈ మైలురాయి చిహ్నం అని హీరో మోటోకార్ప్‌ చైర్మన్, సీఈవో పవన్‌ ముంజాల్‌ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల ఆదరణ, నమ్మకం, కంపెనీ సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు.

ప్రతి ఏటా 10 మోడళ్లు..: వృద్ధి ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని పవన్‌ ముంజాల్‌ తెలిపారు. ‘నూతన మోడళ్ల పరిశోధన, అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు పెడతాం. మొబిలిటీ రంగంలో కొత్త, ప్రత్యామ్నాయ పరిష్కారాలపై దృష్టిసారిస్తాం. ప్రపంచ అవసరాల కోసం భారత్‌లో వాహనాలను తయారు చేస్తున్నాం. అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తాం. రానున్న అయిదేళ్లపాటు కొత్త వేరియంట్లు, అప్‌గ్రేడ్స్‌తో కలిపి ఏటా 10 మోడళ్లను పరిచయం చేస్తాం’ అని తెలిపారు.   

సెలబ్రేషన్‌ ఎడిషన్‌ మోడల్స్‌..
కొత్త మైలురాయిని అందుకున్న శుభ సందర్భంగా హీరో మోటోకార్ప్‌ ఆరు సెలబ్రేషన్‌ ఎడిషన్‌ మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో స్ప్లెండర్‌ ప్లస్, ఎక్స్‌ట్రీమ్‌ 160ఆర్, ప్యాషన్‌ ప్రో, గ్లామర్, డెస్టిని 125, మాయెస్ట్రో ఎడ్జ్‌ 110 ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఇవి షోరూముల్లో అందుబాటులో ఉంటాయి.  

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top