రికార్డు స్థాయిలో విదేశాలకు హీరో ద్విచక్ర వాహనాల ఎగుమతులు

Hero MotoCorp Breaks Overseas Sales Record in 2021 - Sakshi

ద్విచక్ర వాహనాల ఎగుమతుల పరంగా ప్రపంచంలోనే అతిపెద్ద తయారీ సంస్థ హీరో మోటోకార్ప్ 2021లో కొత్త రికార్డు సృష్టించింది. 2021 ఏడాది కాలంలో భారతీయ, ప్రపంచ ఆటోమోటివ్ పరిశ్రమకు సవాళ్లు ఎదురైనప్పటికి హీరో మోటోకార్ప్ అత్యధిక సంఖ్యలో 2.89 లక్షల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేసింది. ఏ సంవత్సరంలో నమోదు చేయని విధంగా భారత్‌తో సహా, ఇతర దేశాల్లో అత్యధిక విక్రయాలను నమోదు చేసింది. హీరో మోటోకార్ప్ గత సంవత్సరంలో ఆసియా, ఆఫ్రికా, దక్షిణ & మధ్య అమెరికా, కరేబియన్ ప్రాంతంలో తన మార్కెట్ విస్తరించింది. 

ఈ మార్కెట్ విస్తరణ వల్ల భారతదేశం వెలుపల మార్కెట్లలో అమ్మకాల పరంగా 71 శాతం పెరుగుదలను నమోదు చేసింది.  2020లో విదేశీ మార్కెట్లలో 1.69 లక్షల యూనిట్లతో పోలిస్తే ఈ సంఖ్య (2.89 లక్షల యూనిట్లు) చాలా ఎక్కువ. కానీ, హీరో మోటోకార్ప్ తన పనితీరుతో సంతృప్తిగా లేదు. "ప్రస్తుతం ఉన్న కోవిడ్-19 మహమ్మారి కారణంగా గ్లోబల్ లాజిస్టిక్స్, సప్లై ఛైయిన్ లో ఉన్న అడ్డంకులను దృష్టిలో ఉంచుకొని ఈ క్యాలెండర్ సంవత్సరంలో ప్రపంచ మార్కెట్లలో విక్రయాలు ప్రణాళికలకు అనుగుణంగా ఉన్నాయి" అని సంజయ్ భాన్, హెడ్ - గ్లోబల్ బిజినెస్, హీరో మోటోకార్ప్ అన్నారు. "2025 నాటికి గ్లోబల్ బిజినెస్ అమ్మకాల వాటా కంపెనీ మొత్తం వాటాలో 15% చేరుకోవడానికి లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్లు" తెలిపారు. 

హీరో మోటోకార్ప్ ప్రస్తుతం 42 దేశాలకు ద్విచక్ర వాహనాలను ఎగుమతి చేస్తుంది. భారత్‌తో సహా గ్లోబల్‌ మార్కెట్లలో ఎలక్ట్రిక్‌ వాహనాలను విడుదల చేసేందుకు హీరో మోటోకార్ప్‌ ప్రణాళికలను రచిస్తోందని కంపెనీ ఒక ప్రకటనలో వెల్లడించారు. ఈ ఏడాది మార్చి నెలలో తన మొదటి ఎలక్ట్రిక్ వెహికల్ (EV)ని ఆవిష్కరించడానికి సిద్ధమవుతోంది. ఈ వాహనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని చిత్తూరులోని కంపెనీ తయారీ కేంద్రంలో ఉత్పత్తి కానున్నట్లు తెలుస్తోంది. డిసెంబరులో, హీరో మోటోకార్ప్ దేశీయ మార్కెట్లో 3,94,773 యూనిట్లను విక్రయించింది.

(చదవండి: భారత మార్కెట్లలో కియా మోటార్స్‌ ప్రభంజనం..!)

 

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top