హెచ్‌డీఎఫ్‌సీ లాభం అప్‌

HDFC Ltds Q3 net up 11percent YoY to Rs 3,261 cr - Sakshi

క్యూ3లో రూ. 5,837 కోట్లు

ముంబై: ప్రైవేట్‌ రంగ మార్టిగేజ్‌ దిగ్గజం హెచ్‌డీఎఫ్‌సీ లిమిటెడ్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2021–22) మూడో త్రైమాసికంలో పటిష్ట ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్‌ ప్రాతిపదికన అక్టోబర్‌–డిసెంబర్‌(క్యూ3)లో నికర లాభం 13 శాతం పుంజుకుని రూ. 5,837 కోట్లను తాకింది. మొత్తం ఆదాయం మాత్రం రూ. 39,268 కోట్ల నుంచి రూ. 31,308 కోట్లకు క్షీణించింది. ఇక స్టాండెలోన్‌ నికర లాభం 11 శాతం వృద్ధితో రూ. 3,261 కోట్లకు చేరింది. గతేడాది(2020–21) ఇదే కాలంలో రూ. 2,926 కోట్లు ఆర్జించింది. కాగా.. నికర వడ్డీ ఆదాయం రూ. 4,005 కోట్ల నుంచి రూ. 4,284 కోట్లకు బలపడింది.

ఏయూఎం ప్లస్‌: గృహ రుణాల్లో విలువరీత్యా 13 శాతం వరకూ ఆర్థికంగా వెనుకబడినవారు, తక్కువ ఆదాయం గలవారికి మంజూరు చేసినట్లు హెచ్‌డీఎఫ్‌సీ వైస్‌చైర్మన్, సీఈవో కేకి ఎం. మిస్త్రీ పేర్కొన్నారు. ఈ విభాగంలో సగటు రుణ పరిమాణం రూ. 11.1–19.5 లక్షలుగా వెల్లడించారు. గృహ రుణ కస్టమర్లలో 2.7 లక్షల మంది రుణ ఆధారిత సబ్సిడీలను అందుకుంటున్నట్లు వెల్లడించారు.

ఈ పథకంకింద రూ. 45,914 కోట్ల రుణాలు విడుదల చేయగా.. సబ్సిడీ మొత్తం రూ. 6,264 కోట్లని తెలియజేశారు. క్యూ3లో నిర్వహణలోని ఆస్తులు(ఏయూఎం) రూ. 5,52,167 కోట్ల నుంచి రూ. 6,18,917 కోట్లకు బలపడినట్లు హెచ్‌డీఎఫ్‌సీ తెలియజేసింది. వీటిలో వ్యక్తిగత రుణాల వాటా 79 శాతంకాగా.. అనుబంధ సంస్థ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌కు రూ. 7,468 కోట్ల రుణాలను అసైన్‌ చేసినట్లు వెల్లడించింది. అందుబాటు ధరల గృహాలతోపాటు.. అధిక విలువలుగల ప్రాపర్టీల రుణాలకు సైతం భారీ డిమాండ్‌ కనిపిస్తున్నట్లు మిస్త్రీ పేర్కొన్నారు. కంపెనీ కనీస మూలధన నిష్పత్తి(సీఏఆర్‌) 22.4 శాతంగా నమోదైంది.
ఫలితాల నేపథ్యంలో హెచ్‌డీఎఫ్‌సీ షేరు  2 శాతం లాభపడి రూ. 2,617 వద్ద ముగిసింది.

Read latest Business News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top